హోం వర్క్ చేయలేదని తలకిందులుగా వేలాడదీసి..
శ్రీజన్ పబ్లిక్ స్కూల్ ఘటన బయటకు రావడంతో స్థానిక పోలీసులు పాఠశాల ప్రిన్సిపాల్, బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.
By: Tupaki Political Desk | 30 Sept 2025 4:49 PM ISTవిద్యా బుద్ధులు నేర్పే విద్యాలయాలు కర్కశంగా మారితే విద్యార్థుల కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి. పిల్లలు అన్న తర్వాత తప్పు చేస్తారు.. అది తప్పని చెప్పి వారిని సరైన దారిలో పెట్టే ఉపాధ్యాయులు దండించడం మొదలు పెడితే ఇక వారు ఏం చేయాలి.. హర్యానాలో ఒక పాఠశాల ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. హర్యానా-ఛండీగఢ్ ప్రాంతంలోని పానిపట్ పట్టణంలో జరిగిన ఘటన మానవత విలువలను నీరు గార్చేలా ఉన్నాయి. శ్రీజన్ పబ్లిక్ స్కూల్‌లో రెండో తరగతి విద్యార్థిని హోంవర్క్ చేయలేదని స్కూల్ ప్రిన్సిపాల్, బస్సు డ్రైవర్ సహాయంతో కిటికీకి తలకిందులుగా వేలాడదీసి దండించాడు. ఈ ఘటన కు సంబంధించి ఫొటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు మండిపడుతున్నారు.
కలవరపాటుకు గురైన తల్లిదండ్రులు..
తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతారని బడులకు పంపిస్తుంటే ఉపాధ్యాయులు కఠినంగా వ్యవహరించడం, పాఠశాలల్లో విద్యార్థులపై ఉపాధ్యాయుల పాశవిక చర్యపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విద్యార్థులు మానసిక భద్రతతో సురక్షిత వాతావరణంలో చదవే హక్కును ఉంటుంది. కానీ కొన్ని స్కూళ్లు ఈ హక్కును ఉల్లంఘించడం, క్రీడా/శారీరక దాడులకు పాల్పడడం మానవత్వానికి మాయని మచ్చగా మిగుల్చుతుంది.
పోలీసుల అదుపులో ప్రిన్సిపాల్, డ్రైవర్..
శ్రీజన్ పబ్లిక్ స్కూల్ ఘటన బయటకు రావడంతో స్థానిక పోలీసులు పాఠశాల ప్రిన్సిపాల్, బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసుల చేసిన దర్యాప్తులో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ‘నేను కేవలం మందలించమని ఆదేశించానని, కొట్టిన విషయం నాకు తెలియదని’ చెప్పారట. ఈ వివరణ, బాధ్యతను తప్పించుకునేందుకేనని భావించవచ్చు. అసలు శిక్ష విధానం ఇంత దారుణంగా ఉండడం, బాలల హక్కుల పరిరక్షణలో లోపాన్ని ఎత్తి చూపిస్తోంది.
విద్యార్థులపై యాజమాన్యం వ్యవహరించే తీరు..
ఈ ఘటన పాఠశాలల్లో విద్యార్థులపై యాజమాన్యం వ్యవహరించే తీరును కళ్లకు కట్టినట్లు చూపించిందని పలువురు మండిపడుతున్నారు. వాస్తవిక శిక్షా విధానాలపై మళ్లీ ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. విద్యా వ్యవస్థలో ఇలాంటి శిక్షలు విద్యార్థులకు హానికరంగా మారకుండా.. తగిన మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
హీటెక్కిన సోషల్ మీడియా..
సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఈ వీడియోతో పాఠశాలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండవచ్చని వారు భావిస్తున్నారు. శిక్ష అంటే విద్యార్థులను భయపెడుతూ, శారీరక వేధింపులకు గురిచేసేలా ఉండద్దు. దండం దశోపదేశం అని తెలిసిందే. అయితే, అది ఎంత వరకు ఉపయోగించవచ్చన్నది తెలిసి ఉండాలి. కరుడుకట్టిన నేరస్తులకు విధంచే శిక్షల్లాంటి తలకిందులుగా వేలాడదీసి కొట్టడం లాంటివి కాకూడదు. ఇలా చేస్తే విద్యార్థుల జీవితాలపై చెడు ప్రభావం పడుతుందని మానసిక శాస్త్రవేత్తలు చెప్తు్న్నారు.
