డీ లిమిటేషన్ ...ఢీ అంటే ఢీ తప్పదా ?
వర్షాకాలం పార్లమెంట్ సెషన్ లో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి తప్పదా అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి అంటున్నారు.
By: Satya P | 20 July 2026 12:39 AM ISTవర్షాకాలం పార్లమెంట్ సెషన్ లో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి తప్పదా అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి అంటున్నారు. పార్లమెంట్ సెషన్ ని దృష్టిలో ఉంచుకుని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని విపక్షాలు బహిష్కరించడం దీనికి ప్రధాన సంకేతంగా కనిపిస్తోంది. డీలిమిటేషన్ బిల్లు ఈ సమావేశాలలో ప్రవేశపెడతారు అన్న వార్తల నేపథ్యంలో దానిని తీవ్రంగా వ్యతిరేకించాలని విపక్షాలు నిర్ణయించడం విశేషం. మరో వైపు డీఎంకే కూడా అఖిల పక్షానికి హాజరు కాకపోవడమే కాదు ఎన్డీయే ప్రభుత్వం మీద విమర్శలు చేసింది. ప్రధాని అధ్యక్షతన జరగాల్సిన అఖిల పక్ష సమావేశాలు ఆయన రాకపోవడంతో ఆ సంప్రదాయం కొనసాగడం లేదని డీఎంకే ఆక్షేపించింది.ఇక కాంగ్రెస్ తో పాటు ఆప్ శివసేన ఉద్ధవ్ థాక్రే సహా ఇండియా బ్లాక్ పార్టీలు అన్నీ గైర్ హాజరు అయ్యాయి.
కీలక బిల్లుల కోసం :
ఈసారి సమావేశాలలో కీలకమైన బిల్లులను ఆమోదించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఇందులో మహిళా బిల్లు డీలిమిటేషన్ బిల్లు వంటి వాటికి అయితే రాజ్యాంగ సవరణ అవసరం. అందుకు గానూ 362 మంది ఎంపీల బలం కావాలి. లోక్ సభలో ప్రస్తుతం లెక్కలు చూస్తే కనుక బీజేపీకి అంతటి బలం లేదు, ఎన్డీయే మిత్రులు అందరితో పాటు చీలిక పార్టీలు వర్గాల ఎంపీలను తీసుకున్నా అది కుదిరే వ్యవహారంగా కనిపించడం లేదు అంటున్నారు. డీ లిమిటేషన్ ద్వారా గరిష్టంగా 850 వరకూ ఎంపీలను లోక్ సభలో పెంచాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఇందులో 33 శాతం మహిళా రిజర్వేషన్లకు కేటాయించాలని కూడా భావిస్తోంది.
అడ్డుకుంటామంటున్న ఇండియా కూటమి :
డీలిమిటేషన్ మీద ఇండియా బ్లాక్ పార్టీలు అయితే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. బీజేపీ ఫార్ములా ప్రకారం చూస్తే ఈ పునర్ విభజన ఇబ్బంది అని భావిస్తున్నాయి. దీని మీద లోతైన చర్చ జరగాలని అందరికీ ఆమోదయోగ్యమైన విధానం ఉండాలని కాంగ్రెస్ సహా ఆ పార్టీ మిత్రులు కోరుకుంటున్నారు. మరో వైపు యాభై శాతం మేర లోక్ సభ సీట్ల పెరుగుదల మీద బీజేపీ సీరియస్ గా ఆలోచిస్తోంది. ఈ విధంగానే డీలిమిటేషన్ బిల్లు ఉండబోతోంది అని అంటున్నారు. అయితే దాని వల్ల కూడా సౌత్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుందని డీఎంకే టీవీకే లాంటి పార్టీలు వాదిస్తున్నాయి. డీఎంకే ఈ విషయంలో కేంద్రానికి మద్దతుగా ఉంటుందని ఇప్పటిదాకా ప్రచారం జరిగినా ఇపుడు చూస్తూంటే ఇండియా కూటమి వాదననే ఆ పార్టీ కూడా అందిపుచ్చుకున్నట్లుగా కనిపిస్తోంది.
నీట్ లీకేజ్ సహా :
ఇక వర్షాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతాయనడానికి అనేక అంశాలు ఉండబోతున్నాయి. నీట్ పరీక్షా పేపర్ల లీకేజ్ మీద విపక్షాలు ఎన్డీయే మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామాను ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ ఏలుబడిలో వైఫల్యాలను మొత్తం ఫోకస్ చేసి మరీ ఈ పార్లమెంట్ సెషన్ లో గట్టిగానే నిలదీయాలని విపక్షం అంతా సిద్ధం అయింది. ఇక జూలై 20 నుంచి వర్షాకాల సమావేశాలు మొదలై ఆగస్టు 13 దాకా సాగుతాయి. మరి ఈ సమావేశాలలో అందరి దృష్టి డీలిమిటేషన్ బిల్లు మీదనే ఉంది. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.
