అక్రమ మైనింగ్ పై పవన్ ఉక్కు పాదం
పంచదార్ల పవిత్ర క్షేత్రం ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని కూడా పవన్ కళ్యాణ్ రెవిన్యూ మైనింగ్ శాఖలు సూచించడం విశేషం.
By: Satya P | 22 July 2026 10:46 PM ISTఉప ముఖ్యమంత్రి పర్యావరణ శాఖ మంత్రి కూడా అయిన పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లాలో సాగుతున్న అక్రమ మైనింగ్ మీద ఉక్కు పాదం మోపారు. అనకాపల్లి జిల్లాలో ఎలమంచిలి నియోజకవర్గంలో పంచదార్ల ఆధ్యాత్మిక క్షేత్రంలో అక్రమ మైనింగ్ సాగుతోంది అని గత కొంతకాలంగా స్థానిక ప్రజలు ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. వైసీపీ కూడా చలో పంచదార్ల పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్రమం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మొత్తం పంచదార్ల ప్రాంతంలో మైనింగ్ కోసం ఇచ్చిన అనుమతులు అన్నీ రద్దు చేయాలని సంబంధిత శాఖ అధికారులను పవన్ ఆదేశించడం విశేషం.
నో మైనింగ్ జోన్ గా పంచదార్ల :
పంచదార్ల పవిత్ర క్షేత్రం ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని కూడా పవన్ కళ్యాణ్ రెవిన్యూ మైనింగ్ శాఖలు సూచించడం విశేషం. మరో వైపు చూస్తే జాతీయ జల విజ్ఞాన సంస్థ సైంటిస్టుల చేత పంచదార్ల ప్రాంతాన్ని పరిశీలన చేయించడం జరుగుతుందని పవన్ పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. పంచదార్ల నుంచి వచ్చే సహజధార్ల సంరక్షణకు చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పురాతన ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత అని పవన్ చెప్పారు. పంచదార్లలోని శ్రీ ఉమా ధర్మ లింగేశ్వర ఆలయ సమ్రక్షణకు పురావస్తు శాఖ అలాగే దేవాలయ శాఖ చర్యలు తీసుకోవాలని కూడా పవన్ ఆదేశించారు.
అక్రమ మైనింగ్ తో ఆందోళన :
పంచదార్ల కొండలను అక్రమంగా మైనింగ్ చేస్తూ పెద్ద ఎత్తున గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు అని స్థానికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో సహజ సిద్ధంగా స్వామి వారి ఆలయం నుంచి వస్తున్న పంచ ధారల నుంచి బురద నీరు వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేసారు. స్వామి వారి పవిత్రత దెబ్బ తింటోందని అంటూ ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఈ విషయం మీద కూటమి ప్రభుత్వం సీరియస్ గానే స్పందించింది అని అంటున్నారు. పర్యావరణ నిబంధనలు అన్నీ తోసిరాజని సాగితున్న అక్రమ మైనింగ్ వల్లనే ఇదంతా సాగుతోంది అని వస్తున్న ఆరోపణల మీద పవన్ కళ్యాణ్ నేరుగా ఫోకస్ పెట్టారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ అలాగే కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కూడా మాట్లాడారని చెబుతున్నారు. కలెక్టర్ ఇచ్చిన ప్రాధమిక నివేదికలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మైనింగ్ ఉల్లంఘనల మీదనే :
ఇదిలా ఉంటే ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు మైనింగ్ అనుమతులు పొందిన సంస్థ నిబంధనలను ఉల్లంఘించిన విషయం ప్రాథమిక నివేదికలో బయటపడింది అని చెబుతున్నారు. అంతే కాదు పర్యావరణ నిబంధలకు వ్యతిరేకంగా గ్రావెల్ మట్టి తవ్వకాలకు పాల్పడ్డారు అని కూడా పేర్కొన్నారు. దీంతో అలాంటి సంస్థ మీద జరీమానా విధించి కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. ఇక పంచకార్ల జలధారల రంగులు మారడం మీద జాతీయ జల విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలతో దర్యాప్తు జరిపించేందుకు పవన్ సిద్ధపడుతున్నారు. మొత్తం మీద పవన్ సీరియస్ గా ఫోకస్ పెట్టి పంచదార్లలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద యాక్షన్ తీసుకోవడం నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని ఆదేశించడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తం అవుతోంది.
