Begin typing your search above and press return to search.

స్నాప్‌చాట్ లవ్ స్టోరీ: ప్రేమ కోసం పాక్ నుంచి భారత్‌కు వచ్చిన యువకుడు.. సినిమాలో రేంజ్ ప్లాన్ వింటే షాకవుతారు

అయితే ఆ మాటను నిజం చేయాలనే ఆత్రుతలో ప్రేమించిన యువతి కోసం ఓ పాకిస్థాన్ యువకుడు ఏకంగా అంతర్జాతీయ నియంత్రణ రేఖ (ఎల్.ఓసీ) దాటి భారత భూభాగంలోకి ప్రవేశించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

By:  A.N.Kumar   |   5 July 2026 4:00 PM IST
స్నాప్‌చాట్ లవ్ స్టోరీ: ప్రేమ కోసం పాక్ నుంచి భారత్‌కు వచ్చిన యువకుడు.. సినిమాలో రేంజ్ ప్లాన్ వింటే షాకవుతారు
X

"ప్రేమకు సరిహద్దులు లేవు.. బంధాలకు దేశాలతో పనిలేదు" అనే మాటను మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే ఆ మాటను నిజం చేయాలనే ఆత్రుతలో ప్రేమించిన యువతి కోసం ఓ పాకిస్థాన్ యువకుడు ఏకంగా అంతర్జాతీయ నియంత్రణ రేఖ (ఎల్.ఓసీ) దాటి భారత భూభాగంలోకి ప్రవేశించడం ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియా పరిచయంతో మొదలైన ఈ ప్రేమకథ, చివరికి ఊహించని మలుపు తిరిగి.. భద్రతా బలగాల చేతికి చిక్కి మళ్లీ స్వదేశానికి చేరేలా చేసింది.

స్నాప్‌చాట్‌లో చిగురించిన ప్రేమ

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)కు చెందిన 22 ఏళ్ల జీషాన్ మీర్‌కు, జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా తుల్వారీ గ్రామానికి చెందిన ఇరమ్ బానో అనే యువతితో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘స్నాప్‌చాట్’ ద్వారా పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే ఆ పరిచయం కాస్తా బలమైన ప్రేమగా మారింది. ఒకరినొకరు చాటింగ్ చేసుకుంటూ మరింత దగ్గరవుతున్న క్రమంలో తమ పూర్వీకులు కూడా అమ్మాయి గ్రామానికి చెందినవారనే ఆసక్తికర విషయం జీషాన్‌కు తెలిసింది. ప్రస్తుతం తన కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఎలాగైనా భారతదేశంలోనే శాశ్వతంగా స్థిరపడాలనే గట్టి నిర్ణయానికి వచ్చాడు జీషాన్.

లవర్స్ ప్లాన్.. సినిమాలో రేంజ్ ట్విస్ట్!

ఇరమ్ బానో, జీషాన్ మీర్ ఇద్దరూ కలిసి భవిష్యత్తు కోసం ఒక వింతైన ప్రణాళికను రూపొందించుకున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఆ ప్లాన్ ప్రకారం మొదట జీషాన్ భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి భారత సైన్యానికి లొంగిపోవాలి. సరిహద్దు దాటినందుకు చట్టపరంగా పడే శిక్షను అనుభవించాలి. శిక్షా కాలం పూర్తయ్యాక, తన పూర్వీకులకు చెందిన ఆస్తి హక్కుల కోసం చట్టపరంగా పోరాడాలి. ఆ తర్వాత ఇరమ్ బానోను పెళ్లాడి భారత్‌లోనే స్థిరపడిపోవాలి. ఈ ప్లాన్‌తోనే ఈ ఏడాది మే 31న ఉరీ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ దాటుతుండగా భారత సైన్యం జీషాన్ మీర్‌ను అదుపులోకి తీసుకుంది.

రంగంలోకి దిగిన భద్రతా సంస్థలు.. అసలు నిజం ఇదీ!

భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన జీషాన్‌ను ఆర్మీ, నిఘా వర్గాలు అన్ని కోణాల్లోనూ క్షుణ్నంగా విచారించాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉండే నేపథ్యంలో దీని వెనుక ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా? అనే కోణంలో సుదీర్ఘంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే కశ్మీర్‌లోని యువతి ఇరమ్ బానోను కూడా అధికారులు విచారించారు. జీషాన్ అమాయకుడని, అతనికి భారత్‌లోనే ఉండే అవకాశం కల్పించాలని ఆమె అధికారులను కోరినట్లు సమాచారం. చివరికి అతని బ్యాక్‌గ్రౌండ్, సోషల్ మీడియా చాటింగ్స్ పరిశీలించిన తర్వాత.. ఇందులో ఎలాంటి ఉగ్రవాద లేదా విద్రోహ కోణం లేదని, కేవలం ప్రేమ కోసమే వచ్చాడని భద్రతా సంస్థలు నిర్ధారించాయి.

చివరికి ఏమైంది?

ఉగ్రవాద ముప్పు లేనప్పటికీ.. వీసా, పాస్‌పోర్ట్ లేకుండా అంతర్జాతీయ సరిహద్దులు దాటడం చట్టరీత్యా నేరం. దీంతో అమల్లో ఉన్న ద్వైపాక్షిక నిబంధనలు, చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన భారత సైన్యం, శనివారం నాడు జీషాన్ మీర్‌ను అధికారికంగా పాకిస్థాన్ అధికారులకు అప్పగించింది.

సోషల్ మీడియా యుగంలో సరిహద్దులు దాటిన ఈ ప్రేమకథ వినడానికి ఆసక్తికరంగా అనిపించినప్పటికీ, అంతర్జాతీయ నిబంధనలను, దేశ భద్రతా చట్టాలను ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.