Begin typing your search above and press return to search.

పైసలు తీసుకున్నారు.. పత్తా లేకుండా పోయారు

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చోటు చేసుకున్న సిత్రం రాజకీయ పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది.

By:  Garuda Media   |   12 Nov 2025 9:31 AM IST
పైసలు తీసుకున్నారు.. పత్తా లేకుండా పోయారు
X

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చోటు చేసుకున్న సిత్రం రాజకీయ పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేసుకోవటమే కాదు.. ఓటర్లకు డబ్బులు పంచే విషయంలోనూ పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకున్నారు.

రోటీన్ కు భిన్నంగా పోలింగ్ కు ఒకట్రెండు రోజులు ముందు ఓటర్లకు డబ్బులు పంచే సంప్రదాయాన్ని పక్కన పెట్టేసి.. శుక్రవారం నుంచే డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గంలోని నాలుగు లక్షల ఓటర్లలో రెండు లక్షల మందికి ఒక ప్రధాన పార్టీ టార్గెట్ పెట్టుకొని మరీ పైసలు పంచితే.. మరో పార్టీ లక్ష మంది ఓటర్లను లక్ష్యంగా చేసుకొని మరీ డబ్బులు పంచాయి. ఒక పార్టీ ఓటుకు రూ.2500 చొప్పున పంచితే.. మరో పార్టీ ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేసింది.

ఓటర్లకు నోట్లతో పాటు పట్టుచీరను కూడా పంచిన పార్టీ ఉంది. ఓటర్లకు డబ్బులు పంచే కార్యక్రమాన్ని పోలింగ్ కు ఐదు రోజుల ముందు నుంచే మొదలెట్టిన పార్టీలు చివరి వరకు కొనసాగించాయి. ఒక పార్టీ అయితే.. పోలింగ్ కేంద్రాలకు కూతవేటు దూరంలో కూడా డబ్బులు పంచేందుకు వెనుకాడలేదు. తమకు డబ్బులు అందలేదని ఓటరు స్లిప్ తీసుకొని వచ్చిన ఓటర్లకు.. తమ వద్ద ఉన్న జాబితాను చెక్ చేసి మరీ.. డబ్బులు చేతిలో పెట్టిన పరిస్థితి.

దీంతో.. పోలింగ్ శాతాలు భారీగా నమోదవుతాయని.. గతానికి భిన్నంగా పోలింగ్ ఉంటుందని ఆశించారు ఆయా పార్టీల నేతలు. అయితే.. ఇందుకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే కేవలం ఒక శాతం మాత్రమే అదనంగా ఓట్లు పోల్ కావటం గమనార్హం. దీంతో.. షాక్ తినటం ప్రధాన పార్టీల వంతైంది. భారీ ఎత్తున ప్రచారం చేసి.. గతంలో ఎప్పుడూ లేనంత భారీగా డబ్బులు పంచిన తర్వాత కూడా ఓట్లు వేసేందుకు ఓటర్లు రాకపోవటం మింగుడుపడని వ్యవహారంగా మారింది. మొత్తంగా పైసలు తీసుకొని పత్తా లేకుండా పోయిన ఓటర్ల తీరు.. ప్రధాన రాజకీయ పార్టీలకు షాకింగ్ గా మారిందని చెప్పకతప్పదు.