Begin typing your search above and press return to search.

లోక్ సభలో వాయిదాల పర్వం... ఇది కొత్త రికార్డు

ఈ క్రమంలో సభ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. కొన్ని కీలక అంశాల మీద విపక్షం పట్టుబడుతోంది. అదే సమయంలో అధికార పక్షం నుంచి అజెండా మీదనే వెళ్లాలని ఆలోచన ఉంది. ఈ క్రమంలో ప్రతిష్టంబన ఎదురవుతోంది.

By:  Satya P   |   6 Feb 2026 8:00 PM IST
లోక్ సభలో వాయిదాల పర్వం... ఇది కొత్త రికార్డు
X

పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్ సభలో అయితే చర్చలు సాగడం లేదు, అనేక అంశాల మీద అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విపక్షాలు సభలో ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో సభ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. కొన్ని కీలక అంశాల మీద విపక్షం పట్టుబడుతోంది. అదే సమయంలో అధికార పక్షం నుంచి అజెండా మీదనే వెళ్లాలని ఆలోచన ఉంది. ఈ క్రమంలో ప్రతిష్టంబన ఎదురవుతోంది.

చరిత్రలో తొలిసారి :

ఆఖరుకు చూస్తే కనుక పార్లమెంట్ చరిత్రలో తొలిసారి లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశం మీద ప్రధాని ముగింపు ప్రసంగం చేయలేకపోయారు. ఆయన మీద ఏకంగా నిండు పార్లమెంట్ లోనే దాడి జరుగుతుంది అన్న అనుమానాలు ఉన్నయాని లోక్ సభ వర్గాలు చెప్పాయి. దాంతో తానే ప్రధానిని సభకు రావద్దు అని సూచనలు ఇచ్చాను అని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అలా లోక్ సభలో ప్రధాని ప్రసంగం లేకుండా పోయింది. ఇది కొత్త రికార్డుగా నమోదు అయింది. దానికి బదులుగా రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ప్రతిపక్షాల పట్టు :

ఇంకో వైపు చూస్తే వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో లోక్‌సభ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది ఇక శుక్రవారం చూస్తే సభలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే సభ్యులతో సహా ప్రతిపక్ష సభ్యులు మరోసారి సభ మధ్యలోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ సభ్యులను సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించవద్దని కోరడం జరిగింది. తమ తమ స్థానాలకు తిరిగి వెళ్లి సభ సజావుగా పనిచేయడానికి సహకరించాలని కోరారు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య సంబంధిత మంత్రులు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలను సభలో ప్రవేశపెట్టారు. అధ్యక్ష స్థానం నుండి పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ, ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగించారు దీంతో సభను తిరిగి సోమవారానికి వాయిదా వేశారు.

బడ్జెట్ మీద చర్చ ఉన్నా :

ఇక కేంద్ర బడ్జెట్ ని ఈ నెల 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర బడ్జెట్ 2026-27 పై చర్చ సభా కార్యకలాపాల జాబితాలో ఉన్నప్పటికీ దానిని చేపట్టలేకపోయారు. సభ ఇక సోమవారం ఉదయం 11:00 గంటలకు సమావేశమవుతుందని లోక్ సభ అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు చూస్తే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టడానికి ప్రయత్నించినా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో ది కూడా కుదరలేదు. ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన పై స్పీకర్ ఆందోళన వ్యక్తం చేస్తూ సభ సజావుగా పనిచేయడానికి సహకరించాలని కోరారు.

విలువైన సమయం వృధా :

ఇక ఈ వారంలో లోక్ సభలో విలువైన సమయం అంతా వృధా అయింది అని లోక్ సభ స్పీకర్ వెల్లడించారు. వరసబెట్టి సభా కార్యకలాపాలకు అంతరాయం కలగడం వల్ల ఇప్పటి వరకూ లోక్ సభలో 19 గంటలకు పైగా సమయం వృధా అయిందని ఓం బిర్లా చెప్పడం విశేషం. సభలో ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా అంతరాయాలు సృష్టిస్తున్నాయని లోక్‌సభ స్పీకర్ ఆరోపించారు. సభ్యులు సభ గౌరవాన్ని మర్యాదను కాపాడాలని ప్రశ్నోత్తరాల సమయంలో ఇతర సభ్యులను మాట్లాడటానికి అనుమతించాలని ఆయన పదే పదే కోరినా ఫలితం లేకపోయింది.

అర్థవంతమైన చర్చల కోసం :

భారత్ అమెరికాల మధ్య కుదిరిన తాజా ఒప్పందం మీద చర్చ జరగాలని విపక్షం పట్టుబడుతోంది. దాని వెనక ఏమి జరిగింది అన్నది దేశానికి తెలియాలని అంటోంది. అయితే అధికార పక్షం మాత్రం అజెండా ప్రకారం సభ సాగాలని అంటోంది. దీంతో సభా కార్యక్రమాలు నిరంతరంగా వాయిదా పడుతున్నాయి. అయితే సభలో అర్థవంతమైన చర్చల కోసం దేశ ప్రజలు సభ్యులను ఎన్నుకున్నారని లోక్ సభ స్పీకర్ చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభకు అంతరాయం కలిగిస్తున్నారని ఇది మంచిది కాదని ఆయన అంటున్నారు. మొత్తానికి కారణాలు ఏమైతేనేమి లోక్ సభలో మాత్రం చర్చలు లేకుండానే వాయిదాల పర్వం సాగుతోంది. సోమవారం నుంచి అయినా సభ సజావుగా సాగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.