Begin typing your search above and press return to search.

ముంబయి వీధుల్లో రీల్ కాదు రియల్ బిచ్చగాడు!

కొన్ని రియల్ ఘటనలతోనే రీల్ కథలు ఉంటాయి. బిచ్చగాడు సినిమా గుర్తించి కదా? తల్లి ప్రాణం కోసం గురువు చెప్పినట్లుగా కొన్ని రోజుల పాటు తన సంపదను పక్కన పెట్టేసి బిచ్చగాడిగా వీధుల్లో తిరిగే స్టోరీ గుర్తుండే ఉంటుంది.

By:  Garuda Media   |   15 Sept 2026 12:59 PM IST
ముంబయి వీధుల్లో రీల్ కాదు రియల్ బిచ్చగాడు!
X

కొన్ని రియల్ ఘటనలతోనే రీల్ కథలు ఉంటాయి. బిచ్చగాడు సినిమా గుర్తించి కదా? తల్లి ప్రాణం కోసం గురువు చెప్పినట్లుగా కొన్ని రోజుల పాటు తన సంపదను పక్కన పెట్టేసి బిచ్చగాడిగా వీధుల్లో తిరిగే స్టోరీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు చెప్పేది రీల్ కాదు రియల్ స్టోరీ. ఆ మాటకు వస్తే దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా గుర్తింపు సొంతం చేసుకున్న వ్యాపారవేత్త కం రాజకీయ నాయకుడు పరాగ్ షా (బీజేపీ). అలాంటి ఆయన తన అథ్యాత్మిక గురువు సూచనతో ముంబయి వీధుల్లో ఒకరోజు బిచ్చగాడిగా తిరుగాడిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

మహారాష్ట్రలోని ఘట్కోపర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ముంబయిలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఒకరు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన, ఆయన భార్య ఆస్తుల విలువ రూ.3383 కోట్లుకు పైనే. 2019 నుంచి 2024 ఐదేళ్ల వ్యవధిలో ఆయన కంపెనీ షేర్ల విలువ భారీగా పెరగటంతో ఆయన ఆస్తులు 530 శాతం వృద్ధి చెందాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఆయన ఆస్తుల విలువ దగ్గర దగ్గర రూ.5వేల కోట్లకు పైమాటే అన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటాయి.

అలాంటి ఆయన తన అధ్యాత్మిక జైన గురువు నమ్రుముని మహారాజ్ సూచన మేరకు ఒక రోజంతా భిక్షాటన చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు తన గురువు పిలిచి.. తనకీ విచిత్ర సూచన చేశారని.. బయట ప్రజలు పడుతున్న కష్టాలు..యాతనల్ని అనుభవించాలని చెప్పటంతో.. తాను వేషం మార్చుకొని భిక్షగాడిగా ఒక రోజు అవతారం ఎత్తినట్లుగా పేర్కొన్నారు. తనకున్న సంపదను పక్కన పెట్టి.. భిక్షగాడిగా వేషం వేసుకున్న వేళ.. ఆయనకు పలు అనుభవాలు ఎదురైనట్లుగా చెప్పారు.

ఒక బిచ్చగాడి జీవితం ఎంత దారుణంగా ఉంటుందో తాను ప్రత్యక్ష అనుభవాన్ని పొందినట్లుగా పేర్కొంటూ.. తనను బిచ్చగాడి రూపంలో చూసి ఎంతోమంది చీదరించుకున్నారన్నారు. కొందరు తిడితే.. మరికొందరు జాలి చూపించారని తన అనుభవాల్ని వెల్లడించారు. ఒక్కరోజు బిచ్చగాడి అనుభవం తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చిందన్నారు. భిక్షాటన పూర్తైన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా తిరిగి అదే వీధుల్లోకి వెళ్లి.. అక్కడి ప్రజలతో తన అనుభవాలను పంచుకోవటం గమనార్హం.

తన గురువు ఆదేశంతోనే తాను ఇలా చేసినట్లుగా చెప్పి.. తన గురువు తనకేం చెప్పినా అదంతా తన మంచికోసమేనని చెప్పారు. తన గురువు చెప్పినట్లుగా తాను నడుచుకోవటం తన మనసుకు ఎంతో హాయిగా ఉందన్న ఆయన.. పేరు ప్రతిష్ఠలు.. డబ్బు.. అధికారాలు మనిషికి అహంకారాన్ని పెంచుతాయని..తానిప్పుడు ఆ అహాంకారాన్ని జయించినట్లుగా తెలిపారు. భిక్షాటన చేసే సమయంలో తనకు రెండు షాకింగ్ అనుభవాలు ఎదురైనట్లు చెప్పారు.

‘బిచ్చగాడిగా భిక్షాటన చేస్తూ మా ఇంటి సమీపంలోకి వెళితే.. మా వాచ్ మనే నన్ను తోసేశాడు. అలాగే అందరికీ సహాయం చేస్తున్నానని చెప్పుకునే నా స్నేహితుడు నన్ను బిచ్చగాడి గెటప్ లో చూడగానే తరిమేశాడు. ఈ ఉదంతాలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అయితే.. ముంబయిలో ఇంకా మంచితనం బతికే ఉంది. కొందరు యువకులు రూ.20 నోట్లను దానంగా ఇచ్చారు’ అంటూ తన అనుభవాల్ని ఏకరువు పెడుతున్నారు. ఆయన అనుభవం ఇప్పుడు మీడియాలోనూ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పరాగ్ షా రాజకీయ జీవితాన్ని చూస్తే.. 2017లో బీఎంసీ (బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికల్లో ఘట్కోపర్ ఈస్ట్ నుంచి బీజేపీ కార్పొరేటర్ గా విజయం సాధించిన తన పొలిటికల్ కెరీర్ షురూ చేశారు. 2019లో ఘట్కోపర్ ఈస్ట్ ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు. అప్పట్లో ఆయన ఆస్తుల విలువ రూ.500 కోట్లుగా నామినేషన్ సమయంలో పేర్కొన్నారు. 2024లో రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే.. ఈ ఎన్నికల సమయంలో ఆయన ఆస్తులు భారీగా పెరిగాయి. పుల్వామా దాడిలో అమరులైన సైనిక కుటుంబాల నిధి కోసం వ్యక్తిగతంగా రూ.40 లక్షలు.. ప్రజల నుంచి సేకరించిన నిధులతో కలిపి రూ.80 లక్షలు ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్ కు విరాళంగా ఇచ్చారు. మహారాష్ట్ర వరదల సమయంలో సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. కుటుంబ వ్యాపారమైన రియల్ ఎస్టేట్ లోకి 1991లో ఎంట్రీ ఇచ్చి మ్యాన్ ఇన్ ఫ్రా కన్ స్ట్రక్షన్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ స్థాపించి అనతి కాలంలో ఆర్థికంగా ఎదిగారు. తాజాగా బిచ్చగాడి ఎపిసోడ్ ఆయన్ను యావత్ దేశం సుపరిచితుడిగా మార్చేసింది.