Begin typing your search above and press return to search.

కమలానికి పవన్ కి మధ్య అసలు ఏమి జరుగుతోంది. ?

బీజేపీ సిద్ధాంతాలను తమ బుర్రల నిండా నింపుకుని కాషాయానికి దశాబ్దాలుగా అంకితం అయిపోయిన వారి కంటే ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉన్నారు.

By:  Satya P   |   12 Jan 2026 8:00 PM IST
కమలానికి పవన్ కి మధ్య అసలు ఏమి జరుగుతోంది. ?
X

బీజేపీ సిద్ధాంతాలను తమ బుర్రల నిండా నింపుకుని కాషాయానికి దశాబ్దాలుగా అంకితం అయిపోయిన వారి కంటే ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉన్నారు. ఆ పార్టీ ఫిలాసఫీని సొంత పార్టీ కంటే ఎక్కువగా ఆయన ప్రచారం చేయడమూ అంతా చూశారు. ఇన్నాళ్ళ తన రాజకీయ ప్రస్థానంలో బీజేపీ నేతలు ఎపుడూ సనాతన ధర్మం గురించి ఎక్కువగా ప్రస్తావించిన సందర్భాలు లేవు, కానీ ఆ పనిని పవన్ కళ్యాణ్ చేస్తూ వస్తున్నారు. ఒక విధంగా మాస్ లోకి హిందూత్వ నినాదాన్ని ఆయన తెలుగు నాట ఎంతో కొంత బలంగా తీసుకెళ్ళగలిగారు. మోడీ అంటే పవన్ కి ఒక విధమైన ఆరాధన భావం ఉంది. అది ఆయన స్వయంగా ఎన్నో సార్లు చెప్పుకున్నారు కూడా. బీజేపీని టీడీపీని కలిపి ఏపీలో కూటమిని కట్టడంలో పవన్ పాత్ర చాలా ఎక్కువ అని అంతా ఒప్పుకుంటారు.

ఎందుకీ దూరం :

అలాంటి పవన్ తెలంగాణాలో బీజేపీకి దూరం పాటిస్తున్నారా అన్న చర్చ ఒక వైపు సాగుతోంది. ఎందుకంటే తెలంగాణాలో ఫిబ్రవరి నెలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని మొదట ప్రకటించింది జనసేననే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్‌ ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. తాము అడహాక్ కమిటీలను కూడా వేసుకుని ముందుకు సాగుతున్నామని కూడా చెప్పుకొచ్చారు. అంతే కాదు పవన్ కూడా సీరియస్ గానే లోకల్ బాడీ ఎన్నికలను తీసుకుంటున్నారని ఆయన జనంలోకి వచ్చి పర్యటనలు కూడా చేస్తారు అని అని తాళ్ళూరి రామ్‌ తాజాగా పేర్కొనడం జరిగింది. జనసేన ఈ విధంగా సోలోగా తెలంగాణాలో పోటీకి సిద్ధపడడం దానికి అనుగుణంగా కమిటీలని పార్టీ పరంగా ఏర్పాటు చేయడం అన్నది వేగంగా జరుగుతోంది. అలాగే స్థానిక ఎన్నికల కోసం భారీ రాజకీయ కార్యాచరణను సైతం సిద్ధం చేస్తున్నారు.

బీజేపీకి ఇబ్బందిగా :

నిజానికి తెలంగాణాలో సొంతంగా తాము ఎదిగి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. బీఆర్ఎస్ పాలనను కాంగ్రెస్ ఏలుబడిని చూసిన ప్రజలు తమకు ఒక చాన్స్ ఇస్తారని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తున్న బీజేపీకి జనసేన నుంచి వచ్చిన ఈ తాజా ప్రకటన అయితే మింగుడుపడటం లేదని అంటున్నారు. జనసేన ఆల్ ఆఫ్ సడెన్ గా ఎందుకు తెలంగాణా నుంచి ఎన్నికల బరిలోకి దిగే ఆలోచన చేస్తోంది అన్నది అయితే బీజేపీ కీలక నేతలకు అసలు అర్థం కావడం లేదని అంటున్నారు. ఆ పరిణామాల క్రమంలో కేంద్ర బీజేపీ పెద్దలు సైతం దీని మీద తెలంగాణా బీజేపీ నాయకత్వాని పూర్తి వివరాలను ఆరా తీస్తున్నారు అని అంటున్నారు.

ఒంటరిగానే అంటూ బీజేపీ :

ఇక ఈ దశలో బీజేపీ తెలంగాణా శాఖ కూడా తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించడం విశేషం. ఆ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు ఉండదని ఆ అవసరం కూడా తమకు లేదని ఆయన తేల్చి చెప్పడం సరికొత్త రాజకీయ చర్చకు తావిస్తోంది. అయితే బీజేపీ చేసిన ఈ ప్రకటన మీద కూడా జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్‌ రియాక్ట్ అయ్యారు. తెలంగాణా మీద పవన్ కి ఎంతో ప్రేమ ఉందని చెప్పారు. అందుకే తెలంగాణాలో తొందరలో జరగబోయే మున్సిపల్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

పొత్తులు లేనట్లేనా :

అయితే జనసేన కూడా పోటీకి దిగితే అది ఏ పార్టీ విజయావకాశాలు దెబ్బ తీస్తుంది అన్న చర్చ కూడా ఉంది. ఓట్లు చీలిపోతే దాని వల్ల ఇబ్బంది విపక్షాలకు వస్తుంది. ఏపీలో బీజేపీ జనసేన పొత్తు కలిగి ఉన్నాయి. దాంతో తెలంగాణా బీజేపీ మీద ఆ ప్రభావం పడుతుందా అన్నది కూడా మరో చర్చగా ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో జనసేన బీజేపీల మధ్య పొత్తులు కుదురుతాయా అన్నది కూడా చూడాల్సి ఉందని అంటున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వంతో డైరెక్ట్ గా టచ్ లో జనసేన అధినేత ఉంటారు కాబట్టి అక్కడనే పొత్తుల మీద నిర్ణయం తీసుకుంటారా లేక ఎవరి మానాన వారు పోటీ చేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.