కూటమి ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ అల్టిమేటం.. జాగ్రత్త సుమీ!
కూటమి ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Political Desk | 11 Feb 2026 6:06 PM ISTకూటమి ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 15 ఏళ్లపాటు అధికారంలో ఉండాలంటే ఎమ్మెల్యేలు అంతా అప్రమత్తంగా నడుచుకోవాలని సూచించారు. ముఖ్యంగా విపక్షం వైసీపీ చేస్తున్న కుట్రల విషయంలో కూటమి ఎమ్మెల్యేలు జాగ్రత్తగా వ్యవహరించాలని పవన్ హెచ్చరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కూటమి ఎమ్మెల్యేల సంయుక్త సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి.
కూటమిని విడగొట్టేందుకు విపక్షం వైసీపీ కుట్రలు చేస్తోందని పవన్ ఆరోపించారు. రకరకాల వ్యూహాలతో కూటమిని చీల్చాలని వైసీపీ ప్లాన్ చేస్తోందని పవన్ అన్నారు. ఎన్నికల్లో ఎలాగైతే పని చేశామో ఇప్పుడూ అదే స్ఫూర్తితో పనిచేయాలని, వైసీపీ కుట్రలను విచ్ఛిన్నం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. కూటమి పార్టీలో మరో 15 ఏళ్లపాటు ఐక్యంగా ఉండాలని పవన్ ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం సుదీర్ఘ కాలం పాటు కొనసాగాల్సిన అవసరం ఉందని పవన్ స్పష్టం చేశారు. కేవలం ఐదేళ్ల పరిపాలన సరిపోదని, కూటమి మరో 15 ఏళ్లు కొనసాగాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి స్థిరమైన, బలమైన పాలన అవసరమని ఆయన నొక్కి చెప్పారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంటే, వైసీపీ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని పవన్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి కుట్రలను ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలని, క్షేత్రస్థాయిలో ప్రజలతో నిరంతరం మమేకం కావాలని ఆయన సూచించారు. పవన్ తాజా వ్యాఖ్యలు రాజకీయంగా విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ప్రధానంగా గత కొంతకాలంగా కూటమిలో నేతల మధ్య విభేదాల సృష్టికి ప్రయత్నం జరుగుతోందన్న పవన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఉంటే అధికారం చేజారిపోదని డిప్యూటీ సీఎం పవన్ నమ్ముతున్నారు. కూటమి నిరాంటంకగా కొనసాగాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. ఈ విషయంలో కార్యకర్తలు, నాయకులు సర్దుకుపోవాలని ఎప్పటికప్పుడు పిలుపునిస్తూనే ఉన్నారు. మూడు పార్టీలు కలిసి పనిచేయడమంటే అంత తేలికైన విషయం కాదని పవన్ చెబుతున్నారు. ఈ కారణంగానే కార్యకర్తలను తరచూ అప్రమత్తం చేస్తూ కూటమిలో భేదాభిప్రాయాలు తలెత్తకుండా జాగ్రత్త వహిస్తున్నారని అంటున్నారు. అటువైపు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సైతం పవన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు చెబుతున్నారు.
