వర్షాకాల పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్లులు ?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి మొదలు కానున్నాయి. కనీసంగా నెల రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయని చెబుతున్నారు.
By: Satya P | 2 July 2026 12:00 AM ISTపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి మొదలు కానున్నాయి. కనీసంగా నెల రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయని చెబుతున్నారు. ఈసారి వర్షాకాల సమావేశాలలో అనేక ఉరుములు మెరుపులు చోటు చేసుకోవడం ఖాయమని అంటున్నారు. ప్రత్యేకించి కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులు అన్నీ ఈ సమావేశాలలో వరసగా ముందుకు వస్తాయని చెబుతున్నారు. అందులో మొదటిది అయితే డీలిమిటేషన్ బిల్లు. దీనిని సంబంధించిన పూర్వ రంగం సిద్ధం అయింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న ఈ బిల్లు ప్రవేశపెడితే 17న జరిగిన ఓటింగ్ లో వీగిపోయింది. దాంతో గత అనుభవాలతో ఈ బిల్లుని ఈసారి మరింత జాగ్రత్తగా ముందుకు తీసుకుని వస్తున్నారు అని చెబుతున్నారు.
మద్దతు గట్టిగానే :
ఇక డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి అవసరం అయిన 362 మ్యాజిక్ ఫిగర్ కోసం ఎన్డీయే ప్రభుత్వం అవసరమైన కసరత్తు చేసింది అని అంటున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన 20 మంది ఎంపీలతో పాటు శివసేన ఉద్ధవ్ థాక్రే చీలిక వర్గం ఆరుగురు ఎంపీలతో ఎన్డీయే కూటమికి 324 మంది ఎంపీల మద్దతు సులువుగానే దక్కుతోంది. దానికి మరింత మంది న్యూట్రల్ పార్టీల మద్దతుని దక్కించుకోవాలని కేంద్రం చూస్తోంది. అదే విధంగా డీఎంకే ఇండియా బ్లాక్ నుంచి వేరుపడి దూరం పాటిస్తోంది. నేరుగా ఎన్డీయే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకపోయినప్పటికీ సభకు గైర్ హాజరు అయితే 22 మంది డీఎంకే సభ్యుల వల్ల లోక్ సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ మ్యాజిక్ నంబర్ కాస్తా ఏ 350 దగ్గరికో వస్తుందని అంటున్నారు. మరికొంత మంది సభ్యులు గైర్ హాజరు అయితే చాలు ఇంకా ఈజీగా బిల్లు ఆమోదం పొందుతుందని అంటున్నారు.
గణనీయమైన మార్పులు :
ఇక డీలిమిటేషన్ తో పాటుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే దేశ రాజకీయ ముఖ చిత్రంలోనే గణనీయంగా మార్పులు వస్తాయని అంటున్నారు. అదే కనుక జరిగితే దేశంలో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వారిలో అత్యధికులు తిరిగి తమ సొంత సీటు నుంచి పోటీ చేయడం కష్టమే అవుతుంది. ముఖ్యంగా విపక్షాలు బలంగా ఉన్న సీట్లలో వారు రాజకీయంగా ఇబ్బందిపడతారు అని అంటున్నారు. అందుకే డీలిమిటేషన్ మహిళా బిల్లు విషయంలో ఏప్రిల్ 16న రాద్ధాంతం జరిగింది. కానీ ఇపుడు ఈజీగా ఈ బిల్లు మద్దతు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముప్పయి రోజులు చాలు :
ఇక మరో కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్ సభ ముందుకు ఈ వర్షాకాల సమావేశాల్లో రాబోతోంది అని అంటున్నారు. ఎవరైనా తీవ్రమైన నేరాలలో అరెస్టు అయి 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే చాలు ప్రధాని అయినా లేక ముఖ్యమంత్రి అయినా వారిని ఆ సీట్లో నుంచి తొలగించవచ్చు అన్నది ఈ బిల్లు ఉద్దేశ్యంగా చెబుతున్నారు. ఈ బిల్లు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో ఆటోమేటిక్ గా ఈ బిల్లు కూడా రాజ్యాంగ సవరణ జరిగి ఆమోదం పొందడం ఖాయమని అంటున్నారు. ఇది కనుక ఆమోదం పొందితే దేశంలో రాజకీయ కక్షలకు దీనిని ఎక్కువగా వాడుతారు అన్న చర్చ కూడా వస్తుంది. అయితే అలా చేయకుండా తగిన రక్షణలతో ఈ బిల్లుని చట్టంగా చేస్తే మంచిదే అని అంటున్నారు.
జమిలి ఎన్నికలకు శ్రీకారం :
ఇంకో కీలక బిల్లు జమిలి ఎన్నికలు. ఇది బీజేపీ అజెండాలో ఎప్పటి నుంచో ఉంది. ఈ బిల్లుని కనుక ఆమోదిస్తే దేశంలో ప్రాంతీయ నినాదాలు వాదాల కంటే జాతీయ అంశాలే జాతీయ విధానాలే ఎక్కువగా చర్చకు వస్తాయని అంటున్నారు. అపుడు బీజేపీ లాంటి ఇమేజ్ ఉన్న పార్టీలకు ప్రతిష్ట గ్లామర్ కలిగిన నాయకులు కలిగిన పార్టీలకు ఎక్కువ మేలు జరుగుతుందని చర్చ అయితే ఉంది. దీనిని విపక్షాలు వ్యతిరేకిస్తున్నా కూడా ఇపుడు ఈ జమిలి బిల్లు కూడా పార్లమెంట్ ముందుకు వస్తుందని అంటున్నారు. ఈ బిల్లులే కాదు అనేక రాజ్యాంగ సవరణ బిల్లులు ముందుకు వచ్చే చాన్స్ అయితే ఉంది. దాంతో ఈసారి వర్షాకాల సమావేశాలకు విశేష ప్రాధాన్యత ఉందని అంటున్నారు.
