మరో మ్యూజియంలో దోపిడీ... వేల బంగారు నాణేలు మాయం!
అక్టోబరు 19న పారిస్ లోని ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 24 Oct 2025 4:00 PM ISTఅక్టోబరు 19న పారిస్ లోని ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో.. రోజూ వేల మంది సందర్శకులతో కిటకిటలాడే పారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియం ఆ రోజు మూసివేయబడింది. ఈ ఘటనలో దొంగిలించబడిన ఆభరణాల విలువ భారత కరెన్సీలో సుమారు రూ.895 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఫ్రాన్స్ అత్యంత భద్రత కలిగిన లౌవ్రే మ్యూజియంలోకి చొరబడిన దుండగులు కేవలం నిమిషాల వ్యవధిలో విలువైన ఆభరణాలు దొంగలించి పరారవ్వగా... ఈ దోపిడీ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అయితే.. ఇది కరుడు గట్టిన దొంగల ముఠా పింక్ పాంథర్స్ పని అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో మ్యూజియంలో దొంగలుపడ్డారు.
అవును... లావ్రే మ్యూజియంలో చోరీ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసిన ఘటన మరువక ముందే ఫ్రాన్స్ లో మరో మ్యూజియంలో దోపిడీ జరిగింది. ఈ ఘటనలో 2వేల బంగారు, వెండి నాణేలు అపహరణకు గురయ్యాయి. పారిస్ లోని లావ్రే మ్యూజియంలో చోరీ జరిగిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాళ్లోకి వెళ్తే... ఫ్రాన్స్ లోని మరో మ్యూజియం 'ది మైసన్ డెస్ లు మైరేస్' లో దోపిడీ జరిగింది. మంగళవారం ఉదయం మ్యూజియం సిబ్బంది తలుపులు తెరిచేసరికి.. అక్కడ ప్రదర్శన అద్దాలు పగిలి ఉండటాన్ని గుర్తించారు. దీంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనలో 2వేల బంగారు, వెండి నాణేలు అపహరణకు గురయ్యాయని చెబుతున్నారు.
అపహరణకు గురైన ఈ 2,000 బంగారు, వెండి నాణేలను 2011లో ప్రస్తుత మ్యూజియం ఉన్న భవనం పునరుద్ధరణ సమయంలో కనుగొన్నారని.. అవి 1790, 1840 మధ్య నాటివని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
లావ్రేలో నెపోలియన్ కాలం నాటి ఆభరణాలు!:
అంతకంటే ముందు ఆదివారం లావ్రే మ్యూజియంలో ఓ వైపు నిర్మాణం జరుగుతుండగా.. అక్కడి నుంచి దుండగులు లోపలికి చొరబడి.. మ్యూజియం లోని నెపోలియన్ కాలంనాటి వస్తువులు, ఆభరణాలు ఉన్న గ్యాలరీ అద్దాలను పగలగొట్టి అందులోని తొమ్మిది వస్తువులను దొంగలించిన సంగతి తెలిసిందే. వీరు వాటిని తీసుకుని వెళ్తుండగా.. అందులోని ఓ ఆభరణం మ్యూజియం బయట పడిపోయిందని అధికారులు తెలిపారు.
మిగిలిన ఆభరణాల విలువ భారత కరెన్సీలో సుమారు రూ.895 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆ సమయంలో మ్యూజియంలో నిఘా కెమెరా పనితీరు సరిగ్గా లేదని డైరెక్టర్ లారెన్స్ డెస్ కార్స్ అంగీకరించారు. ఇది కరుడు గట్టిన దొంగల ముఠా పింక్ పాంథర్స్ పని అయి ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు.
