పరాశక్తి చిచ్చు: జాతీయ వేదికపై డీఎంకే పరువు తీసిన 'హిందీ' సెల్ఫ్ గోల్.. కాంగ్రెస్‌తో కటీఫ్ తప్పదా?
ఒకవైపు జాతీయ ఛానల్ చర్చలో డీఎంకే నేత అడ్డంగా బుక్కవ్వగా మరోవైపు కొత్తగా విడుదలైన 'పరాశక్తి' సినిమా ఇండియా కూటమిలో చిచ్చు రేపుతోంది.
By: A.N.Kumar | 2 Feb 2026 10:52 AM ISTతమిళనాడు రాజకీయాల్లో 'హిందీ వ్యతిరేకత' అనేది ఒక ప్రధాన అస్త్రం. దశాబ్దాలుగా దీనిని వాడుకుని అధికారంలోకి వస్తున్న డీఎంకే , ఇప్పుడు అదే అస్త్రంతో తన మిత్రపక్షం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టింది. ఒకవైపు జాతీయ ఛానల్ చర్చలో డీఎంకే నేత అడ్డంగా బుక్కవ్వగా మరోవైపు కొత్తగా విడుదలైన 'పరాశక్తి' సినిమా ఇండియా కూటమిలో చిచ్చు రేపుతోంది.
నేషనల్ టీవీలో గాలి తీసేసిన బీజేపీ అధికార ప్రతినిధి!
ఇటీవల బడ్జెట్‌పై జరిగిన ఒక జాతీయ ఛానల్ చర్చా వేదికలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బడ్జెట్ గురించి మాట్లాడుతూ డీఎంకే నాయకుడు ఒకరు హఠాత్తుగా హిందీ వ్యతిరేకతను తెరపైకి తెచ్చారు. 'పరాశక్తి' సినిమా ప్రస్తావన తెస్తూ కేంద్ర ప్రభుత్వం హిందీని ఎలా బలవంతంగా రుద్దిందో వివరించే ప్రయత్నం చేశారు.
అయితే ఆ చర్చలోనే పాల్గొన్న బీజేపీ అధికార ప్రతినిధి అడిగిన ఒక్క ప్రశ్నతో డీఎంకే నేత నోట మాట రాలేదు. "హిందీని బలవంతంగా రుద్దినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు?" అని అడగడంతో ఆయన మౌనమే సమాధానమైంది. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్నది నేటి డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీయే. దీంతో బీజేపీ ప్రతినిధులు పెద్దగా నవ్వుతూ డీఎంకే నేత పరువు తీశారు. ఏం చేయాలో పాలుపోక డీఎంకే నేత కూడా వెకిలి నవ్వులు నవ్వడంతో డిబేట్ లో పాల్గొన్నవారంతా పగలబడి నవ్వారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా బీజేపీ నేతలు దీన్ని ట్రోల్ చేస్తున్నారు.
'పరాశక్తి' సినిమా.. పాత గాయాల గుర్తు!
తమిళనాడులో ఇటీవల విడుదలైన 'పరాశక్తి' సినిమా అగ్నికి ఆజ్యం పోసింది. 1965లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం, దివంగత అన్నాదురై పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. 1965-66 సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో తమిళులపై హిందీని రుద్దారని, ఆ పోరాటంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో కాంగ్రెస్‌ను ముఖ్యంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని విలన్‌గా చిత్రీకరించడంపై తమిళనాడు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మిత్రపక్షంగా ఉంటూనే తమ పార్టీని అవమానిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
అధికార భాగస్వామ్యం.. విజయ్ ఎఫెక్ట్!
మరోవైపు నటుడు విజయ్ రాజకీయ ఎంట్రీ ఇచ్చి, తనతో కలిసి వచ్చే మిత్రపక్షాలకు 'అధికారంలో వాటా' ఇస్తామని ప్రకటించడం పెద్ద సంచలనమైంది.
దశాబ్దాలుగా డీఎంకేతో ఉన్నా కాంగ్రెస్‌కు మంత్రి పదవులు దక్కడం లేదు. విజయ్ ప్రకటనతో కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ వంటి వారు ఇప్పుడు డీఎంకేపై ఒత్తిడి పెంచుతున్నారు. "మా వల్ల గెలిచినప్పుడు మాకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వరు?" అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ఎన్నికల వేళ 'ఇండియా' కూటమికి తలనొప్పి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు డీఎంకే-కాంగ్రెస్ బంధాన్ని ప్రమాదంలో పడేశాయి. కాంగ్రెస్‌ను విలన్‌గా చూపించే డీఎంకే వైఖరి... మరోవైపు సీట్ల సర్దుబాటు.. అధికారంలో వాటా కోసం కాంగ్రెస్ డిమాండ్ డీఎంకేను ఇరుకున పెడుతున్నాయి.. హిందీ పేరుతో ఉత్తర భారత పార్టీగా కాంగ్రెస్‌ను దశాబ్దాల పాటు విమర్శించిన డీఎంకే, ఇప్పుడు అదే పార్టీతో కలిసి సాగడం క్లిష్టంగా మారింది. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి పొందే అధికారం, ఇప్పుడు వాస్తవాల ముందు తలవంచుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది.
ఓట్ల కోసం తీసిన సినిమా, గెలుపు కోసం చేసుకున్న పొత్తు మధ్య ఇప్పుడు తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ 'పరాశక్తి' వివాదం పొత్తుల విచ్ఛిన్నానికి దారితీస్తుందా లేదా అనేది చూడాలి.
