Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ వార్ లోకి పవర్ స్టార్!.. రేవంత్ రెడ్డి వ్యూహానికి బీజేపీ చెక్

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆంధ్రా సెటిలర్లతోపాటు సినీ కార్మికులు భారీగా ఉన్నారు. దాదాపు 30 వేల మంది సినీ కార్మికులకు ఈ నియోజకవర్గంలో ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   5 Nov 2025 9:00 PM IST
జూబ్లీహిల్స్ వార్ లోకి పవర్ స్టార్!.. రేవంత్ రెడ్డి వ్యూహానికి బీజేపీ చెక్
X

హోరాహోరీగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ నెల 11న జరగనున్న ఉప ఎన్నికకు ప్రచారానికి ఇంకా నాలుగు రోజులే మిగిలివుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోవైపు ప్రచారాన్ని ఊర్రూతలూగిస్తున్నారు. ఈ విషయంలో కాస్త వెనకబడినట్లు కనిపిస్తున్న బీజేపీ మాస్టర్ స్కెచ్ వేసింది. తమ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా ఎన్డీఏ భాగస్వామి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను రంగంలోకి దింపాలని ప్లాన్ చేసింది. జూబ్లీహిల్స్ లో ఒక రోజు పవన్ తో ప్రచారం చేయించాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ రాష్ట్ర నేతలు.. జనసేన పార్టీ నేతలతో సంప్రదించినట్లు చెబుతున్నారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆంధ్రా సెటిలర్లతోపాటు సినీ కార్మికులు భారీగా ఉన్నారు. దాదాపు 30 వేల మంది సినీ కార్మికులకు ఈ నియోజకవర్గంలో ఉన్నాయని అంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఓట్లు ఉండగా, గత నాలుగు సార్లు సరాసరి 50 శాతానికి మించి ఓటింగు జరగలేదు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా 50 నుంచి 60 శాతం ఓటింగు మాత్రమే జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సినీ కార్మికుల ఓట్లు 30 వేలు కీలకంగా భావిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రా సెటిలర్లు, కాపు సామాజికవర్గం ఓటర్లు సైతం గణనీయంగానే ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక ఎన్డీఏ భాగస్వామిగా జనసేన అధినేత పవన్ ను ప్రచారంలోకి తీసుకువచ్చి సినీ కార్మికులతోపాటు ఆంధ్రా సెటిలర్ల ఓట్లు ఆకట్టుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్డీఏలో మరో కీలక భాగస్వామి టీడీపీకి కూడా ఈ నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉందని అంటున్నారు. అయితే తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ను జూబ్లీహిల్స్ ప్రచారానికి తీసుకురాలేని పరిస్థితిని బీజేపీ ఎదుర్కోంటోందని అంటున్నారు. మరోవైపు టీడీపీ కూడా జూబ్లీహిల్స్ లో ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని, కార్యకర్తలు మనోభీష్టానికి తగినట్లు నడుచుకోవాలని ప్రకటించింది. దీంతో టీడీపీ ఓట్లు ఎటువైపు మొగ్గు చూపుతాయనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.

అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ టీడీపీ సానుకూల ఓటు బ్యాంకుతోపాటు సినీ కార్మికుల ఓట్లకు గాలం వేస్తున్నారని కొన్ని రోజులుగా ఆయన ప్రచార తీరును గమనిస్తున్న వారు చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ కు సినీ రంగంలో పలువురితో మంచి సంబంధాలు ఉన్నాయి. సినీ హీరో సుమన్ కూడా నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేశారు. అంతేకాకుండా, పలు కార్మిక సంఘాల నేతలను శ్రీశైలం యాదవ్ సంప్రదిస్తున్నారు. మరోవైపు అమీర్ పేట మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి టీడీపీ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. దీంతో బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదిపిందని అంటున్నారు. పవన్ ద్వారా ప్రచారం చేయించి ఓటింగును మెరుగుపరచుకోవాలని భావిస్తోందని అంటున్నారు. 2023 ఎన్నికల్లో జనసేనతో పొత్తుపెట్టుకుని బీజేపీ పోటీ చేసింది. నగరంలోని కొన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయడంతో పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. దీంతో తాజా ఎన్నికల్లో ఆయనతో రోడ్ షో నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు చేస్తున్న బీజేపీ త్వరలో పవన్ టూర్ షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.