Begin typing your search above and press return to search.

విజయ్ కి భారీ ఆఫర్...కీలకంగా పవన్ ?

తమిళనాడు రాజకీయాల్లో జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలకం కాబోతున్నారా అంటే ప్రచారం చూస్తే కనుక అవును అనే జవాబు వస్తోంది.

By:  Satya P   |   14 March 2026 7:00 PM IST
విజయ్ కి భారీ ఆఫర్...కీలకంగా పవన్ ?
X

తమిళనాడు రాజకీయాల్లో జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలకం కాబోతున్నారా అంటే ప్రచారం చూస్తే కనుక అవును అనే జవాబు వస్తోంది. పవన్ కళ్యాణ్ ఎన్డీయేలో ముఖ్య భాగస్వామిగా ఉన్నారు. ఆయన మీద కేంద్ర బీజేపీ పెద్దలకు ఎంతో నమ్మకం ఉంది. ఇక తమిళనాడులో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించి తీరాలని కమల నాధులు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమకు అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని విడిచిపెట్టకూడదని భావిస్తున్నారు. అలాగే గెలుపునకు అవసరమైన కొత్త వ్యూహాలను సైతం అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో అసాధ్యాలను సుసాధ్యం చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు.

ద్విముఖ పోటీగా :

పవన్ సౌత్ ఇండియా మొత్తం తెలిసిన తెలుగు సూపర్ స్టార్. పవన్ కి తమిళ సూపర్ స్టార్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇపుడు దానినే ఆసరాగా చేసుకుని బీజేపీ పెద్దలు అటు వైపు నుంచి కూడా నరుక్కు రావాలని చూస్తున్నారుట. విజయ్ తమిళ సూపర్ స్టార్. ఆయన టీవీకే పార్టీ పెట్టారు. ఏ సర్వే చూసినా విజయ్ పార్టీకి డబుల్ డిజిట్ ఓటు షేర్ లభిస్తుందని కచ్చితంగా చెప్పేస్తున్నాయి. విజయ్ ప్రభావం ఈసారి తమిళనాడు ఎన్నికల మీద గణనీయంగా ఉంటుందని కూడా పేర్కొంటున్నాయి. దాంతో విజయ్ కనుక ఒంటరిగా పోటీ చేస్తే ఈ ఓట్లు చీలి ప్రతిపక్షంలోని అన్నా డీఎంకే బీజేపీ కాంబోకే దెబ్బ పడి అధికార డీఎంకేకు ఎంతో మేలు జరుగుతుంది అని అంటున్నారు. దాంతో ఇపుడు విజయ్ పార్టీని తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా త్రిముఖ పోటీని ద్విముఖ పోటీగా మార్చాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు.

పవన్ చేతిలోనే :

అందుకోసం పవన్ కళ్యాణ్ ని ఉపయోగించుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. విజయ్ తో నేరుగా సంప్రదించేందుకు ఎన్డీయేకు ఈ స్థాయిలో నేతలు ఎవరూ లేరని అంటున్నారు. పైగా ఇదంతా ఒక స్మూత్ డీలింగ్ గా సాగాలి అంటే ఏపీకి చెందిన పవన్ కళ్యాణ్ బెస్ట్ అనుకుని ఆయనను రంగంలోకి దింపుతున్నారు అని అంటున్నారు. విజయ్ తో ఉన్న పరిచయాన్ని సినీ సంబంధాలను ఉపయోగించుకుని పవన్ ద్వారా చెప్పించి ఒప్పించాలని బీజేపీ కేంద్ర పెద్దలు చూస్తున్నారు అని అంటున్నారు. ఇక పవన్ సైతం కేంద్ర పెద్దల ఆలోచనలను తగినట్లుగా మధ్య వర్తిగా ఈ వ్యవహారంలో ఉంటున్నారు అని కూడా ప్రచారం సాగుతోంది.

