Begin typing your search above and press return to search.

ఏమయ్యా బాలరాజు.. నీవల్ల జనసేనకు ఏం ప్రయోజనం?

నీతి, నిజాయితీతో పార్టీని నడపాలని భావిస్తున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వస్తున్న ఫిర్యాదులు తలనొప్పిగా మారుతున్నాయని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   10 Oct 2026 12:25 PM IST
ఏమయ్యా బాలరాజు.. నీవల్ల జనసేనకు ఏం ప్రయోజనం?
X

‘‘ఏమిరా బాలరాజు... ఏమిరా నీవల్ల దేశానికి ఉపయోగం?’’ ఇది ఓ తెలుగు సినిమాలో పాపులర్ డైలాగ్. కానీ, ఇప్పుడు ఇదే డైలాగ్ ను కాస్త మార్చి రాసుకోవాల్సివస్తోంది. అవును, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వైఖరితో జనసేన పార్టీ తీవ్రంగా మదనపడుతోంది. ఎన్నికైన తొలి నెల నుంచే ఎమ్మెల్యేపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని అంటున్నారు. తాజాగా ఆయన వ్యవహారశైలిపై మరోసారి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జనసేన అధిష్టానం సీరియస్ అయిందని చెబుతున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేపై వచ్చిన ఫిర్యాదుల పరిశీలనకు పార్టీ పరంగా హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిసింది.

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారశైలి తొలి నుంచి వివాదాస్పదంగానే ఉందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన కారణంగా నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయిందనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఆయన కుటుంబ సభ్యుల పెత్తనం, గతంలో ఈ ఆరోపణలపై పార్టీ అధిష్టానం వివరణ తీసుకున్నా ఆయన వైఖరిలో మార్పు రాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై విచారణకు ఆదేశించినట్లు చెబుతున్నారు.

పవన్ సీరియస్

నీతి, నిజాయితీతో పార్టీని నడపాలని భావిస్తున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వస్తున్న ఫిర్యాదులు తలనొప్పిగా మారుతున్నాయని అంటున్నారు. పద్ధతిగా నడుచుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని పదేపదే చెబుతున్నా, పార్టీ ఎమ్మెల్యేలు మాట వినడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఇక పోలవరం ఎమ్మెల్యే బాలరాజు వ్యవహార శైలిపై పవన్ పూర్తి అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలు, క్యాడర్ ను విస్మరించడం, కుటుంబ వివాదాలు రచ్చకెక్కడాన్ని పవన తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వివాదాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా బాలరాజుపై చర్యలు ఉంటాయని అంటున్నారు.

క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి

ఎమ్మెల్యే బాలరాజు వైఖరిపై జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఆయన విజయం కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులను విస్మరించి కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పార్టీలో ప్రభుత్వ వ్యవహారాల్లో ఎమ్మెల్యే బంధువులపైనా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని చెబుతున్నారు. దీంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం అన్నవిధంగా పార్టీ చీలిపోయిందని అంటున్నారు. పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజి కింద గిరిజనేతులకు ప్రభుత్వం కేటాయించే భూముల్లో ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు పత్రికల్లో కథనాలు రావడంపైనా పార్టీ సీరియస్ అయిందని అంటున్నారు. మొత్తంగా ఎమ్మెల్యేగా బాలరాజు గెలిచిన 28 నెలల్లో ఆయన వల్ల పార్టీకి ఎక్కువగా నష్టమే జరిగిందని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.