కూటమిలో గొడవలు వస్తాయ్.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు!
అయితే డిప్యూటీ సీఎం చేసిన ఆ వ్యాఖ్యలు కూటమి భవిష్యత్తు కోసమేనంటూ అధికార పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
By: Tupaki Political Desk | 23 Dec 2025 4:49 PM ISTడిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 15 ఏళ్ల వరకు కూటమిగానే కొనసాగుతామని పదే.. పదే చెబుతున్న ఉప ముఖ్యమంత్రి తాజాగా అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడారు. కూటమిలో గొడవలు వస్తాయని, అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని జనసైనికులు, వీర మహిళలకు కర్తవ్యబోధ చేశారు. అయితే డిప్యూటీ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. పవన్ ఇలా ఎందుకు మాట్లాడారు? అన్నది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. కూటమిలో గొడవలు రాకుండా ఉంటాయా? అని ఎదురుచూస్తున్న విపక్షం వైసీపీ కూడా పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిశీలిస్తోందని అంటున్నారు. అయితే డిప్యూటీ సీఎం చేసిన ఆ వ్యాఖ్యలు కూటమి భవిష్యత్తు కోసమేనంటూ అధికార పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి పవన్ మాటలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.
జనసేన పార్టీ తరఫున నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్వహించిన సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు పొందిన వారు జాగ్రత్తగా నడుచుకోవాలని చెబుతూనే.. భవిష్యత్తును ఊహించినట్లుగా కొద్ది రోజుల్లో జరగబోయే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలపై డిప్యూటీ సీఎం ప్రత్యేక విశ్లేషణ చేశారు. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల్లో సీట్ల వాటాల్లోనో.. మరో దానిలోనో గొడవలు, ఇబ్బందులు తప్పవు. అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. పదవి అనేది అలంకారం కాదు. బాధ్యత. రాష్ట్రంలో సమస్యలు అన్నీ తీసుకువచ్చి నా భుజాలపై వేస్తే కుంగిపోతాను. కాబట్టి మీరు కూడా కొంత బాధ్యత, బరువు పంచుకోవాలి’’ అంటూ పవన్ వ్యాఖ్యానించారు. జనసేన లీడర్లకు బాధ్యతలు అప్పగిస్తూనే భవిష్యత్తుపై హెచ్చరికలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు.
కూటమి అధికారంలోకి రావడానికి కీలకంగా పనిచేసిన జనసేనకు పదవులలో వాటాతోపాటు అధికారంలో భాగం పంచాలని జనసైనికులు బలంగా కోరుకుంటున్నారు. రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ మధ్య మంచి సమన్వయంతోపాటు ఇద్దరూ జోడెద్దుల్లా పనిచేస్తూ ముందుకు వెళుతున్నారని అంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో.. మరికొన్నిచోట్లు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిల స్థాయిలోనూ సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అంటున్నారు. చాలాచోట్ల వివాదాలు ముదిరిపోయి ఇరుపార్టీల కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారనే వార్తలు వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి పవన్, టీడీపీ యువనేత నారా లోకేశ్ తరచూ తమ పార్టీ కార్యకర్తలకు హితబోధ చేస్తున్నారని అంటున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఇరు పార్టీల కార్యకర్తలు, నేతల మధ్య సీట్ల పంపకాలు, ఇతర విషయాల్లో భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉందని టీడీపీ, జనసేన నేతలు అంచనా వేస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విభేదాలు తీవ్రమైతే భవిష్యత్తులో రాజకీయంగా పరిణామాలు దుష్ఫలితాలు ఇచ్చే ప్రమాదం ఉందనే ఆలోచనతో డిప్యూటీ సీఎం పవన్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. కూటమి అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదని.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నేతలు కూడా కలిసిమెలిసి ఉండాలనే సందేశం పంపేలా పవన్ తాజా వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాలలో తేడా వచ్చినా తాము విడిపోయే పరిస్థితి ఉండదని, ఆ విషయం దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సర్దుకుని పనిచేయాలన్నట్లు పవన్ మాటలు ఉన్నాయని అంటున్నారు.
