బెర్తు కన్ఫర్మ్ కాకుంటే కొంత తిరిగి చెల్లించాల్సిందే.. ఈ సూచన ఎవరిదంటే?
రైళ్లలో ప్రయాణించే వారికి రెండు సందర్భాలు తరచూ ఎదురవుతుంటాయి. అందులో ఒకటి కోరుకున్న ట్రైన్ లో రిజర్వు బెర్తు దొరక్కపోవటం. చాటంత వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తుంది.
By: Garuda Media | 6 Feb 2026 1:00 PM ISTఏళ్లకు ఏళ్లుగా జరుగుతున్న తప్పును సరిదిద్దే ప్రయత్నం చేసింది పార్లమెంటరీ కమిటీ. ఒక సేవను పొందే వేళలో.. సగం సేవను మాత్రమే అందించినప్పుడు.. పూర్తి మొత్తాన్ని ఎందుకు చెల్లించాలన్నది ప్రాథమికంగా ఎదురయ్యే ప్రశ్న. కానీ.. ప్రభుత్వ రంగ సంస్థ కావటం.. దాని నిర్ణయాన్ని ప్రశ్నించినా పెద్దగా పట్టించుకోని తీరుతో ఇప్పటివరకు సాగిన తీరుకు చెక్ పెట్టేలా తాజాగా పార్లమెంటరీ కమిటీ తన నిర్ణయాన్ని ప్రకటించింది.
రైళ్లలో ప్రయాణించే వారికి రెండు సందర్భాలు తరచూ ఎదురవుతుంటాయి. అందులో ఒకటి కోరుకున్న ట్రైన్ లో రిజర్వు బెర్తు దొరక్కపోవటం. చాటంత వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తుంది. ఇది క్లియర్ అయ్యే క్రమంలో ఆర్ ఏసీ వద్ద ఆగిపోతుంది. ఆర్ఏసీ అంటే.. రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్. అచ్చ తెలుగులో చెప్పాలంటే రద్దుకు వ్యతిరేకంగా రిజర్వేషన్ అని చెప్పాలి. ఇందులో బెర్తు దొరకదు. కానీ.. సీటు పక్కా. ట్రైన్ లో సైడ్ లోయర్ బెర్తు ఉంటుంది కదా. దాన్ని ఇద్దరికి సీటు కింద షేర్ చేయటం తెలిసిందే. సాధారణంగా బెర్తు అంటే పడుకోవటానికి వీలు ఉంటుంది. ఆర్ ఏసీలో పడుకోవటానికి కాకుండా కుర్చునేందుకు మాత్రమే వీలు ఉంటుంది.
బెర్తు కోసం టికెట్ ఛార్జీలు చెల్లించినప్పుడు.. సీటు మాత్రమే ఇస్తే.. మరి బెర్తు కోసం తీసుకున్న డబ్బుల్లో అంతో ఇంతో అయినా వెనక్కి ఇవ్వాలి కదా? ఇది న్యాయమైన మాటే కదా? అన్న క్వశ్చన్ రావొచ్చు. నిజమే, ఈ వాదనలో న్యాయం కనిపిస్తుంది. కానీ.. ఇప్పటివరకు దీని గురించి ఆలోచించినోళ్లు కనిపించరు. తాజాగా పార్లమెంటరీ కమిటీ ఈ అంశాన్ని తన రిపోర్టులో పేర్కొంది.
పంక్చువాలిటీ అండ్ ట్రావెల్ టైమ్ ఇన్ ట్రైన్ ఆపరేషన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ పేరుతో ప్రజాపద్దుల కమిటీ పార్లమెంట్ కు సమర్పించిన రిపోర్టులో ఈ అంశాన్ని పేర్కొంది. ఆర్ఏసీలో ఉండి బోర్డింగ్ సమయంలో బెర్త్ లభించని ప్రయాణికులకు ఛార్జీలో కొంత డబ్బులు తిరిగి ఇవ్వాలని సూచన చేసింది. దీని ప్రకారం బెర్తు దొరక్క.. సీటుతోనే సర్దుబాటు చేసుకొని ప్రయాణం పూర్తి చేసే ప్రయాణికులకు వారు చెల్లించిన టికెట్ మొత్తంలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని.. అందుకు తగ్గట్లు తీసుకున్న చర్యలను తమకు తెలియజేయాలని పార్లమెంటరీ కమిటీ ఆదేశించింది. మరి.. దీనికి ఇండియన్ రైల్వేస్ ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.
