Begin typing your search above and press return to search.

నెక్స్ట్ సీఎం పవన్...మూడేళ్ళ ముందే సామాజిక వేడి

రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలలో మొత్తం 52 సీట్లు ఉంటే అందులో తమకు కేటాయిస్తున్నవి తక్కువగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

By:  Satya P   |   31 Aug 2026 9:26 AM IST
నెక్స్ట్ సీఎం పవన్...మూడేళ్ళ ముందే సామాజిక వేడి
X

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. ముగ్గురు మంత్రులు జనసేన నుంచి ఉన్నారు. మరో మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు మాత్రమే అయింది. ఇంకా మూడేళ్ల దాకా అధికారం ఉంది. కానీ ఇంతలోనే ఏపీలో సామాజిక వేడి రాజుకుంటోంది. సామాజిక సభలు పెట్టి మరీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. తాజాగా చూస్తే తిరుపతిలో ఘనంగా వీర బలిజ సాంస్కృతిక పునరుజ్జీవన శంఖారావం సభను నిర్వహించారు. ఈ సభలో అనేక తీర్మానాలు ఆమోదించారు. అందులో అత్యంత కీలకమైనది చూస్తే పవన్ ని సీఎం గా చేయాలన్నది.

సీఎం అభ్యర్ధిగా :

పవన్ కళ్యాణ్ ని 2029 ఎన్నికలలో సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని బలిజ సాంస్కృతిక పునరుజ్జీవన శంఖారావం డిమాండ్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ ని అలా ప్రకటిస్తే మరోసారి కూటమి ప్రభుత్వాన్ని ఇంతకు ఇంత మెజారిటీతో నెగ్గించి తీరుతామని చెబుతున్నారు. తాము గ్రేటర్ రాయలసీమ లోని ఆరు జిల్లాలలో ఉన్నామని పెద్ద సంఖ్యలో తాము ఇక్కడ ఉన్నామని చెప్పారు. అలాగే కాపులు బలిజలు, ఒంటరి, తెలగ, తూర్పు కాపులు ఇలా తాము వివిధ ప్రాంతాలలో వేరు వేరు పేర్లతో పిలవబడుతున్నా అంతా ఒక్కటే అని బలిజ సాంస్కృతిక పునరుజ్జీవన శంఖారావం నాయకులు చెబుతున్నారు. స్వాతంత్ర్యం రాకముందు సంస్థానాలను రాజ్యాలను ఏలిన చరిత్ర తమది అని చెప్పుకొచ్చారు. ఇపుడు అధిక జనాభా ఉన్నా కూడా తాము సీఎం పదవిని అందుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ కూడా ప్రకటించాలి :

కేవలం టీడీపీ కూటమి మాత్రమే కాదని వైసీపీ కూడా తమ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కాపుల నుంచి ప్రకటించాలని ర బలిజ సాంస్కృతిక పునరుజ్జీవన శంఖారావం డిమాండ్ చేస్తోంది. ఎంతసేపూ ఆ సామాజిక వర్గాలేనా తమకు చాన్స్ ఉండదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈసారి తాము తప్పనిసరిగా ముందు వరసలోకి వస్తామని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేనకు తమ మద్దతు పూర్తిగా ఉంటుందని వారు ప్రకటించారు. అంతే కాదు పవన్ నాయకత్వంలో ఏపీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని కూడా వారు చెబుతున్నారు.

రాయలసీమలో ఎక్కువ సీట్లు :

రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలలో మొత్తం 52 సీట్లు ఉంటే అందులో తమకు కేటాయిస్తున్నవి తక్కువగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అలా కాకుండా జనాభా దామాషా పద్ధతిలో సీట్లు ఇవ్వాలని కోరారు. 15 కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలలో తమ జనాభా ఉందని అందుకే అన్ని సీఎట్లు తమకు కేటాయించాలని కోరారు. ఇది కూటమి పార్టీలు మాత్రమే కాదు వైసీపీ కూడా అమలు చేసి చూపించాలని కోరారు.

అందరినీ ఏకం చేస్తూ :

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కేవలం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని బలిజ సాంస్కృతిక పునరుజ్జీవన శంఖారావం నేతలు చెబుతున్నారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ సామాజిక వర్గాలను ఏకం చేస్తూ, పవన్‌ కళ్యాణ్‌కు రాజకీయంగా సంపూర్ణ అండగా నిలవాలని పిలుపు ఇచ్చారు. తిరుపతిలో పెట్టిన సభ ఆరంభం మాత్రమే అని ఇది రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో కూడా పెడతామని చెబుతున్నారు. కేవలం సంక్షేమ పథకాల పేరుతో కాకుండా నిజమైన రాజకీయ అధికారం సామాజిక న్యాయం జరగాలని కోరుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా ఆయనను భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థానంలో చూడాలన్నది తమ సామాజిక వర్గం ఆకాంక్ష అని బలిజ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. మొత్తానికి ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉండగానే ఈ డిమాండ్లు వినిపించడం మీద రాజకీయంగా చర్చ అయితే సాగుతోంది.