దేశం గర్వించదగిన క్రికెటర్ విషయంలో ఏమిటీ పనికిమాలిన రచ్చ?
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ప్రధానంగా ఈ సోషల్ మీడియా యుగంలో అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
By: Raja Ch | 25 Nov 2025 6:28 PM ISTస్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం ఊహించని పరిణామాల నడుమ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎంతో వేడుకగా జరుపుకోవాల్సిన వారి వివాహం కాస్తా ఊహించని మలుపు తిరిగింది. మంధాన తండ్రి ఆరోగ్యం కారణంగా వారి వివాహం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఓ కొత్త చర్చ నడుస్తోంది.
అవును... స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ లు నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె తండ్రి ఆరోగ్య పరిస్థితి కారణంగా ఈ కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసినట్లు కుటుంబాలు ప్రకటించాయి. ఈ సమయంలో సోషల్ మీడియాలో స్మృతిని ముచ్చల్ మోసం చేశాడని సూచించే మెసేజ్ ల స్క్రీన్ షాట్లు హల్ చల్ చేస్తున్నాయి.
ఓ పక్క స్మృతి తండ్రి ఆస్పత్రిలో ఉండటంతో పాటు.. ఆయన అనారోగ్యానికి గురవడాన్ని తట్టుకోలేకపోయిన పలాశ్.. దాదాపు నాలుగు గంటల పాటు ఏడుస్తూనే ఉన్నారని.. దీంతో అతడి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో.. వాయిదా ప్రకటనలు తెరపైకి వచ్చిన వేళ.. పలాశ్ మరో అమ్మాయితో చాటింగ్ చేశాడంటూ మెసేజ్ ల స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు స్మృతి తన ఇన్ స్టా గ్రామ్ నుంచి ఎంగేజ్ మెంట్ ఫోటోలు, ప్రపోజల్ వీడియోతో సహా అనేక పోస్టులు తొలగించబడటం చర్చనీయాంశంగా మారింది! ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి.. ముచ్చల్, ఒక మహిళ మధ్య జరిగిన కాన్వర్జేషన్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఆన్ లైన్ లో వ్యాపించడం ప్రారంభించాయి.
ఎందుకీ పనికిమాలిన రచ్చ?:
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ప్రధానంగా ఈ సోషల్ మీడియా యుగంలో అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. జరుగుతున్న ప్రచారంలో వాస్తవాస్తవాల గురించి ఆలోచించే సమయం, స్పందించొచ్చా లేదా అని ఆలోచించే స్పృహ జనాలకు తగ్గిపోతుందనే చెప్పుకోవాలి! తాజాగా స్మృతి మంధాన విషయంలో అదే జరుగుతుంది!
వాస్తవానికి ఆమెకు ఎంగేజ్మెంట్ అయ్యింది.. వివాహానికి డేట్ కూడా ఫిక్స్ చేశారు.. అన్నీ అనుకూలంగా జరిగి ఉంటే ఆమెకు వివాహమై ఇప్పటికే రెండు రోజులు అయ్యేది! కాకపోతే.. ఆమె తండ్రికి సడన్ గా సీరియస్ అవ్వడం, దానికి తోడు వరుడు కూడా అనారోగ్యానికి గురవ్వడంతో ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సంబరాల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఉండకూడదని భావించి స్మృతి వాటిని డిలీట్ చేసి ఉండోచ్చు కదా..!? ఈ కోణంలో ఆలోచించేవారు కరువైపోతున్నారనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి!
ఏది ఏమైనా, జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజమున్నా, మరెంత అబద్ధం ఉన్నా... దేశం గర్వించదగిన ఓ క్రీడాకారిణి విషయంలో ఇలాంటి ప్రచారాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు! ఈ పరిస్థితుల్లో అత్యంత సున్నితమైన విషయాలపై నెటిజన్లు అత్యుత్సాహం తగ్గించుకోవాలనే సూచనలు వినిపిస్తున్నాయి. ఎంతో సున్నితమైన విషయంలో ఆమె ప్రైవసీకి భంగం కలిగించే ప్రచారాన్ని జనాలు మానుకోవాలి. ఈ సమయంలో దేశం మొత్తం ఆమెకు మద్దతుగా ఉండాల్సింది పోయి.. ఏమిటీ పనికిమాలిన రచ్చ?
