Begin typing your search above and press return to search.

ప్రోరోగ్ లో కొత్త రికార్డు ..డీలిమిటేషన్ కోసమేనా ?

పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ప్రోరోగ్ చేస్తారు. ఈ సమావేశాలు ముగిసినట్లు రాష్ట్రపతి అధికారికంగా ఉత్తర్వులు ఇస్తారు.

By:  Satya P   |   12 Sept 2026 8:48 AM IST
ప్రోరోగ్ లో కొత్త రికార్డు ..డీలిమిటేషన్ కోసమేనా ?
X

పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ప్రోరోగ్ చేస్తారు. ఈ సమావేశాలు ముగిసినట్లు రాష్ట్రపతి అధికారికంగా ఉత్తర్వులు ఇస్తారు. అయితే తాజాగా ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురించి చూస్తే ప్రోరోగ్ అయితే కాలేదు. దాంతో దీని మీదనే బీజేపీ కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పార్లమెంట్ నిరవధిక వాయిదా అంటే సభను నిర్దిష్ట తేదీ చెప్పకుండా వాయిదా వేయడం అన్న మాట. దీనిని లోక్‌సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ ప్రకటిస్తారు. ప్రోరోగ్ అంటే ఇక దీనితో ఆ సెషన్ పూర్తిగా ముగుస్తుంది. అయితే ఈసారి మాత్రం ప్రోరోగ్ అన్న మాట లేకపోవడంతో ఎపుడైనా పార్లమెంట్ ని తిరిగి పిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే ప్రత్యేక సమావేశాల పేరిట పార్లమెంట్ ని సమావేశ పరచాలని ఆలోచన కేంద్రంలో బీజేపీకి ఉందా అన్నదే ఇపుడు రాజకీయ చర్చగా సాగుతోంది. దీని మీద కాంగ్రెస్ నుంచి విమర్శలతో రాజకీయ రచ్చగా మారుతోంది.

గత రికార్డు బద్దలు :

ఇక ప్రోరోగ్ అన్నది చూస్తే గతంలో ఇదే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం హయాంలో 2015లో ఒకసారి చాలా రోజుల పాటు అలాగే జరిగింది. అప్పుడు కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలనే ప్రోరోగ్ చేయకుండా ఏకంగా 28 రోజులు ఉంచేశారు. ఇపుడు చూస్తే తాజా పార్లమెంట్ సమావేశాలు ముగిసి 29 రోజులు అవుతోంది. ప్రోరోగ్ కాలేదు కాబట్టి గత రికార్డుని ఈసారి బద్దలు కొట్టారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. దీని మీద కాంగ్రెస్ కి చెందిన సీనియర్ నేత జై రాం రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే ప్రోరోగేషన్ కాకుండా ఆలస్యం చేస్తోంది అని మండిపడ్డారు. ఈ సమయంలో బీజేపీ తాను అనుకుంటున్న డీలిమిటేషన్ బిల్లుని ఆమోదించుకోవడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ కోసం ప్రయత్నాలు చేసుకుంటోందని ఆరోపించారు.

లేని బలం కోసమా :

బీజేపీకి మూడింట రెండు వంతుల మెజారిటీ అన్నది లేదని తేలిపోయిన తరువాత ఈ విధంగా చేయడమేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మూడు పార్టీలలో చీలిక తెచ్చారని ఇపుడు మరింత మెజారిటీ కూడగట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఇక చూస్తే ఈ ఏడాది ఏప్రిల్ లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి ఎన్డీయే ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు సభ ముందుకు తెచ్చింది. అయితే ఆనాడు మొత్తం ఓటింగులో 528 మంది ఎంపీలు పాల్గొన్నారు. అందులో ఎన్డీయేకు 298 మంది ఎంపీల మద్దతు మాత్రమే లభించింది అని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. మిగిలిన 230 మంది వ్యతిరేకంగా ఓటు చేయడంతో బిల్లు వీగిపోయిందని చెబుతున్నారు. ఇక మూడింట రెండు వంతులు అంటే 352 మంది ఎంపీల మద్దతు అవసరం అని స్పష్టం చేస్తున్నారు. ఎన్డీయేకు ఆ బలం లేదని అంటున్నారు. మరి ప్రోరోగేషన్ చేయకుండా ఎందుకీ కొత్త సంప్రదాయం అని ప్రశ్నిస్తున్నారు.

ముహూర్తం పెట్టారా :

ఇక మరో వైపు చూస్తే ఎన్డీయే ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదించుకోవడానికి పార్లమెంట్ ని తిరిగి ప్రత్యేకంగా సమావేశపరచాలని చూస్తోంది అంటున్నారు. దానికి నవ రాత్రులు ముహూర్తంగా చేసుకుంటుందని అంటున్నారు. నవ రాత్రులు అంటే అమ్మ వారికి పవిత్ర దినాలు, నారీ శక్తి బిల్లు పేరుతో మహిళా రిజర్వేషన్లను ఎన్డీయే ప్రతిపాదిస్తోంది. దాంతో ఆ సెంటిమెంట్ ఆధ్యాత్మికత కలిసి బిల్లుని నెగ్గిస్తాయని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇక మరి కొంత సమయం దొరికితే మూడింట రెండు వంతుల మద్దతు లభిస్తుంది అని కూడా బీజేపీ నమ్ముతోంది. ఇక్కడే కాంగ్రెస్ బీజేపీ ప్రోరోగ్ ఆలస్యం చేయడం మీద విమర్శలు గుప్పిస్తోంది. మరి ప్రోరోగ్ ఎందుకు చేయడం లేదు అన్నది తొందరలో తెలుస్తుంది.