Begin typing your search above and press return to search.

మహిళా రిజర్వేషన్ బిల్లు : లోక్‌సభలో హైడ్రామా!

దేశం మొత్తం ఎదురుచూస్తున్న వేళ పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

By:  Tupaki Political Desk   |   16 April 2026 3:56 PM IST
మహిళా రిజర్వేషన్ బిల్లు : లోక్‌సభలో హైడ్రామా!
X

దేశం మొత్తం ఎదురుచూస్తున్న వేళ పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విపక్ష ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ బిల్లులపై లోక్ సభలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ మొదలైన ఈ సమయంలో కేంద్రం ఆకస్మాత్తుగా పాత లెక్కలతో విభజన చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాకుండా మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు సబ్ కోటా కల్పించినట్లు ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లను ప్రకటించకపోవడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

131వ రాజ్యాంగ సవరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. తొలి రోజు లోక్ సభలో సభ్యుల ఆమోదంతో బిల్లుపై చర్చ మొదలవగా, రాజ్యసభ రేపటికి వాయిదా వేశారు. లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ అందరికీ సమన్యాయం కోసం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సివుందని చెప్పారు. ఈ రోజు పార్లమెంటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా అభివర్ణించారు. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. తాజాగా ప్రవేశపెడుతున్న బిల్లు ద్వారా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని వ్యాఖ్యానించారు.

కాగా, బిల్లుపై చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గౌరవ్ గొగొయ్ మాట్లాడుతూ, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు లింక్ పెట్టొద్దని డిమాండ్ చేశారు. ప్రస్తుతం లోక్ సభలో ఉన్న 543 స్థానాలలోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ కు తమ పార్టీ తొలి నుంచి అనుకూలంగా ఉందని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో డీలిమిటేషన్ చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. 815 స్థానాలు వస్తాయని కేంద్రం ముందుగా ఎలా చెబుతుందని గౌవర్ గొగొయ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కులగణన, జనగణనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

ఇక సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సైతం బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఎప్పుడూ మహిళలంటే గౌరవం లేదని ఆరోపించారు. దేశంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి కేవలం ఢిల్లీలో మాత్రమే మహిళా సీఎం ఉన్నారని ఎత్తిచూపారు. అయితే ఆమెకు అధికారం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ కోసం కేంద్రం ఎందుకు తొందర పడుతోందని ప్రశ్నించిన అఖిలేష్ యాదవ్ ముందుగా జనగణన పూర్తి చేయాలని సూచించారు.

ఈ సమయంలో కల్పించుకున్న హోంమంత్రి అమిత్ షా సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. జనగణన ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ప్రస్తుతం గృహ గణన చేపడతున్నామని హోంమంత్రి తెలిపారు. 2027లో జనగణన ద్వారా కులాల సమాచారం సేకరిస్తామని వెల్లడించారు. సమాజ్ వాదీ పార్టీకి అవకాశం ఇస్తే గృహాలకు కూడా కులాన్ని కేటాయిస్తారంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. మరోవైపు ఇదే సమయంలో ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా స్పష్టం చేశారు. మొత్తానికి సభలో రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చ ఇతర అంశాలపై ఎక్కువగా మల్లుతోంది. రాజకీయంగా వాద ప్రతివాదనలతో లోక్ సభ సమావేశం వాడివేడిగా సాగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.