Begin typing your search above and press return to search.

పవన్ సౌండ్ పెంచుతున్నారా ?

కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన ఉంది. అధినేత పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆ పార్టీ నుంచి మరో ఇద్దరికి కీలక శాఖలతో మంత్రి పదవులు ఇచ్చారు.

By:  Satya P   |   11 Oct 2025 10:03 PM IST
పవన్ సౌండ్ పెంచుతున్నారా ?
X

కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన ఉంది. అధినేత పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆ పార్టీ నుంచి మరో ఇద్దరికి కీలక శాఖలతో మంత్రి పదవులు ఇచ్చారు. ఇక పవన్ కి కూటమిలో ఎంతో ప్రాధాన్యత ఉంటోంది. అయితే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి సరిగ్గా 16 నెలలు అవుతోంది. ఈ మధ్య కాలంలో నెలకు రెండు వంతున దాదాపుగా 32 కేబినెట్ సమావేశాలు జరిగాయి. అందులో తాజాగా శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం కొత్త చర్చకు తావిస్తోంది.

పవన్ మాటల వెనక :

తాజా మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ లూలూ గ్రూప్ విషయంలో ఏకంగా ప్రశ్నల వర్షమే కురిపించారు. ఆయన లూలూ విషయంలో బాగా కసరత్తు చేసి సమావేశానికి వచ్చారని అంటున్నారు. దాంతో లూలూ పెట్టే కండిషన్లు దాని వల్ల ఏపీకి వచ్చే పెట్టుబడులు ఎంత ఉపాధి ఎంత ఇత్యాది విషయాలను ఆయన అధికారులను ప్రశ్నిస్తూ ఒక విధంగా ఉక్కిరి బిక్కిరి చేసేశారు. అంతే కాదు ఎంతో విలువ అయిన భూములు ఇస్తూ భారీగా రాయితీలు ఇస్తూ ఉన్నా కూడా ఆయా పరిశ్రమలు ద్వారా స్థానికులకు వచ్చే లబ్ది ఎంత ఉపాధి అవకాశాలు ఏ మేరకు అన్నది మేధావులు ప్రజా సంఘాల నుంచి ఎపుడూ చర్చగానే ఉంది. సరిగ్గా ఈ పాయింట్ నే పవన్ మంత్రి వర్గ సమావేశంలో ఎత్తుకున్నారు. ఏపీకి పరిశ్రమలు అవసరమే కానీ ఆ పేరుతో వచ్చే సంస్థలు అభివృద్ధికి కానీ ప్రజల జీవితాలను మారచడానికి కానీ ఏ మేరకు దోహదపడతాయన్నది కూడా చర్చ ఎపుడూ ఉంది. పవన్ ఈ పాయింట్స్ నే గట్టిగా అడిగారు.

డెబిట్స్ వద్దా :

కూటమి ప్రభుత్వంలో ఉన్న మిత్రులకు ప్రభుత్వం చేసే మంచి పనులలో క్రెడిట్స్ దక్కుతాయి అదే సమయంలో ప్రభుత్వం చేసే కొన్ని పనుల వల్ల వ్యతిరేకత ఏమైనా వస్తే కనుక అవి డెబిట్స్ గా మారుతాయి. అయితే ఈ విషయంలో పంచుకునేందుకు బహుశా మిత్రులు ఎవరూ పెద్దగా ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే జనాల వద్దకు రేపటి రోజున వెళ్ళినపుడు ఇవన్నీ మెడకు చుట్టుకుంటాయి. అందుకేనా పవన్ ముందుగానే ప్రభుత్వాన్ని మేలుకొలిపేలా ఈ రకంగా ఏపీ పారిశ్రామిక విధానం మీద సగటు జనాలలో ఉన్న సందేహాలు మేధావుల నుంచి వస్తున్న అభ్యంతరాలను వ్యక్తం చేశారు అన్నది చర్చకు వస్తోంది.

సమిష్టి నిర్ణయాలే :

సాధారణంగా మంత్రి వర్గ సమావేశాల్లో నిర్ణయాలు అన్నీ సమిష్టి బాధ్యతతో ఉంటాయి. కొన్ని అంశాల మీద చర్చించవచ్చు. సందేహాలు వ్యక్తం చేయవచ్చు. అయితే చివరికి అజెండాలో ఉన్న వాటిని ఆమోదించినపుడు మొత్తం మంత్రివర్గం నిర్ణయంగామే ఉంటుంది. అయితే ఈ అభ్యంతరాలు సందేహాలు సంగతి ఏమిటి అంటే రేపటి రోజున వీటిని అవసరం అయినపుడు చెప్పుకుని తమ ప్రమేయం లేకుండా కొన్ని నిర్ణయాలు జరిగాయని చెప్పుకోవచ్చు లేదా తాము అభ్యంతరం పెట్టామని కూడా చెప్పుకోవచ్చు. బహుశా పవన్ ఈ విషయంలో ఏమైనా ప్లాన్ బీలో ఉన్నారా అన్న చర్చకు కూడా దారి తీసేలా ఉన్నాయి. ఏది ఏమైనా పవన్ ఇదే తీరున మరిన్ని సమావేశాలలో తన గళం సవరించినా లేక గొంతు పెంచినా ఆయన ఆలోచనలు ఏమిటి అన్నది అర్ధం అవుతుందని అంటున్నారు. అంతవరకూ చూస్తే మాత్రం ఆయన ప్రభుత్వం తరఫున ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రశ్నించినట్లుగా చూడాల్సి ఉంటుంది.