Begin typing your search above and press return to search.

ఆస్తి హక్కుల వాస్తవాలు : పిత్రార్జితం vs స్వార్జిత ఆస్తులపై చట్టం ఏం చెబుతోంది?

తల్లిదండ్రుల ఆస్తులపై పిల్లలకు ఉండే హక్కులపై చాలామందికి అపోహలు ఉంటాయి. "తల్లిదండ్రుల ఆస్తి ఏదైనా సరే.. పుట్టుకతో తమకు సమాన వాటా వస్తుంది" అని చాలామంది నమ్ముతుంటారు.

By:  Tupaki Political Desk   |   11 Sept 2026 7:00 PM IST
ఆస్తి హక్కుల వాస్తవాలు : పిత్రార్జితం vs స్వార్జిత ఆస్తులపై చట్టం ఏం చెబుతోంది?
X

తల్లిదండ్రుల ఆస్తులపై పిల్లలకు ఉండే హక్కులపై చాలామందికి అపోహలు ఉంటాయి. "తల్లిదండ్రుల ఆస్తి ఏదైనా సరే.. పుట్టుకతో తమకు సమాన వాటా వస్తుంది" అని చాలామంది నమ్ముతుంటారు. అయితే, మన దేశ చట్టాల ప్రకారం ప్రతి ఆస్తికి ఒక స్పష్టమైన స్వభావం ఉంటుంది. ఆస్తి పిత్రార్జితమా (పూర్వీకులదా) లేక స్వార్జితమా (సొంత కష్టార్జితమా) అనే దానిపైనే పిల్లల హక్కులు ఆధారపడి ఉంటాయని పరిశీలకులు చెబుతుననారు.

స్వార్జిత ఆస్తులు అంటే ఒక వ్యక్తి తన స్వంత ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత సంపాదనతో కొనుగోలు చేసిన ఇల్లు, స్థలాలు లేదా ఇతర ఆస్తులు. తండ్రి లేదా తల్లి బతికుండగా వారి స్వార్జిత ఆస్తిలో కొడుకు, కూతురు ఎలాంటి వాటాను చట్టబద్ధంగా డిమాండ్ చేయలేరని చెబుతున్నారు. స్వార్జిత ఆస్తిని ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, అమ్మేయాలన్నా, లేదా ఇతరులకు వీలునామా రాసివ్వాలన్నా యజమానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని మన చట్టాలు చెబుతున్నాయి. దీనికి పిల్లల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, ఒకవేళ యజమాని ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే మాత్రం, హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆ స్వార్జిత ఆస్తిలో భార్య, పిల్లలు, తల్లి అందరూ సమాన వాటాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు, పిత్రార్జితం లేదా పూర్వీకుల ఆస్తులు అంటే తండ్రి, తాత, ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి. ఈ ఆస్తి ఎక్కడా నాలుగు తరాల మధ్య విభజన జరిగి ఉండకూడదని, హిందూ అవిభాజ్య కుటుంబం కింద జన్మించే ప్రతి బిడ్డకు చట్ట సవరణ ప్రకారం కుమార్తెలకు కూడా సమానంగా ఈ ఆస్తిపై పుట్టుకతోనే హక్కు లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పిత్రార్జిత ఆస్తులను విక్రయించాలన్నా లేదా ఇతరులకు బదిలీ చేయాలన్నా కుటుంబంలోని సహ-వారసులందరి అనుమతి తప్పనిసరి అంటున్నారు. కేవలం తండ్రి ఇష్టానుసారం ఈ ఆస్తులను ఇతరులకు రాసివ్వడానికి కుదరదని స్పష్టం చేస్తున్నారు.

చట్టపరమైన ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే, ఒక వ్యక్తికి తన తండ్రి నుంచి ఆస్తి వచ్చినంత మాత్రాన అది వెంటనే అతని పిల్లలకు పిత్రార్జితం అయిపోదని కూడా చెబుతున్నారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం అది కొందరి విషయంలో స్వార్జిత ఆస్తిగా కూడా పరిగణించబడుతుందని అంటున్నారు. అలాగే కోడలికి నేరుగా అత్తమామల స్వార్జిత ఆస్తులపై ఎలాంటి హక్కు ఉండదని, ఆమె భర్త ద్వారా మాత్రమే ఆస్తిలో చట్టపరమైన ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అంతేతప్ప స్వయంగా కోడలు కోర్టులో వాటా అడగలేదని చెబుతున్నారు.

ఇక పిల్లలకు రాసిచ్చిన ఆస్తులను కూడా తల్లిదండ్రులు వెనక్కి తీసుకునే అవకాశం చట్టంలో ఉంది. తల్లిదండ్రుల బాగోగులు చూసుకోకుండా వేధించే సందర్భాల్లో 'సీనియర్ సిటిజన్స్ యాక్ట్' ప్రకారం గిఫ్ట్ డీడ్‌లను రద్దు చేసుకునే అధికారాన్ని చట్టం కల్పించింది. ఆస్తి వివాదాలు కేవలం భావోద్వేగాలతో పరిష్కారం కావు. ఆ ఆస్తి ఎవరి ద్వారా, ఎలా సంక్రమించింది, యజమాని వీలునామా రాశారా లేదా అనే అంశాలను బట్టే న్యాయస్థానాలు తీర్పులు ఇస్తాయని అంటున్నారు. ఈ చట్టపరమైన స్పష్టతను తెలుసుకోవడం ద్వారా అనవసరమైన కుటుంబ తగాదాలను నివారించవచ్చునని అంటున్నారు.