Begin typing your search above and press return to search.

త్రిషకు క్షమాపణ చెప్పి.. మళ్లీ ఎటాక్ చేశాడు

తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా విజయ్, త్రిషల బంధం గురించి పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Garuda Media   |   10 March 2026 6:33 PM IST
త్రిషకు క్షమాపణ చెప్పి.. మళ్లీ ఎటాక్ చేశాడు
X

తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా విజయ్, త్రిషల బంధం గురించి పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సొంతంగా పార్టీ పెట్టి తొలిసారి ఎన్నికల బరిలో నిలవబోతున్న తరుణంలో త్రిషతో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. తన భార్య సంగీత విడాకుల పిటిషన్ వేసి, తనపై ఆరోపణలు చేసిన సమయంలోనే విజయ్.. త్రిషతో కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరు కావడం తీవ్ర దుమారం రేపింది. దీంతో విజయ్‌తో పాటు త్రిష కూడా ఇటు వైరి రాజకీయ పార్టీలకు, అటు సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు.

ఇదే సమయంలో సీనియర్ దర్శకుడు, నటుడు పార్తీబన్ ఒక సినిమా ఈవెంట్లో త్రిష గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తన వెనుక స్క్రీన్ మీద త్రిష ఫొటో డిస్‌ప్లే కాగా.. ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలోని త్రిష పాత్ర ‘కుందవి’ పేరుతో ఆమెను సంబోధిస్తూ.. కుందవి ఇంట్లో ఉంటేనే మంచిదని, బయటికి వస్తే లేని పోని సమస్యలు వస్తాయని ఆయన సరదాగా వ్యాఖ్యానించడంతో దుమారం రేగింది.

ఇదంతా ప్రి ప్లాన్డ్‌గా చేశారంటూ త్రిష ఒక ట్వీట్ ద్వారా పార్తీబన్ తీరును ఎండగట్టింది. ఐతే కాసేపటికే పార్తీబన్ క్షమాపణ వీడియో బయటికి వచ్చింది. అంతటితో వ్యవహారం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ కొన్ని గంటల తర్వాత పార్తీబన్ లైన్లోకి వచ్చాడు. తాను పొరపాటుగా మాట్లాడాను కాబట్టి క్షమాపణ చెప్పాలని వీడియో రికార్డ్ చేసి ఇచ్చానని.. కానీ తర్వాత ట్వీట్ ద్వారా త్రిష తన మీద చేసిన ఆరోపణలు చూశాక తన అభిప్రాయం మార్చుకున్నానంటూ ఆమె మీద కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టాడు పార్తీబన్. తానేదో ప్లాన్ చేసి, డబ్బుల కోసం ఇదంతా చేసినట్లు త్రిష తప్పుడు ఆరోపణలు చేయడమే కాక తీవ్రంగా మాట్లాడిందని.. అలాంటపుడు ఆమె చేసిన తప్పేంటో చెప్పాల్సిన అవసరం ఉందని ఆయనన్నారు.

విజయ్ ఎంతో కష్టపడి ఒక స్థాయికి వచ్చాడని.. అతను తనతో పాటు పెళ్లి వేడుకకు పిలిచినా త్రిష వచ్చి ఉండాల్సింది కాదని.. మ్యాచింగ్ చీర తెచ్చి ఇస్తే దాన్ని కట్టుకుని ఈవెంట్‌కు రాకూడదని ఆయన తేల్చి చెప్పారు. దీని వల్ల రాజకీయంగా విజయ్‌కి చాలా డ్యామేజ్ జరిగిందన్నట్లుగా ఆయన మాట్లాడారు. త్రిష ఇంటికే పరిమితం కావాల్సిందన్న తన మాటకు కట్టుబడి ఉన్నానని.. త్రిష ట్వీట్‌ను ముందే చూసి ఉంటే తాను క్షమాపణ వీడియో రిలీజ్ చేసేవాడినే కాదని పార్టీబన్ తేల్చి చెప్పారు.