చికిత్స కోసం వెళ్లి చేతిని కోల్పోయిన యువతి.. పాట్నా ఘటన సంచలనం!
చిన్న చెవి నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఒక 20 ఏళ్ల యువతికి, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా జీవితాంతం కోలుకోలేని ఆవేదన మిగిలింది.
By: Madhu Reddy | 6 Aug 2026 11:47 AM ISTచిన్న చెవి నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఒక 20 ఏళ్ల యువతికి, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా జీవితాంతం కోలుకోలేని ఆవేదన మిగిలింది. చికిత్స సమయంలో వేసిన ఒక తప్పుడు ఇంజెక్షన్ ఫలితంగా ఆమె మోచేతి వరకు చేతిని తొలగించాల్సి వచ్చింది. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒక చిన్న తప్పు ఓ యువతి భవిష్యత్తును ఎలా బుగ్గిపాలు చేసిందో తెలిపే ఈ విషాదకర సంఘటన వివరాలు మీకోసం..
చెవి నొప్పితో వెళ్తే.. చేతికే ప్రమాదం:
పాట్నాకు చెందిన రేఖ (20) అనే యువతి చెవి నొప్పితో బాధపడుతూ స్థానిక మహావీర్ ఆరోగ్య సంస్థాన్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ చికిత్స అందించే క్రమంలో వైద్యులు ఆమెకు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే, ఇంజెక్షన్ వేసిన కొద్దిసేపటికే ఆమె చెయ్యి నల్లగా, ఆకుపచ్చ రంగులోకి మారిపోవడంతో పాటు తీవ్రమైన నొప్పి ప్రారంభమైంది. భరించలేని నొప్పితో ఆమె విలవిలలాడుతున్నా, ఆసుపత్రి సిబ్బంది మాత్రం అది చాలా సాధారణ విషయమని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ప్రాణాలు కాపాడాలంటే చెయ్యి తీసేయాల్సిందే:
పరిస్థితి మరింత విషమించడంతో, కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మేదాంత ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు షాకింగ్ నిజం చెప్పారు. ఇక తప్పుడు ఇంజెక్షన్ కారణంగా ఇన్ఫెక్షన్ తీవ్రమైందని, ప్రాణాపాయం తప్పాలంటే మోచేతి పైభాగం వరకు చెయ్యి తొలగించడం తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేశారు. దీంతో వేరే దారి లేక, ప్రాణాలు నిలబెట్టుకోవడానికి రేఖ తన చెయ్యి తొలగించేందుకు అంగీకరించింది.
పెళ్లి సంబంధం రద్దు.. ఆవేదనలో బాధిత కుటుంబం:
ఒక చిన్న వైద్యుల పొరపాటు వల్ల జీవితాంతం వికలాంగురాలిగా మారానని రేఖ కన్నీరుమున్నీరవుతోంది. ఈ దారుణం కారణంగానే తనకు కుదిరిన పెళ్లి సంబంధం కూడా రద్దయిపోయిందని, తన జీవితం నాశనమైందని వాపోతోంది. ఇక మహావీర్ ఆరోగ్య సంస్థాన్ వైద్యుల నిర్లక్ష్యమే తన ఈ పరిస్థితికి కారణమని ఆరోపిస్తూ, తనకు న్యాయం చేయాలని, ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది.
సోషల్ మీడియాలో ఆగ్రహం.. న్యాయం చేయాలని డిమాండ్:
ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. బాధ్యులైన వైద్యుల లైసెన్సులు రద్దు చేయాలని, సదరు ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసి బాధిత యువతికి భారీ పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై ఆసుపత్రి అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
బాధ్యులపై చర్యలు అవసరం:
వైద్యులను దేవుళ్లతో సమానంగా భావించే సమాజంలో ఇలాంటి నిర్లక్ష్య సంఘటనలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం, సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే నిజానిజాలను బయటకు తీయాలి. ఇక నష్టపోయిన ఆ యువతికి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
