షేక్ హ్యాండ్ తో గిల్ ను గిల్లి.. ఆస్ట్రేలియాలో పాకిస్థానీ దుర్మార్గం
ఈ మొత్తం వ్యవహారంలో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ హుందాతనం చూపాడని.. పాకిస్థానీ మాత్రం పరాయి దేశంలోనూ పరువు పోగొట్టుకునేలా ప్రవర్తించాడనే అభిప్రాయం వ్యక్తమైంది.
By: Tupaki Political Desk | 23 Oct 2025 3:43 PM ISTకలిసేందుకు వచ్చిన అభిమానిని ఏ సెలబ్రిటీని అయినా సాదరంగా ఆహ్వనిస్తారు.. వారితో షేక్ హ్యాండ్ ఇస్తారు.. అప్పటికే తెలిసిన అభిమాని అయితే ఆలింగనం కూడా చేసుకుని కాసేపు ముచ్చటిస్తారు..! ఇక విదేశాల్లో మనలాంటి ఫేస్ కట్ తో కనిపించే వారు దగ్గరకు వస్తే ఆప్యాయత కనబరుస్తారు. కానీ, ఓ పాకిస్థానీ మాత్రం తన వక్ర బుద్ధిని చాటుకున్నాడు. టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ తో షేక్ హ్యాండ్ పొంది తమ దేశానికి అలవాటైన దుర్మార్గపు రీతిలో వ్యవహరించాడు. ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ లో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకూ ఏం జరిగింది అంటే..?
టీమ్ ఇండియా ఆస్ట్రేలియాతో రెండో వన్డే కోసం ఆడిలైడ్ లో ఉంది. గురువారం నాటి మ్యాచ్ కు ముందు మన జట్టుకు ఆప్షనల్ (ఇష్టం అయితేనే) ప్రాక్టీస్ ఇచ్చారు. దీంతో టీమ్ ఇండియా కెప్టెన్ శుబ్ మన్ గిల్ పేస్ బౌలర్ హర్షిత్ రాణాలు విహారానికి వెళ్లారు. ఆ సమయంలో తన దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తికి అతడు ఎవరు అనేది కూడా చూడకుండా గిల్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అంతటితో కథ ముగిస్తే బాగానే ఉండేది. కానీ, హ్యాండ్ షేక్ తీసుకున్నది పాకిస్థానీ. అతడు గిల్ నుంచి పొందిన మర్యాదను నిలపుకోకుండా.. వెంటనే పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదం చేశాడు. కానీ, గిల్ మాత్రం పో పోరా అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
గిల్ ది సంస్కారం.. అతడిది కుసంస్కారం..
ఈ మొత్తం వ్యవహారంలో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ హుందాతనం చూపాడని.. పాకిస్థానీ మాత్రం పరాయి దేశంలోనూ పరువు పోగొట్టుకునేలా ప్రవర్తించాడనే అభిప్రాయం వ్యక్తమైంది. వాస్తవానికి అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇలా విదేశాల్లో భారత్-పాకిస్థాన్ భేద భావాలు పెద్దగా కనిపించవు. అమెరికాలో అయితే ఇరు దేశాల వారు కలిసి క్రికెట్ ఆడతారు. అయితే, ఇదంతా పెహల్గాం ఉగ్రదాడికి ముందు. ఈ దారుణ ఘటన అనంతరం టీమ్ ఇండియా ఆటగాళ్లు ఆసియాకప్ లో పాకిస్థానీలకు షేక్ హ్యాండ్ లు ఇవ్వని సంగతి తెలిసిందే. ఫైనల్లో పాక్ పైన గెలిచాక ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ కూడా అయిన మొహిసిన్ నఖ్వీ నుంచి కప్ తీసుకోలేదు.
అదే అతడి దురుద్దేశం..
బహుశా ఆస్ట్రేలియాలో ఉంటున్న పాకిస్తాన్ వ్యక్తి ఆసియా కప్ ఉదంతాన్ని అంతా మనసులో పెట్టుకున్నట్లు ఉన్నాడు. గిల్ తో ఆడిలైడ్ లో షేక్ హ్యాండ్ అనంతరం తన అసలైన బుద్ధిని బయటపెట్టుకున్నాడు. అతడు ఉన్నది ఆస్ట్రేలియాలో అన్న సంగతి మర్చిపోయి నినాదాలు చేశాడు. ఇదిచూసిన అభిమానులు మీ బుద్ధి పోనిచ్చుకోలేదు కదరా? అంటూ విమర్శలు చేస్తున్నారు.
