Begin typing your search above and press return to search.

వైసీపీ కంచుకోటను పంచుకుంటున్నారా ?

వైసీపీకి ఉత్తరాంధ్రాలో కంచుకోటగా కొన్ని సీట్లను చెబుతారు. అయితే 2024 ఎన్నికల్లో ఆ కంచుకోటలూ కరిగిపోయాయి.

By:  Satya P   |   24 Dec 2025 9:00 AM IST
వైసీపీ కంచుకోటను పంచుకుంటున్నారా ?
X

వైసీపీకి ఉత్తరాంధ్రాలో కంచుకోటగా కొన్ని సీట్లను చెబుతారు. అయితే 2024 ఎన్నికల్లో ఆ కంచుకోటలూ కరిగిపోయాయి. మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ రెండు అంటే రెండు మాత్రమే వైసీపీకి దక్కాయి. అవి కూడా ఏజెన్సీ ఏరియాలో మాత్రమే. ఆ విధంగా వైసీపీ పరువు ఎంతో కొంత నిలిచినా మైదాన ప్రాంతాలలో కీలక జిల్లాలలో ఉనికి లేకుండా పోయింది. ఇదిలా ఉంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం వైసీపీకి కంచుకోట లాంటి సీటు. అక్కడ నుంచి వైసీపీ 2014 ఎన్నికల్లో అలాగే 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. ఇక 2024 లో ఓడినా బాగానే ఓట్లు వచ్చాయి. దానికి కారణం వైసీపీలో ఉన్న దివంగత నేత మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కుటుంబానికి అక్కడ గట్టి పట్టు ఉండడమే. అయితే 2024 ఎన్నికల తరువాత పాతపట్నంలో వైసీపీ పరిస్థితి ఏమిటి అన్నది ఇపుడు చర్చగా ఉంది.

వర్గ పోరుతో నీరసం :

వైసీపీలో వర్గ పోరు పాతపట్నంలో ఉంది అని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్ని వర్గాలను కలుపుకుని పోవడం లేదని 2019 నుంచి 2024 మధ్యలో అనేకసార్లు పార్టీ నేతలు అధినాయకత్వానికి విన్నవించుకున్నారు. అయినా సరి చేయలేకపోయారు. దాంతోనే చివరికి ఓటమి సంభవించింది అని అంటున్నారు. అంతే కాదు హీరమండలం ఉంచి శాంతి కుమారుడు జెడ్పీటీసీ గా పోటీ చేస్తే వర్గ పోరే ఓడించింది అని అంటున్నారు అయినా పార్టీ సర్దుకోకపోవడంతో టోటల్ గా సీన్ మారింది

టీడీపీ విక్టరీ :

ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ అక్కడ నుంచి భారీ విజయం నమోదు చేసింది. అది కూడా దాదాపుగా పదిహేనేళ్ళ తరువాత కావడంతో ఆ పార్టీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కూటమి అంతా ఐక్యంగా పనిచేయడం వల్లనే అది వీలు పడింది. ఇక పాతపట్నంలో కొత్త అభ్యర్థిగా స్థానిక బిగ్ షాట్ అయిన మామిడి గోవింద రావుని తెర పైకి తెచ్చి సక్సెస్ కొట్టారు. అప్పటిదాకా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కలమట కుటుంబాన్ని కాదని ఈ నిర్ణయం తీసుకున్నా ఫలితం మాత్రం సానుకూలం అయింది. ఇపుడు చూస్తే మామిడి గోవిందరావు ఎమ్మెల్యేగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నారు. ఆయన గట్టిగా జనంలో తిరుగుతున్నారు. అంతే కాదు వైసీపీని వీక్ చేయడానికి ఆపరేషన్ ఆకర్ష్ ని కూడా తెర మీదకు తెచ్చారు. దాంతో తాజాగా జగన్ బర్త్ డే వేళ పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజా ప్రతినిధులు అంతా టీడీపీలోకి వెళ్ళి జాయిన్ అయిపోయారు. ఇది వైసీపీకి పెద్ద దెబ్బగా చెబుతున్నారు.

జనసేన సైతం :

మరో వైపు జనసేన కూడా ఎక్కడా తగ్గడంలేదు. ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఈ సీటుని కోరాలని చూస్తోంది. దాంతో ఆ పార్టీకి చెందిన ఒక మహిళా నేత జోరు చేస్తున్నారు. ఆమె భర్తకు నామినేటెడ్ పదవి దక్కడంతో ఆయన కూడా తన అధికారాన్ని ఉపయోగించి వాఇసీపీ నేతలను ఆకట్టుకుంటున్నారు. దాంతో రెడ్డి శాంతి నాయకత్వ పోకడల పట్ల విముఖంగా ఉన్న వారు జనసేన వైపు మళ్ళుతున్నారు. ఇలా రెండు వైపుల నుంచి వైసీపీ జనాలను లాగేస్తున్న నేపధ్యంలో వైసీపీ ఎలా తట్టుకుంటుంది అన్నది చర్చగా ఉంది. ఆ మధ్యన వైసీపీ అధినాయకత్వం రెడ్డి శాంతిని పిలిపించి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయమని సూచించింది. మరి పరిస్థితిని ఎప్పటికపుడు అంచనా వేస్తున్న హైకమాండ్ ఎన్నికల వేళకు ఏమి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి పాతపట్నంలో కొత్త రాజకీయం అయితే రంజుగా సాగుతోంది అని అంటున్నారు.