చికాకుల్లో దళపతి :

ఇక విజయ్ టీవీకే పార్టీ పెట్టినప్పటి నుంచి చిక్కులను ఎన్నో ఎదుర్కొంటున్నారు. అది ఆయన వ్యక్తిగత జీవితం కావచ్చు, లేదా రాజకీయంగా సభలు పెడితే తొక్కిసలాట జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయిన వ్యవహారమే కావచ్చు ఇతర సమస్యలు కావచ్చు జనంలో ఊపు ఉన్నా సొంత సమస్యలే ఎక్కువగా ఏర్పడుతున్నాయని అంటున్నారు. ఒక వైపు సినిమా రిలీజ్ కాకుండా ఇబ్బందులు, మరో వైపు తొక్కిసలాట కేసులో విచారణలు ఇలా టీవీకే సతమతమవుతున్న వేళ విజయ్ సైతం సరికొత్త రాజకీయ వ్యూహాల మీద ఫోకస్ పెడుతున్నట్లుగా చెబుతున్నారు.

అదిరిపోయే ఆఫర్ రెడీ :

ఈ క్రమంలో విజయ్ కి అదిరిపోయే ఆఫర్ ని ఎన్డీయే పెద్దలు ఇస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఈ ఆఫర్ ఏమిటి అంటే ఎన్ డీయేలో విజయ్ పార్టీ టీవీకే చేరితే కనుక ఆ పార్టీ అధికారంలోకి వస్తే చెరి రెండున్నరేళ్ళ పాటు ముఖ్యమంత్రి పదవిని టీవీకేతో కలసి పంచుకునే ప్రతిపాదన అన్న మాట. ఇది అద్భుతమైన ప్రతిపాదనగా చెబుతున్నారు. రేపటి ఎన్నికల్లో తమిళనాడులో ఎన్డీయే గెలిస్తే అన్నా డీఎంకే నుంచి మాజీ సీఎం పళనిస్వామి ఒక రెండున్నరేళ్ల పాటు, అలాగే విజయ్ మరో రెండున్నరేళ్ళ పాటు సీఎం గా ఉంటారు అన్నది బీజేపీ కేంద్ర పెద్దలు టీవీకేకి ఇస్తున్న భారీ ఆఫర్ అని అంటున్నారు. ఈ ఆఫర్ తో పవన్ కళ్యాణ్ ద్వారా విజయ్ కి కీలక సందేశాన్ని పంపించారు అని అంటున్నారు.

కలిస్తే బంపర్ హిట్ :

ఇక విజయ్ పార్టీ కనుక ఎన్డీయేలో చేరితే ఈ కాంబో సూపర్ హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. అదెలా అంటే విజయ్ పార్టీకి యూత్ లో బ్రహ్మాండమైన ఆదరణ ఉంది అంటున్నారు. అలాగే పళనిస్వామికి అన్నా డీఎంకేకి గ్రామీణ ప్రాంతంలో మంచి పట్టు ఓటు బ్యాంక్ ఉంది. ఇక బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇలా ఈ బలాలు అన్నీ కలిస్తే కనుక అధికార డీఎంకేని ఓడించి మరీ తొలిసారి ఎన్డీయే తమిళనాడులో గద్దెనెక్కడం ఖాయమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఈ ప్రతిపాదనకు పళనిస్వామి మొదట ఆలోచించినా బీజేపీ కేంద్ర పెద్దల సూచనలతో అంగీకరించారు అని ప్రచారం సాగుతోంది. ఇక విజయ్ పార్టీ విషయం తేలాల్సి ఉందని అంటున్నారు. ఒంటరిగా పోటీ చేసినా కొన్ని సీట్లు గెలుచుకోవడం తప్ప అధికారం దక్కదని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో తొలి ఎన్నికల్లోనే సీఎం అయ్యే చాన్స్ ఈ ఆఫర్ ద్వారా రావడం టీవీకేని కూడా ఆలోచింపచేస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో.