ఎంటెక్ ఎమ్మెల్యే: పొలిటికల్ పాట్లు.. !
"నేను ఎంటెక్ చదివాను.. అధక్ష్యా!'' అంటూ.. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో చెప్పుకొచ్చిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డికి స్థానికంగా ఇబ్బందులు తప్పడం లేదనే టాక్ వినిపిస్తోంది.
By: Garuda Media | 26 Aug 2026 6:00 AM IST"నేను ఎంటెక్ చదివాను.. అధక్ష్యా!'' అంటూ.. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో చెప్పుకొచ్చిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డికి స్థానికంగా ఇబ్బందులు తప్పడం లేదనే టాక్ వినిపిస్తోంది. పార్టీ పరంగా ఇప్పటికీ ఆమెను కొన్నికొన్ని మండలాల్లో ప్రజలు గుర్తించడం లేదు. ఇటీవల సమస్యలు తెలుసుకునేందుకు సిందూర రెడ్డి మామగారు, మాజీ మంత్రి రఘునాథ రెడ్డి బయటకు వచ్చారు. నిజానికి ఆయన ఎమ్మెల్యే కాదు. కానీ, అన్నీ ఆయనే చక్కబెడుతున్నారు. దీంతో ప్రజలు ఆయనే ఎమ్మెల్యే అంటూ హారతులు ఇచ్చారు.
ఇక, సమస్యలు చెప్పుకొనేందుకు.. వచ్చేవారు కూడా రఘునాథ రెడ్డి కోసం ఆరా తీస్తున్నారు. కేవలం అధి కారులు, పోలీసులు మాత్రమే ఎమ్మెల్యేను గుర్తిస్తున్నారట. ఇది అతిశయోక్తి, విమర్శకాదు. పక్కా నిజమని టీడీపీ నాయకులే చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు కూడా ఎన్నికైన వారు ప్రజల మధ్య ఉండండి అని సూచించడం వెనుక ఇలాంటి ఇబ్బందులను గుర్తించేనని అంటున్నారు. గత ఎన్నికల్లో తాను తప్పు కొన్న రఘునాథరెడ్డి.. తన కోడలు సిందూర రెడ్డికి అవకాశం ఇచ్చారు.
అప్పట్లోనూ నియోజకవర్గం మొత్తం ఆమె పర్యటించలేక పోయారు. సమయం తక్కువగా ఉండడంతో ఆమె కొన్ని ప్రాంతాలు , రఘునాథరెడ్డి మరిన్ని ప్రాంతాలు పంచుకున్నారు. ఇక, టీడీపీ ఎన్నికల గుర్తు ప్రభావం కనిపించింది. దీంతో రెండున్నరేళ్ల తర్వాత కూడా.. రాజకీయంగా సిందూర రెడ్డి పాట్లు పడాల్సిన పరిస్తితి వచ్చింది. మెజారిటీ ప్రజలకు ఆమె ఎవరో తెలియక పోవడం .. వైసీపీకి కలిసి వస్తోంది. మీ ఎమ్మెల్యే ఎవరు? అంటూ.. ఇటీవల వైసీపీ క్యాంపెయిన్ చేపట్టింది. దీంతో మెజారిటీగా రషఘునాథరెడ్డి వైపు మొగ్గు చూపారు.
మొత్తంగా .. పుట్టపర్తి నగర పరిధిలో ఎమ్మెల్యే హవా ఉన్నా.. దానికి ఆవల మాత్రం ఆమె ప్రభావం కనిపించడం లేదన్నది పార్టీలోనే చర్చ జరుగుతోంది. తాజాగా స్థానిక సమరం రెడీ అవుతున్న దరిమిలా.. ఎమ్మె ల్యే ప్రభావం కీలకంగా మారింది. దీంతో ఇప్పుడు ఆమె పుట్టపర్తిలో ఇంటింటికీ తిరిగే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. పార్టీ కేడర్‌కు కూడా అందుబాటులో ఉంటున్నారు. కానీ, ప్రజలకు ఏమేరకు వ్యక్తిగతంగా చేరువ అవుతారన్నది చూడాలి. పుట్టపర్తిలో వైసీపీ ఓడిపోయినా.. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ప్రభావం ఎక్కువగానే ఉండడం గమనార్హం.
