Begin typing your search above and press return to search.

ప్ర‌జ‌ల‌కే కాదు.. వన్య‌ప్రాణుల‌కు కూడా 'మోడీ' అవ‌స‌రం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ప‌ర్య‌టించారు.

By:  Garuda Media   |   13 Aug 2026 11:31 PM IST
ప్ర‌జ‌ల‌కే కాదు.. వన్య‌ప్రాణుల‌కు కూడా మోడీ అవ‌స‌రం:  ప‌వ‌న్ క‌ల్యాణ్‌
X

దేశ ప్ర‌జ‌ల‌కే కాకుండా.. దేశంలోని వ‌న్య‌ప్రాణుల‌కు కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అవ‌స‌ర‌మ‌ని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్ర‌ధాని పీఠం ఎక్కిన త‌ర్వాత‌.. దేశంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆయ‌న ఆదు కుంటున్నార‌ని.. అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తున్నార‌ని చెప్పారు. ఇదేస‌మ‌యంలో వ‌న్య ప్రాణుల సంర‌క్ష‌ణకు కూడా ప్ర‌ధాని అంతే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని.. అందుకే ప్ర‌జ‌ల‌తోపాటు వ‌న్య‌ప్రాణులు కూడా సుర‌క్షితంగా మ‌న‌గ‌లుగుతున్నాయ‌ని తెలిపారు.

ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ప‌ర్య‌టించారు. విమానాశ్రయంలో ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సుందరపు విజయ్ కుమార్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఘన స్వాగతం పలికారు. భుజానికి శస్త్ర చికిత్స చేసిన చెయ్యి ఇబ్బందిగా ఉన్నప్పటికీ వాహనం నుంచి దిగి స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర సహాయ మంత్రి కీర్తివర్థన్ సింగ్ తో కలిసి ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

తొలుత ప‌లు ఏనుగుల‌కు ఆహారం తినిపించారు. అనంత‌రం.. జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ మాట్లాడుతూ.. దేశ‌వ్యాప్తంగా పులులు, సింహాలు, చీతాల‌తోపాటు ఏనుగులు, ఖ‌డ్గ మృగాల సంఖ్య‌ను పెంచేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎంతో శ్ర‌ద్ధ వ‌హిస్తున్నార‌ని చెప్పారు. అందుకే.. గ‌తంలో దేశంలో 26 మాత్ర‌మే ఉన్న ఏనుగుల రిజ‌ర్వ్‌(సంర‌క్ష‌ణ కేంద్రాలు)లు.. ఇప్పుడు 33కు పెరిగాయ‌ని చెప్పారు. అదేస‌మ‌యంలో వీటి సంఖ్య‌ను మ‌రింత పెంచేందుకు కూడా కృషి చేస్తున్నార‌ని చెప్పారు. ఏనుగుల ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించే చ‌ర్య‌లు కూడా చేప‌ట్టార‌ని తెలిపారు.

రాష్ట్రంలో..

రాష్ట్రంలో ఏనుగుల కార‌ణంగా జ‌రుగుతున్న పంట‌ల న‌ష్టాన్ని 80 శాతం, మ‌ర‌ణాల‌ను 70 శాతం మేర‌కు త‌గ్గించిన ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం స‌హ‌కారంతో 4 కుంకీ ఏనుగుల‌ను తీసుకువ‌చ్చామ‌న్నారు. రాష్ట్రం లో ఏనుగుల సంఖ్య‌ను పెంచేందుకు కృషి చేస్తున్న‌ట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 142 ఏనుగులు ఉన్నాయ‌ని తెలిపారు. వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ కేవ‌లం ప్ర‌భుత్వాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాద‌ని.. ప్ర‌జ‌లు కూడా భాగ‌స్వామ్యం కావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. `హ‌నుమాన్‌` ప్రాజెక్టు ద్వారా వ‌న్య‌ప్రాణుల న‌ష్టాల‌ను త‌గ్గిస్తున్న‌ట్టు తెలిపారు.