Begin typing your search above and press return to search.

పాల్‌ బియా: 92 ఏళ్ల వయసులోనూ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ!

ఆఫ్రికా ఖండంలోని మధ్య ప్రాంత దేశమైన కామెరూన్‌లో ఆదివారం ప్రారంభమైన అధ్యక్ష ఎన్నికలు ప్రపంచ రాజకీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

By:  A.N.Kumar   |   13 Oct 2025 9:13 AM IST
పాల్‌ బియా: 92 ఏళ్ల వయసులోనూ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ!
X

ఆఫ్రికా ఖండంలోని మధ్య ప్రాంత దేశమైన కామెరూన్‌లో ఆదివారం ప్రారంభమైన అధ్యక్ష ఎన్నికలు ప్రపంచ రాజకీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వృద్ధ దేశాధినేతగా పేరొందిన పాల్‌ బియా మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతుండటమే. ఆయన ప్రస్తుత వయసు 92 సంవత్సరాలు.

* 43 ఏళ్ల నిరంతర పాలన.. 99 ఏళ్ల వరకు అవకాశం

బియా 1982లో తొలిసారిగా అధికారంలోకి వచ్చారు. అప్పటి నుండి ఇప్పటివరకు వరుసగా ఏడుసార్లు ఎన్నికల్లో విజయం సాధించి, సుదీర్ఘకాలం పాటు కామెరూన్‌ను పాలించిన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఈసారి ఎన్నికల్లో కూడా ఆయన గెలిస్తే, మరో ఏడు సంవత్సరాలు అంటే 99 ఏళ్ల వయసు వరకు దేశాన్ని నడిపే అవకాశం ఉంది. చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే కామెరూన్ స్వాతంత్ర్యానంతరం (1960) ఇప్పటివరకు కేవలం ఇద్దరు అధ్యక్షులు మాత్రమే పాలించారు. అహ్మదౌ అహిద్జో (1960–1982) మొదటి అధ్యక్షుడు కాగా.. ఆయన తర్వాత పాల్‌ బియా (1982 నుండి నేటి వరకు) పాలించారు.బియా పాలన నిస్సందేహంగా ప్రపంచ రాజకీయాల్లో సుదీర్ఘ పాలనకు ఒక అరుదైన ఉదాహరణగా నిలిచింది.

*వృద్ధాప్యం, పరిపాలనపై అనుమానాలు

వయసు పైబడటంతో పాల్ బియా చాలా కాలంగా ఎక్కువ సమయం యూరప్‌లోని తన నివాసంలో గడుపుతున్నారని సమాచారం. ఆయన ఆరోగ్యంపై తరచూ ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. బియా లేని సమయంలో దేశ పరిపాలనను ఎక్కువగా ఆయన పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారని స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ అంశం ప్రతిపక్షం నుంచి విమర్శలకు తావిస్తోంది.

సంక్షోభాల మధ్య ఎన్నికల నిర్వహణ

కామెరూన్‌ దేశం ప్రస్తుతం అనేక అంతర్గత భద్రతా సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభాల మధ్యే ఎన్నికలు జరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ ప్రాంతంలో ఆంగ్లభాష మాట్లాడే వేర్పాటువాదులు ప్రభుత్వ దళాలతో తీవ్ర స్థాయిలో పోరాడుతున్నారు. ఉత్తర ప్రాంతంలో నైజీరియాకు చెందిన బోకో హరామ్ ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులు ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ పాలనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

పేదరికం, యువత నిరాశ

సుమారు 2.9 కోట్ల జనాభా ఉన్న కామెరూన్‌లో దాదాపు 43 శాతం ప్రజలు పేదరిక రేఖకు దిగువన జీవిస్తున్నారు. దేశంలో యువత సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, వారికి సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో నిరాశ విస్తరిస్తోంది. ఈ ఎన్నికల్లో సుమారు 80 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. యువత ఓట్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చని అంచనా.

మార్పు ఆకాంక్ష

పాల్‌ బియా గెలుపుపై విశ్లేషకులు పెద్దగా సందేహం వ్యక్తం చేయడం లేదు. ఆయన పార్టీకి బలమైన వ్యవస్థ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విశేష ఆధిక్యం ఉండటమే దీనికి ప్రధాన కారణం. అయితే, దేశంలో మార్పును కోరుకుంటున్న యువత వర్గం, ప్రతిపక్షం క్రమంగా బలపడుతున్నాయని కొందరు సూచిస్తున్నారు.

92 ఏళ్ల వయసులోనూ ఎన్నికల బరిలోకి దిగిన పాల్‌ బియా ప్రపంచ రాజకీయాల్లో ఒక అరుదైన ఘట్టం. ఒకవైపు అత్యంత వృద్ధ నాయకుడి నిరంతర పాలన, మరోవైపు యువతలో ప్రబలుతున్న మార్పు ఆకాంక్ష.. ఈ రెండింటి మధ్య కామెరూన్‌ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి.