Begin typing your search above and press return to search.

రచ్చ తప్ప చర్చ ఏదీ...వానాకాలం పార్లమెంట్ !

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు చర్చలు లేకుండానే వాయిదా పడుతున్నాయి. వరసగా ఆరవ రోజు అయిన సోమవారం కూడా ఇదే జరిగింది.

By:  Satya P   |   28 July 2026 9:11 AM IST
రచ్చ తప్ప చర్చ ఏదీ...వానాకాలం పార్లమెంట్ !
X

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు చర్చలు లేకుండానే వాయిదా పడుతున్నాయి. వరసగా ఆరవ రోజు అయిన సోమవారం కూడా ఇదే జరిగింది. విపక్షాల నినాదాలు గందరగోళం మధ్య ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు దారుణంగా వ్యవహరించారు అని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేయడంతో పార్లమెంటు ఉభయ సభలలో రచ్చ సాగింది. పలు మార్లు సభ వాయిదా పడినా కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను మరుసటి రోజుకే వాయిదా వేయాల్సి వచ్చింది.

పరీక్ష బిల్లు పెట్టినా :

ఇక లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్ సవరణ బిల్లు- 2026ను మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. ఈ చట్టంలో పదేళ్ల వరకు జైలు శిక్ష, పది కోట్ల రూపాయల వరకు జరిమానాలు, దోషులుగా తేలిన వారి ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా అనేక ముఖ్యమైన నిబంధనలు పొందుపరచబడ్డాయి. కేసుల వేగవంతమైన పరిష్కారాన్ని నిర్ధారించడానికి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంత పరిపాలన రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. అంతేకాకుండా, పోలీస్ స్టేషన్‌లో సమాచారం నమోదైన తేదీ నుండి రెండు నెలల్లోగా నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలని కూడా ఇది నిర్దేశిస్తుంది. ఛార్జిషీట్ దాఖలు చేసిన మూడు నెలల్లోగా విచారణ ముగించాలని నిబంధనలు పొందుపరచారు. అయితే ఈ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు కూడా సభలో గందరగోళం ఉండడం విశేషం.

చర్చిద్దాం అంటూ :

ఇక కీలకమైన పరీక్షల బిల్లు మీద చర్చ చేద్దామని ప్రభుత్వం కోరింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అయితే సోమవారం అంతా బిల్లు మీద చర్చకు ప్రయత్నం చేశామని మంగళవారం తప్పనిసరిగా చర్చిస్తామని స్పష్టం చేశారు. ఆరు గంటలకు పైగా ఈ ఒక్క బిల్లు మీదనే చర్చించి అందరి అభిప్రాయాలను కూడగడతామని అన్నారు. అయితే లోక్ సభలో జరుగుతున్న తీరు తెన్నులు చూస్తే ఈ బిల్లు మంగళవారం చర్చకు నోచుకుంటుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

విపక్షం కట్టడితోనే :

కేంద్ర ప్రభుత్వం విషయంలో విపక్షం ఒక జట్టుగా ఉంటూ కట్టడి చేస్తోంది. అది లోక్ సభలోనూ రాజ్యసభలోనూ కనిపిస్తోంది. వర్షాకాల సమావేశాలలో ఎన్నో ప్రాధాన్యత కలిగిన అంశాలు ఉన్నాయి. డీలిమిటేషన్ లాంటి బిల్లులు సభ ముందుకు రావాల్సి ఉంది. కానీ వ్యూహం ప్రకారమే విపక్షాలు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అంటున్నారు. దేశ యువత ఈ అంశాన్ని నిశితంగా గమనిస్తోందని అన్నారు. ఇంత ముఖ్యమైన బిల్లుపై చర్చకు అంతరాయం కలిగించడం చాలా తప్పుడు సంకేతాన్ని పంపుతుందని రిజిజు అన్నారు. మరో వైపు చూస్తే గత వారం వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. తొలి అయిదు రోజులూ వాయిదాల పర్వం నడిచింది. విద్యార్ధుల ఆందోళన ముగిసింది కాబట్టి ఈ వారం అయినా సభ సజావుగా సాగుతుంది అనుకుంటే విపక్షాలు నిరసనలు కంటిన్యూ చేస్తున్నారు మరో పన్నెండు రోజులు మాత్రమే పని దినాలు ఉన్నాయి. దాంతో ఈసారి కీలక బిల్లులు ఆమోదం పొందడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బహుశా ఇదే విపక్షాల వ్యూహం కూడా అయి ఉంటుందని అంటున్నారు.