Begin typing your search above and press return to search.

నచ్చితేనే గెలిపిస్తారు..పవన్ మార్క్ విశ్లేషణ

దేశంలో నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విశ్లేషించారు.

By:  Satya P   |   4 May 2026 11:15 PM IST
నచ్చితేనే గెలిపిస్తారు..పవన్ మార్క్ విశ్లేషణ
X

దేశంలో నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విశ్లేషించారు. అదే సమయంలో విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ ఎన్నికలలో వివిధ రాష్ట్రాలలో ఓటర్ల ఆలోచనలు చూస్తే బలమైన మార్పుని కోరుకున్నారని అర్థం అవుతోంది అని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ద్వారా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో ఒక్కో రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు గెలిచిన నాయకులు పార్టీలు అలాగే ఓడిన ఎన్డీయే మిత్రుల గురించి కూడా వివరించి విశ్లేషించడం విశేషం.

బీజేపీ అకుంఠిత దీక్షకు నిదర్శనం :

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ సాధించిన విజయం ఆ పార్టీ అకుంఠిత దీక్షకు ఒక నిదర్శనం అని పవన్ అన్నారు. బెంగాల్ లో ప్రజలు బలమైన మార్పుని కోరారని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజానీకం నమ్మకాన్ని పొందడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న కృషికి ఇప్పుడు తగిన ఫలితాన్ని దక్కింది అని పవన్ అన్నారు. కేంద్రంలో బీజేపీ ఉందని రాష్ట్రంలో బీజేపీ పాలన ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ తోనే పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించి బీజేపీకి పట్టం కట్టారని పవన్ అన్నారు. ఈ విజయంలో భాగం అయిన మోడీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, బీజేపీ పశ్చిమ బెంగాల్ నాయకుడు సువేందు అధికారికి పవన్ అభినందనలు తెలిపారు.

నచ్చకపోతే ఓడిస్తారు :

ఇక ఓటర్లలో పెరిగిన చైతన్యానికి ఈ ఫలితాలు ఉదాహరణ అని పవన్ పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో ఓటర్ల రాజకీయ అవగాహన స్పష్టంగా కనిపిస్తోంది అని పవన్ అన్నారు. ఎవరిదైనా పాలన నచ్చితే మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారని, అదే కనుక నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే మచ్చుతునక అని పవన్ పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని పవన్ గుర్తు చేశారు. ఇక అస్సాం పుదుచ్చేరిలో బీజేపీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకుని మళ్లీ అధికారం చేపట్టిందని దాంతో పాటు పశ్చిమ బెంగాల్ ని కూడా గెలుచుకుందని పవన్ చెప్పారు. అస్సాం, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హిమంత్ బిశ్వశర్మ, రంగసామిలకు ఆయన అభినందనలు తెలిపారు.

యువనేత విజయ్ అంటూ :

తమిళనాడులో తొలిసారి అధికారం అందుకోబోతున్న విజయ్ ని యువ నేత అని పవన్ పేర్కొంటూ ఆయనకు అభినందనలు తెలిపారు. పార్టీని స్థాపించిన తరువాత తక్కువ కాలంలోనే అధికారం అందుకున్న విజయ్ ని ఆయన ప్రశంసించారు. అయితే తమిళనాడులో అన్నా డీఎంకే, బీజేపీ కూటమి పోరాటం బలమైనదేనని పవన్ చెప్పడం విశేషం. ఇక కేరళలో చూస్తే అధికార మార్పుని మెజారిటీ ఓటర్లు కోరుకున్నారని అందుకే కాంగ్రెస్ నాయకత్వంలో యూడిఎఫ్ గెలిచిందని అన్నారు.