ఫోన్ పక్కన పడేయాలి.. 12 గంటలు నిద్ర పోవాలి.. టెలిగ్రామ్ సీఈవో చెప్పిన సక్సెస్ సీక్రెట్స్
ప్రపంచ ప్రఖ్యాత మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ తన విజయ రహస్యాలను, వ్యక్తిగత జీవితంలోని సంచలన విషయాలను వెల్లడించారు.
By: A.N.Kumar | 8 Oct 2025 5:00 AM ISTప్రపంచ ప్రఖ్యాత మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ తన విజయ రహస్యాలను, వ్యక్తిగత జీవితంలోని సంచలన విషయాలను వెల్లడించారు. ఈ అసాధారణమైన విజయ సూత్రాలు.. జీవిత నిర్ణయాలు ప్రస్తుతం టెక్ ప్రపంచంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
12 గంటల నిద్ర, ఫోన్‌కు దూరం
టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ తన అత్యుత్తమ ఉత్పాదకతకు.. సృజనాత్మకతకు ప్రధానంగా రెండు సూత్రాలను పాటిస్తున్నట్లు తెలిపారు: నిద్రకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం.. స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని కఠినంగా పరిమితం చేసుకోవడం. తాను రోజుకు 11 నుంచి 12 గంటల సమయాన్ని పడకగదిలో గడపడానికి ప్రయత్నిస్తానని దురోవ్ తెలిపారు. ఈ సమయం అంతా నిద్రపోకపోయినా, మంచంపై పడుకుని ఆలోచించడానికి కేటాయిస్తానని చెప్పారు. అద్భుతమైన, ఉత్తమ ఆలోచనలు ఈ నిశ్శబ్ద సమయాల్లోనే వస్తాయని ఆయన వివరించారు.
ఫోన్ పక్కన పెట్టేయాలి
సోషల్ మీడియా దిగ్గజానికి సీఈఓ అయినప్పటికీ, దురోవ్ ఫోన్‌ను అతి తక్కువగా ఉపయోగిస్తారు. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడకూడదనే నియమాన్ని పాటిస్తారు. నోటిఫికేషన్లు , సోషల్ మీడియా పోస్టులు మన రోజువారీ ఆలోచనలను, ప్రాధాన్యతలను నిర్ణయించకుండా ఉండేందుకు ఈ అలవాటు సహాయపడుతుందని ఆయన అన్నారు. వ్యాయామం చేసేటప్పుడు లేదా ఉదయపు దినచర్యలో ఫోన్‌ను దూరంగా ఉంచుకోవాలని దురోవ్ సూచించారు. ఫోన్ లేకుండా ఒంటరిగా గడిపినప్పుడే మెదడుకు సృజనాత్మకమైన ఆలోచనలు వస్తాయని ఆయన నమ్ముతారు.
వ్యక్తిగత జీవితం: 100 మందికి పైగా పిల్లలు, సంచలన వీలునామా
పావెల్ దురోవ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన ప్రకటనలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. దురోవ్‌కు ఇంకా పెళ్లి కానప్పటికీ, తనకు ముగ్గురు సహజీవన భాగస్వాములు ద్వారా ఆరుగురు పిల్లలు ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా గత 15 సంవత్సరాలుగా తాను చేసిన వీర్యదానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో 100 మందికి పైగా పిల్లలు జన్మించారని ఆయన వెల్లడించారు. దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన తన సంపదను, తన సొంత పిల్లలతో పాటు వీర్యదానం ద్వారా జన్మించిన 100 మంది పిల్లలందరికీ సమానంగా పంచుతానని వీలునామాలో పేర్కొన్నట్లు దురోవ్ సంచలన ప్రకటన చేశారు. ఈ వారసత్వ సంపదను పిల్లలు 30 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పొందలేరనే షరతును దురోవ్ విధించారు. ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం, పిల్లలు స్వతంత్రంగా ఎదగాలని, తమకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకోవాలని ఆకాంక్షించడం. టెలిగ్రామ్ సీఈఓగా తన పనిలో అనేక సవాళ్లు , శత్రువులు ఉన్నారని, అందుకే తన 40 ఏళ్ల వయసులోనే వీలునామా రాయాల్సి వచ్చిందని దురోవ్ వ్యాఖ్యానించారు.
వివాదాలు
టెక్ ప్రపంచంలో వినూత్న వ్యక్తిగా నిలుస్తున్నప్పటికీ, టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్ దుర్వినియోగం కారణంగా దురోవ్ పేరు పలుమార్లు వివాదాల్లో వినిపించింది. ప్లాట్‌ఫారమ్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా, హవాలా లావాదేవీలు.. కొన్ని దేశాల్లో పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ను పంచడం వంటి ఆరోపణలతో ఆయన గతంలో అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మొత్తం మీద, సమతుల్యత, క్రమశిక్షణ , అనవసరమైన సాంకేతికతకు దూరం ఉండటమే తన విజయానికి మూలమని దురోవ్ చెబుతున్న సందేశం, ఆధునిక ప్రపంచంలో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
