జనంలోకి వెళ్లండి: సేనలకు పవన్ పిలుపు
జనంలోకి వెళ్లండి. ఏడాది కాలంలో మనం చేసిన మంచిని వివరించండి. చూస్తూ కూర్చుంటే కుదరదు.
By: Garuda Media | 11 Aug 2025 8:15 AM IST``జనంలోకి వెళ్లండి. ఏడాది కాలంలో మనం చేసిన మంచిని వివరించండి. చూస్తూ కూర్చుంటే కుదరదు.`` అని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలు పునిచ్చారు. ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లాల నాయకులతో మాట్లాడారు. పార్టీ తరఫున ప్రచారం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మూడు విషయాలపై పవన్ కల్యాణ్ ప్రధానంగా నొక్కి చెప్పినట్టు తెలిసింది. వీటి ప్రకారం ప్రజలకు చేరువ కావాలని ఆయన ఆదేశించారు.
1) అడవితల్లి బాట: జనసేన తరఫున గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మించే కార్యక్రమమే.. అడవి తల్లి బాట. ఇప్పటికే మన్యం, అల్లూరి సీతారామ రాజు జిల్లాల్లో ఈ కార్యక్రమం కింద రహదారులు నిర్మిస్తున్నా రు. గతంలోనే వీటికి పవన్ కల్యాణ్ భూమి పూజ చేశారు. ఈ క్రమంలో ఇటీవల ఓ కిలో మీటరు రహదారి పూర్తయిన సందర్భంగా వాటికి సంబంధించిన ఫొటోలను ఆయన ఎక్స్‌లో పంచుకున్నారు. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అడవితల్లి బాట కార్యక్రమంలో పాల్గొనాలని నాయకులకు సూచించారు.
2) పార్టీ తరఫున ప్రచారం: గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామాలకు వెళ్లాలని పవన్ కల్యాణ్ సూచించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తాను తీసుకుంటున్న నిర్ణయాలు, కేంద్రం నుంచి తీసుకు వస్తున్న నిధులు, వాటితో జరుగుతున్న పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువగా ఉండాలన్నారు. అలానే గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల ను కూడా పర్యవేక్షించాలని.. ఎక్కువ మందికి పనులు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
3) స్థానిక సంస్థల ఎన్నికలు: మరో ఏడాదిలో ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో జరిగిన స్థాని క ఎన్నకల్లో జనసేన తరఫున అప్రకటితంగా పోటీ చేసిన అభ్యర్థులు కూడా విజయం దక్కించుకున్నారని.. ఈ సారి పార్టీ కూడా సహకరిస్తుందన్న సందేశాన్ని ఇవ్వాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. ``ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోవద్దు. మన పార్టీ తరఫున మనమే పనిచేయాలి.`` అని పవన్ వ్యాఖ్యానించారు.
