విశాఖలో అకీరా నందన్ స్పెషల్ అట్రాక్షన్.. అసలు ఎందుకొచ్చాడో తెలుసా?
విశాఖలో తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ ఏర్పాటు చేసిన సర్గమ్ - 2025 ఇండియన్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
By: Tupaki Political Desk | 30 Nov 2025 11:26 PM ISTవిశాఖలో తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ ఏర్పాటు చేసిన సర్గమ్ - 2025 ఇండియన్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఆయన వెంట కుమారుడు అకీరా నందన్ కూడా ఉండటమే ఎక్కువ ఆసక్తి రేపింది. డిసెంబరు 4న నేవీ డే ఉత్సవాలు జరగనున్నాయి. దీనికి ముందస్తుగా సర్గమ్ ఈవెంట్ ను నిర్వహిస్తుంటారు. ఈ ఈవెంటు సందర్భంగా తూర్పు ప్రాంత నావికాదళ సింఫనిక్ బ్యాండ్ చేసిన సంగీత విన్యాసాలు వీనుల విందు చేశాయి.
అధికారిక హోదాలో పవన్ ఈ కార్యక్రమానికి హాజరైనా.. వెంట అకీరా నందన్ రావడమే ఎక్కువ చర్చకు దారితీసింది. పవన్ కుమారుడైన అకీరా సినీ రంగ ప్రవేశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పవన్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనతో పలుమార్లు అకీరా నందన్ కనిపించాడు. అయితే నేవల్ ఉత్సవాలకు ఆయన రావడం వెనుక అకీరాకు ఉన్న సంగీతంపై ఆసక్తి ప్రధాన కారణం అంటున్నారు.
అకీరా చూడటానికి హీరో మెటీరియల్ గా కనిపించినప్పటికీ ఆయనకు సంగీతంపై ఎక్కువ అంటూ ప్రచారం ఉంది. కీబోర్డ్ ప్లే చేయడంలో అకీరా మంచి ప్రతిభ కనబరుస్తాడని కూడా చెబుతుంటారు. మెగా ఫ్యామిలీ వేడుకల్లో చాలా సార్లు అకీరా మ్యూజిక్ ప్రదర్శనలతో అందరినీ మెప్పించాడని పవన్ అభిమానుల్లో టాక్ ఉంది. ఇక అకీరా తల్లి రేణు దేశాయ్ సైతం పలుమార్లు అతడి సంగీతాభిరుచిపై మీడియాకు తెలియజేశారు.
అకీరా నందన్ తన తండ్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాదిరిగానే ప్రకృతిని ప్రేమిస్తాడని చెబుతున్నారు. అంతేకాకుండా నాచురల్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడతాడని, ఫిట్‌గా ఉండటానికి యోగా, మార్షల్ ఆర్ట్స్, ప్రాణాయామం కూడా చేస్తాడని ప్రచారం ఉంది. ఈ లక్షణాలు అన్నీ పవన్ కళ్యాణ్‌లో ఉన్నాయని ఆయన అభిమానులు చెబుతున్నారు. దీంతో అకీరా ఎక్కడ కనిపించినా అతడిలో పవన్ ను చూస్తూ ఆనందిస్తుంటారు. ఇక విశాఖ విమానాశ్రయంలో పవన్ తో అకీరా కనిపించగానే అభిమానులు గోలగోల చేశారు.
