Begin typing your search above and press return to search.

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం.. ఒక గొప్ప మార్పునకు శ్రీకారం..

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు.. ప్రశ్నాపత్రాల లీకేజీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు వేసింది.

By:  A.N.Kumar   |   30 July 2026 11:39 PM IST
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం.. ఒక గొప్ప మార్పునకు శ్రీకారం..
X

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు.. ప్రశ్నాపత్రాల లీకేజీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు వేసింది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన 'యాంటీ పేపర్ లీక్ బిల్లు' (పబ్లిక్ ఎగ్జామినేషన్స్ - ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్ సవరణ బిల్లు) కు తాజాగా పార్లమెంట్ రాజ్యసభ కూడా తన ఆమోద ముద్ర వేసింది.

పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం.. రాష్ట్రపతి సంతకమే తరువాయి

రాజ్యసభలో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా దీనిపై దాదాపు 10 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చ అనంతరం ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేయగా ఆ తర్వాత సభ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉభయ సభల ఆమోదం పూర్తి కావడంతో ఈ బిల్లును త్వరలోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కు ఆమోదానికి పంపనున్నారు. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే ఇది అధికారికంగా చట్టంగా అమల్లోకి రానుంది.

కఠినమైన శిక్షలు.. భారీ జరిమానాలు

పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం కింద నిందితులకు అత్యంత కఠినమైన శిక్షలు విధించేలా నిబంధనలు చేర్చారు. పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన ముఠాలు, వ్యక్తులకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనున్నారు. నేరం రుజువైతే రూ. 50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పరీక్షలను పక్కదారి పట్టించే సంస్థలు లేదా ఏజెన్సీలను శాశ్వతంగా బ్లాక్ లిస్ట్ లో చేయనున్నారు.

నీట్ వివాదం.. బిల్లు నేపథ్యం

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ , ఇతర జాతీయ స్థాయి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్ ఘటనలు కోట్లాది మంది అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి ప్రతిపక్షాలు ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. పరీక్షల నిర్వహణ వ్యవస్థపై దెబ్బతిన్న విశ్వసనీయతను పునరుద్ధరించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ అత్యవసర సవరణ బిల్లును ముందుకు తెచ్చింది. "దేశంలోని యువత, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడంలో ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో ఉంది. ఈ నూతన చట్టం పరీక్షల వ్యవస్థలో మోసాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలుస్తుంది." అని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

పరీక్షా వ్యవస్థలో నూతన అధ్యాయం

రాష్ట్రపతి ఆమోదం లభించిన మరుక్షణమే ఈ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఇది అమల్లోకి వస్తే, నేరస్థులతో పాటు లీకేజీలకు సహకరించే సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకునే పూర్తి అధికారం నిఘా వర్గాలకు అందుతుంది. సుదీర్ఘ కాలంగా కష్టపడి చదువుకునే నిరుద్యోగ యువతకు మరియు విద్యార్థులకు ఈ చట్టం ఎంతో ఊరటను ఇస్తుందని భావిస్తున్నారు.