Begin typing your search above and press return to search.

మహిళ కడుపులో 14 పెన్నులు, 5 స్పూన్స్‌

పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో నరసరావుపేట మండలం పెట్లూరి వారి పాలెంకి చెందిన మహిళ తీవ్రమైన కడుపు నొప్పి, ఛాతీ నొప్పి అంటూ ఆసుపత్రిలో జాయిన్‌ అయింది.

By:  Ramesh Palla   |   7 Sept 2026 1:15 PM IST
మహిళ కడుపులో 14 పెన్నులు, 5 స్పూన్స్‌
X

సాధారణంగా మనిషి కడుపులో ఏదైనా చిన్న వస్తువు ఉంటే దాని వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. చిన్న పిల్లలు ప్లాస్టిక్ వస్తువులు లేదా ఐరన్‌ వస్తువులు ఏమైనా నోట్లో పెట్టుకుని మింగితే తీవ్రమైన నొప్పి రావడం మనం చూస్తూ ఉంటాం. ఆ వస్తువు పరిమాణంను బట్టి మల ద్వారం నుంచి రావడం లేదంటే ఆపరేషన్ చేసి తొలగించడం చేస్తూ ఉంటారు. గతంలో ఒక బాలుడు పెన్ను క్యాప్‌ను మింగడం వల్ల కడుపు నొప్పి రావడంతో ఆపరేషన్‌ చేసి వైద్యులు ఆ క్యాప్‌ను తొలగించడం జరిగింది. అయితే పల్నాడు జిల్లాలో ఒక మహిళ కడుపులో ఏకంగా దాదాపు ఇరవై వస్తువులు ఉన్నాయి. అవి కూడా చిన్నా చితక వస్తువులు కాదు. నాలుగు ఐదు ఇంచుల పొడవు ఉన్న వస్తువులు కావడం విశేషం. ఇన్ని వస్తువులు కడుపులో ఉంచుకుని ఈ మహిళ ఇన్నాళ్లు ఎలా తట్టుకుందని వైద్యులు సైతం అవాక్కయ్యారట.

మహిళకు తీవ్రమైన కడుపు నొప్పి...

పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో నరసరావుపేట మండలం పెట్లూరి వారి పాలెంకి చెందిన మహిళ తీవ్రమైన కడుపు నొప్పి, ఛాతీ నొప్పి అంటూ ఆసుపత్రిలో జాయిన్‌ అయింది. ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆమెను జాయిన్‌ చేసిన తర్వాత వైద్యులు స్కానింగ్‌ చేయడం జరిగిందట. స్కానింగ్‌లో ఆమె కడుపులో ఏవో వస్తువులు చాలా ఉన్నట్లుగా గుర్తించారు. అవన్నీ కూడా అరగనివి, అలాగే మల ద్వారం నుంచి బయటకు రాలేకుండా ఉన్నాయని వైద్యులు గుర్తించి లాప్రోస్కోపిక్‌ ఆపరేషన్‌కి సిద్ధం అయ్యారు. ఆమె కుటుంబ సభ్యుల అనుమతితో లాప్రోస్కోపిక్‌ విధానంలో ఆపరేషన్‌ నిర్వహించి వస్తువులు తీశారు. ఆ వస్తువులు చూసి వైద్యులు షాక్‌ అయ్యారట.

14 పెన్నులు, చెక్క స్పూన్‌లు...

ఆమె కడుపులో నుంచి వివిధ రకాల పెన్నులు 14, చెక్కతో తయారు చేసిన చిన్న స్పూన్‌లు, ఒక క్యాండిల్‌ అలాగే ఒక పొడవైన పెన్సిల్‌ను సైతం తీసినట్లు వైద్యులు పేర్కొన్నారు. సాధారణంగా ఏ మనిషి ఇన్ని వస్తువులు కడుపులో ఉంచుకుని ప్రశాంతంగా ఉండలేరు. కానీ ఆమె ఎలా ఇన్ని వస్తువులతో నార్మల్‌గా ఇన్ని రోజులు ఉందనే విషయమై వైద్యులు సైతం షాక్‌ అయ్యారని తెలుస్తోంది. ఈ పెన్నులన్నీ ఒకేసారి మింగి ఉండక పోవచ్చు అని వైద్యులు భావిస్తున్నారు. పెన్నులన్నింటికి మూత పెట్టి ఉంది. ఒక్క పెన్నుకు మాత్రం క్యాప్‌ లేకుండా ఉంది. ఆ పెన్‌ కు సంబంధించిన లిడ్‌ అనేది ఆమెకు కుచ్చుకుంటూ ఉండటం వల్ల కడుపు నొప్పి వచ్చి ఉంటుందని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మానసిక పరిస్థితి బాగాలేని కారణంగా...

ఆ మహిళ అన్ని పెన్నులు, స్పూన్‌లు మింగడానికి కారణం ఆమె మానసిక పరిస్థితి బాగా లేక పోవడం అని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకొచ్చారు. గత కొంత కాలంగా ఆమె మానసిక సమస్యలతో బాధ పడుతుందని, అందుకే కొన్నాళ్ల క్రితం ఆమె భర్త విడాకులు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. మానసికంగా సరిగా లేని ఆమె ఇలా ఏది పడితే అది నోట్లో పెట్టుకోవడం, తినడం, మింగడం చేస్తుందని పేర్కొన్నారు. అయితే ఇన్ని పెన్నులు ఆమె మింగిందని తాము గుర్తించలేదని, ఇటీవల కడుపు నొప్పి అంటూ ఏడుస్తుంటే ఆసుపత్రికి తీసుకు వచ్చి స్కానింగ్‌ చేయించినట్లుగా ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.