ఒక్క ఛాన్స్ కోసం వేయి చూపులు.. 'పరిటాల శ్రీరాం' మారాలి.. !
గత రెండు ఎన్నికలుగా అంటే.. సుమారు పదేళ్లుగా ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయాసపడుతున్నారు.
By: Garuda Media | 6 March 2026 10:00 PM ISTఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. ఇదీ పలువురు నాయకులు పెట్టుకున్న టార్గెట్. రాజకీయాలైనా.. వ్యక్తిగత మైనా.. నాయకులకు ఛాన్స్ అవసరం. కొందరు పదవుల కోసం.. ఒక్క ఛాన్స్ అంటుంటే.. యువ నాయకులు ఎమ్మెల్యే టికెట్ కోసం ఒక్క ఛాన్స్ అంటున్నారు. ఇలాంటి వారిలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన.. పరిటాల రవి కుమార్ వారసుడు పరిటాల శ్రీరాం ముందు వరుసలో ఉన్నారు. గత రెండు ఎన్నికలుగా అంటే.. సుమారు పదేళ్లుగా ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయాసపడుతున్నారు.
ఒక్క ఛాన్స్ ప్లీజ్.. అంటూ.. సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్‌లను ఆయన కోరుతున్నారు. అయితే.. గత రెండు ఎన్నికలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగడం.. నువ్వా-నేనా అన్నట్టుగా రాజకీయాలు మారిపోయిన దరిమిలా.. శ్రీరాంకు అవకాశం చిక్కలేదు. 2019లోనే ఆయన రాప్తాడు నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ, అప్పటి పోటీ నేపథ్యంలో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత.. ధర్మవరంపై పట్టు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే 2024లో ఇక్కడ నుంచి పోటీకి రెడీ అయ్యారు.
కానీ, పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీ దక్కించుకుంది. దీనికితోడు రాప్తాడులో అయినా.. శ్రీరాంకు అవకాశం చిక్కుతుందని అనుకున్నా.. అది కూడా సాధ్యం కాలేదు. వెరసి.. మరోసారి ఒక్క ఛాన్స్ అలానే ఆగిపోయింది. వచ్చే ఎన్నికల సంగతేంటి? అనేది ఇప్పుడు చర్చకు వస్తోంది. ప్రస్తుతం ప్రజలను కలుస్తు న్నారు. సమస్యలపై స్పందిస్తున్నారు. ఈ విషయంలో తేడా లేదు. అయితే.. ఈ ఒక్కటే పనిచేస్తుందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ఎమ్మెల్యే టికెట్ దక్కాలంటే.. కేవలం కొన్ని మాత్రమే కాదు.. ఎన్నో పరిగణన లోకి వస్తాయి.
ఇలాంటి వాటిలో.. సీనియర్లను మచ్చిక చేసుకునే విషయంలో శ్రీరాం వెనుకబడ్డారన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. వారసత్వ రాజకీయాలు మంచిదే అయినా.. అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం యువ నాయకుడిగా శ్రీరాంపై ఉంది. అంతేకాదు.. మాట తీరును కూడా ఆయన మార్చుకోవాలి. మంచి తనం.. విధేయతను రంగరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనసులో ఎంత కసి ఉన్నా.. పైకి మంచితనంగా మాట్లాడడం.. అందరినీ కలుపుకొని పోవడం.. నేనున్నాననే భరోసాను కేవలం ప్రజలకే కాదు.. సీనియర్ నాయకులకు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. సో.. ఈ చిన్నపాటి సమస్యలను అధిగమిస్తే.. శ్రీరాంకు ఒక్క ఛాన్స్ ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.
