15 ఏళ్ళు...ఈ లెక్కేమిటి పవన్ !
రాజకీయం అంటే ఒక చిత్రమైన ఆట. నిన్నలా నేడు ఉండదు, రేపు అంతకంటే ఉండదు.
By: Satya P | 3 Aug 2025 9:06 AM ISTరాజకీయం అంటే ఒక చిత్రమైన ఆట. నిన్నలా నేడు ఉండదు, రేపు అంతకంటే ఉండదు. ఆ మాటకు వస్తే ఇక్కడ ఎవరూ ఎవరికీ శాశ్వత మిత్రులు అయితే ఉండరు. ఇది ఒక అందమైన పద్మవ్యూహం. ఇందులో అందరూ అభిమన్యులే ఉంటారని కాదు అలాగే అర్జునులూ ఉండాలని కూడా లేదు. ఈ రోజులలో విభేదాలకు ఎక్కడ చూసినా తావు ఉంటోంది రాజకీయాల్లో అయితే అది మరింతగా ఉంటుంది. కానీ పవన్ ఐక్యతా రాగం వినిపిస్తున్నారు.
మళ్ళీ మళ్ళీ చెబుతున్నా :
పవన్ ఒకే మాట మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. అదే పదిహేనేళ్ళ పాటు కూటమి కలసి ఉండాలని. అది కూడా కూటమిలో ఆయన ఒక్కరే చెబుతున్నారు. ఇదే మాట బీజేపీ అనడం లేదు, టీడీపీ అయితే అసలు అనడం లేదు. కానీ పవన్ మాత్రం మరో పదిహేనేళ్ళు కలసి ఉండాలని కూటమి ఐక్యత కొనసాగాలని బలంగా కోరుకుంటున్నారు. ఇలా మళ్ళీ మళ్ళీ పవన్ చెబుతున్నది కూటమి పార్టీలకు పెద్దలకు ఏ మేరకు ఎక్కిందో తెలియదు కానీ జనసైన్యంలో మాత్రం నిరాశను పెంచేస్తోంది అని అంటున్నారు.
గ్రౌండ్ లెవెల్ లో వేరేగా :
ఇక మరో మాట కూడా వినిపిస్తోంది. కూటమి ఐక్యంగా ఉండాలి. పదిహేనేళ్ళ పాటు అధికారంలో ఉండాలి. మొదటిదే రాజకీయ పార్టీల మధ్య డౌట్ గా ఉంటోంది. ఎందుకంటే ఒకే నియోజకవర్గంలో మూడు పార్టీలు పొత్తులు కలిపినా అవన్నీ కొంతకాలమే మరో అయిదేళ్ళ తరువాత మనమే అన్నది ఆ వైపూ ఈ వైపూ ఉంటుంది. అలాంటి సుదీర్ఘ కాలం అంటే గ్రౌండ్ లెవెల్ లో నిజంగా నిస్పృహతో అంతా ఉంటారు అని అంటున్నారు. పైపెచ్చు బలమున్న చోట వేరే వారిని గెలిపించి తాము చేతులు కట్టుకుని కూర్చోవడం ఎవరికీ నచ్చదు అని అంటున్నారు అందుకే గ్రౌండ్ లెవెల్ లోనే గొడవలు వస్తున్నాయని అంటున్నారు.
ఐక్యంగా ఉంటే గెలుపేనా :
సరే కూటమిగా ఉండాలి అంతా కలసి ముందుకు సాగాలి అని పవన్ చెప్పారు కదా అని అంతా కలసి ఎన్నికల్లో పోటీ చేసినా జనాలు గెలిపిస్తారు అన్న గ్యారంటీ ఉందా అన్న చర్చ కూడా ఉంది. రాజకీయాల్లో ఎపుడూ వన్ ప్లస్ వన్ రెండు కాదు అలాగే మైనస్ ప్లస్ అవవచ్చు కూడా. అలా కనుక చూసుకుంటే కలవిడిగా ఉన్నా ఒక రకమైన అభిప్రాయం జనంలో ఉండాలి. వారికి అన్నీ నచ్చాలి. వారి మూడ్ ని బట్టే తీర్పు వస్తుంది. ఇదంతా రాజకీయంగా అన్ని చోట్లా జరుగుతూ ఉన్నదే. ఉత్తరప్రదేశ్ లో చూస్తే 2022లో బీజేపీని ఓడించాలని అన్ని పార్టీలూ కూటమి కట్టినా ఓటమి తప్పలేదు. అంటే జనాలూ ఫోకస్ ఆ వైపు లేదు అన్న మాట.
వైసీపీ చెడగొడుతోందా :
వైసీపీ రాజకీయ వ్యూహాల మీద పవన్ కి ఉన్న నమ్మకం అనుకోవాలి. అన్నేసి వ్యూహాలే ఆ పార్టీకి ఉంటే 2024 ఎన్నికల్లో ఎందుకు బొక్క బోర్లా పడుతుంది అన్నదే కదా చర్చ. పైగా ఒక వైపు పవన్ ని మరో వైపు చంద్రబాబుని ఇద్దరినీ ఇబ్బంది పెట్టి మరీ కూటమిని కట్టించడంలో వైసీపీ పోషించిన పాత్ర తక్కువనా అన్న విశ్లేషణలూ ఉన్నాయి. ఇక ఓడిన తరువాత అయినా వైసీపీ పవన్ విషయంలో వ్యూహాలు మార్చిందా అంటే లేనే లేదు కదా. మరి ఏ విధంగానూ రాజకీయ వ్యూహాలు లేని వైసీపీ మీద పవన్ విమర్శలు చేయడం జస్ట్ రొటీన్ అనే అనుకోవాలి అని అంటున్నారు.
తమ పార్టీ నేతలలోనే అంతర్మధనం జరుగుతోంది. అయితే వైసీపీని బూచిగా చూపించడం వల్ల అది తగ్గేది కాదనే అంటున్నారు. కూటమిలో కొనసాగాలని అన్నది మంచిదే కానీ తమ పార్టీ వారికీ సముచితమైన స్థానం ఉండాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పు లేదు కదా అని అంటున్నారు. ఆ దిశగా పవన్ ఆలోచన చేస్తేనే ఐక్యత అన్నది గ్రౌండ్ వరకూ వెళ్తుంది అని అంటున్నారు. సో పవన్ 15 ఏళ్ళ లెక్క వెనక ఏముందో కానీ ఎవరికీ అర్ధం కావడం లేదనే అంటున్నారు.
