విపక్ష విజయం : ఓకే సర్- డిబేట్ షురూ
ఓటర్ల ప్రత్యేక జాబితా సవరణ సర్ అంశంపై పార్లమెంట్ లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దేశంలో తొలి విడత బీహార్ తో మొదలై మలివిడత పశ్చిమ బెంగాల్, తమిళనాడు కేరళ అసోం వంటి రాష్ట్రాలలో కొనసాగుతోంది.
By: Satya P | 3 Dec 2025 9:29 AM ISTఓటర్ల ప్రత్యేక జాబితా సవరణ సర్ అంశంపై పార్లమెంట్ లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దేశంలో తొలి విడత బీహార్ తో మొదలై మలివిడత పశ్చిమ బెంగాల్, తమిళనాడు కేరళ అసోం వంటి రాష్ట్రాలలో కొనసాగుతోంది. అయితే పశ్చిమ బెంగాల్, తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాలు సర్ ని తమ స్టేట్స్ లో అమలు చేయవద్దని కోర్టుకు వెళ్ళారు. మరో వైపు పార్లమెంట్ లోనూ సర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. వర్షాకాల సమావేశాలు పూర్తిగా సర్ కే సమర్పయామి అయిపోయాయి. ఇపుడు చూస్తే శీతాకాల సమావేశాలు ప్రారంభం అయి రెండు రోజులు గడచినా సభలో చర్చకు అవకాశం లేదు, సర్ మీదనే విపక్షాలు అన్నీ చర్చకు పట్టుబడుతున్నాయి.
వాయిదాల పర్వం :
ఈ నేపధ్యంలో ఓటర్ల ప్రత్యేక జాబితా సవరణ అంశంపై ప్రతిష్టంభన కొనసాగడంతో లోక్‌సభ మంగళవారం నుంచి బుధవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే రకమైన పరిస్థితి ఉంది. పాల్రమెంట్ సమావేశం అవుతూనే సర్ మీద చర్చకు ప్రతిపక్షం డిమాండ్ చేయడంతో లోక్ సభ రాజ్యసభ కూడా రెండు సార్లు వాయిదా పడ్డాయి. లోక్ సభలో అయితే స్పీకర్ ఓం బిర్లా సభను కొనసాగించడానికి ప్రయత్నించారు. పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ, ప్రతిపక్షం తమ నిరసనను కొనసాగించింది. కాంగ్రెస్, డిఎంకె, టిఎంసి, ఇతరులు సహా ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి సర్ మీద చర్చ కోసం డిమాండు చేశారు. రాజ్యసభలో సైతం ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ రెండు సార్లు వాయిదా పడింది. సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, 267 నిబంధనల ప్రకారం సర్ అంశంపై చర్చకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇలా రెండు సభలూ వాయిదాలతోనే కొనసాగుతున్నాయి.
9న డిస్కషన్ కి ఓకే :
ఈ నేపథ్యంలో ఈ నెల 9న లోక్ సభలో ఎన్నికల సంస్కరణలపైన సర్ అంశం మీద చర్చకు కేంద్రం అంగీకరించింది. దీనితో పాటుగా జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా లోక్‌సభ ప్రత్యేక చర్చను ఈ నెల 8 న నిర్వహించనున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్ సభ సర్ అంశం మీద చర్చ తరువాత రాజ్యసభలో కూడా చర్చను చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తుందని ఆయన చెప్పారు. ఎన్నికల కమిషన్ సంస్కరణ అనేది ప్రభుత్వం పార్లమెంటులో చర్చించే పెద్ద సమస్యగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అంతే కాదు దీని మీద అన్ని పార్టీలూ పాల్గొంటాయని చెబుతున్నారు.
సర్ కొనసాగిస్తారా :
నిజానికి చూస్తే దేశంలోని అనేక పార్టీలు సర్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రక్రియలో అసలైన ఓటర్లకు అన్యాయం జరుగుతోందని వాదిస్తున్నాయి. అందుకే సర్ ని తాము అడ్డుకుంటామని ప్రకటిస్తున్నాయి. మరి సర్ మీద చర్చ సందర్భంగా అయినా విపక్షాలు ప్రభుత్వం చెప్పిన మాటలను విని అమలుకు ఓకే అంటాయా అన్నది ఒక విషయం అయితే సర్ కి విపక్షాలు చేసే సూచనలు పాటించి కంటిన్యూ చేస్తారా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా సర్ అన్న ఒక కీలక అంశానికి పార్లమెంట్ వేదిక మీదనే పరిష్కారం కనుగోనాలని అధికార విపక్షాలు రెండూ అంగీకరించడం మాత్రం విశేష పరిణామం అని అంటున్నారు.
