Begin typing your search above and press return to search.

గాజువాక ఫోకస్...పిటిషన్ల కమిటీ ముందు పల్లా గళం!

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాకలో పెండింగ్ భూ సమస్యల మీద పిటిషన్ కమిటీ ముందు గళమెత్తారు.

By:  Satya P   |   23 Jun 2026 5:35 PM IST
గాజువాక ఫోకస్...పిటిషన్ల కమిటీ ముందు పల్లా గళం!
X

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాకలో పెండింగ్ భూ సమస్యల మీద పిటిషన్ కమిటీ ముందు గళమెత్తారు. చిరకాలంగా అటు రెవిన్యూ ఇటు ఏపీఐఐసీ, పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించిన అనేక భూ సమస్యలను కమిటీ ముందు ఉంచారు. ఈ సమస్యలకు రెండు నెలల వ్యవధిలో పరిష్కరిస్తామని కమిటీ హామీ ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంటే విశాఖ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్, శాసనసభ పిటిషన్స్ కమిటీ ఛైర్మన్ కనుమూరి రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన పిటిషన్స్ కమిటీ సమావేశంలో గాజువాక నియోజకవర్గం సమస్యల మీద పల్లా పూర్తి స్థాయిలో ప్రస్తావించారు.

భూ నిర్వాసితుల బాధలు :

గాజువాక పారిశ్రామిక ప్రాంతం. దాంతో భూములను వివిధ పరిశ్రమల కోసం సేకరించడం జరుగుతోంది. అదే సమయంలో భూ సేకరణకు తమ భూములు ఇచ్చిన బాధితులకు నష్ట పరిహారం ఈ రోజుకీ చాలా కేసులలో దక్కలేదు. అంతే కాదు, నిర్వాసితుల పునరావాసం సమస్య ఉండనే ఉంది. అలాగే 22-ఏ సమస్యలతో పాటు పరిశ్రమల వల్ల ప్రభావితమైన కుటుంబాల హక్కులు కూడా ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ ఉంది. వీటిని అన్నింటికీ కమిటీ ముందు పల్లా ఉంచారు. ఇక చినగంట్యాడ పరిధిలో అనేక గ్రామాలలో నివస్తున్న వందలాది కుటుంబాలకు ఇప్పటికే ఉన్న ఇళ్లకు జీవో నంబర్ 30 తరహాలో క్రమబద్ధీకరణ కల్పించాలని పల్లా కోరారు. అంతే కాదు ఆ ఇళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పల్లా డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రధాన కార్యదర్శికి ప్రత్యేక సిఫార్సులు పంపాలని పిటిషన్ కమిటీకి సూచించారు. అవసరమైతే కేబినెట్ ఆమోదంతో ప్రత్యేక విధానం తీసుకురావాలని కూడా పల్లా సూచించారు. దీనిపై పిటిషన్స్ కమిటీ సానుకూలంగా స్పందించడమే కాదు 90 రోజుల్లో కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించడం విశేషం.

22-ఏలో చిక్కుకుని విలవిల :

ఇక 22-ఏ పేరుతో అనేక భూములు చిక్కుకున్నాయని పల్లా పిటిషన్ కమిటీ ముందు ఉంచారు. అలా గాజువాకలోని వడ్లపూడి, చినగంట్యాడ, కూర్మన్నపాలెం, మిందీ, పెద్దగంట్యాడ, జగ్గరాజుపేట ప్రాంతాల్లోని నివాస కాలనీలు ఉండటంతో ప్రజలు కొనుగోలు, విక్రయాలు వంటివి లేకుండా పూర్తిగా ఇబ్బందిలో పడ్డారని ఆయన చెప్పారు. వీటిలఒ అర్హులైన నివాస ప్రాంతాలను 22-ఏ నుంచి తొలగించాలని పల్లా కమిటీని కోరారు. ఇక ఉక్కు నిర్వాసితుల ఆర్-కార్డుల డిజిటలైజేషన్ సమయంలో నకిలీ కార్డులు కూడా వచ్చాయని ఆయన చెప్పారు. దీంతో అనుమానాస్పదంగా ఉన్న 486 డౌట్‌ఫుల్ ఆర్-కార్డుల వ్యవహారాన్ని సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చెస్తామని కమిటీ హామీ ఇవ్వడం విశేషం.

భూములు స్వాధీనం :

పిటిషన్ల కమిటీలో మరో కీలక ప్రతిపాదన పల్లా పెట్టారు. ఒకనాడు ఏపీ రిఫ్రాక్టరీస్‌కు కేటాయించిన భూముల్లో ఎక్కువ శాతం భూములు ఇపుడు ఉపయోగంలో లేవని ఆయన చెప్పారు. అలా మిగిలిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని పల్లా కమిటీని కోరడం విశేషం. అంతే కాదు గాజువాక పరిధిలోని అగనంపూడి నుంచి మధురవాడ వరకు మిక్స్‌డ్ జోన్‌గా ప్రకటించాలని కోరారు. ఇక జీవో నెం.26 ప్రకారం మత్స్యకార కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.10.50 కోట్ల జీవనోపాధి ప్యాకేజీ ట్రాంక్విలిటీ బ్రేక్‌వాటర్ పెండింగ్ ఉద్యోగాలు, ఇళ్ల స్థలాల కేటాయింపు అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని కమిటీ దృష్టికి పల్లా తీసుకుని వచ్చారు.