Begin typing your search above and press return to search.

పాకిస్తానీ న‌టీన‌టుల‌ను వెంటాడుతున్న ఆప‌రేష‌న్ బొమ్మాళీ

పాకిస్తానీ వెబ్ సిరీస్ 'జో బచాయే హైన్ సంగ్ సమైత్ లో' విడుదలను నిషేధించాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ నటించిన ఈ సిరీస్ డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావాల్సి ఉంది. పాకిస్తానీ సినిమాలు, సిరీస్‌లు, పాటలపై శాశ్వత నిషేధం విధించే చట్టం తీసుకురావాలని కూడా సంస్థ డిమాండ్ చేసింది.

By:  Sivaji Kontham   |   25 Nov 2026 6:24 PM IST
పాకిస్తానీ న‌టీన‌టుల‌ను వెంటాడుతున్న ఆప‌రేష‌న్ బొమ్మాళీ
X

ఇండియా- పాక్ బార్డ‌ర్ తీవ్ర‌వాదం ఆర్టిస్టుల జీవితాల‌తో ఎలా ఆట‌లాడుకుంటుందో అర్థం చేసుకోవ‌డానికి ఇది చాలు. ఆప‌రేష‌న్ సింధూర్ ప‌ర్య‌వ‌సానం ఇప్ప‌టికీ న‌టీన‌టుల‌ను ఆడుకుంటోంది. ఆ స‌మ‌యంలో భార‌తీయుల భావోద్వేగాల గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. పాకిస్తాన్ ప్ర‌తిభ‌ను బాలీవుడ్ లాంటి చోట బ్యాన్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. పాక్ న‌టీన‌టుల‌కు ఎలాంటి మ‌ద్ధ‌తు లేకుండా యూనియ‌న్లు అడ్డుకుంటున్నాయి. ఈ ప‌ర్య‌వ‌సానం ఆర్టిస్టుల‌కు పెను శాపంగా మారింది.

పాక్ నటీన‌టుల‌ను ఎంపిక చేసుకున్న హిందీ నిర్మాత‌ల‌కు కూడా తాఖీదులు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆ త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ ప‌రిస్థితులు మెరుగుప‌డ‌లేదు. తాజాగా ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసిడ‌బ్ల్యూఏ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ.. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో పాకిస్తానీ వెబ్ సిరీస్ `జో బచాయే హైన్ సంగ్ సమైత్ లో` విడుదలను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేసింది. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్, హనియా ఆమిర్, సనమ్ సయీద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ 2026 డిసెంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పాకిస్తాన్‌కు చెందిన సినిమాలు, సిరీస్‌లు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు సహా ఏ వినోద కంటెంట్‌నూ భారత వేదికలపై ప్రదర్శించకుండా కఠిన శిక్షలతో కూడిన శాశ్వత చట్టం తీసుకురావాలని కూడా ఆ సంస్థ కోరింది. నవంబర్ 24 తేదీతో కూడిన రెండు పేజీల ఈ లేఖపై ఏఐసిడ‌బ్ల్యూఏ అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా సంతకం చేయగా... కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియాకు కూడా కాపీలను పంపారు.

2019 పుల్వామా దాడి.. 2025 ఏప్రిల్ 22 నాటి పహల్గామ్ ఉగ్రదాడిని ఈ లేఖలో ప్రస్తావించిన ఏఐసిడ‌బ్ల్యూఏ- పాకిస్తాన్ మూలాలున్న కంటెంట్‌ను నిలిపివేయాలని 2025 మే 8న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన అడ్వైజరీని గుర్తుచేసింది. ఈ సిరీస్‌ను భారతీయ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడం ఆ అడ్వైజరీ స్ఫూర్తికి, జాతీయ భావాలకు విరుద్ధమని పేర్కొంది. ఈ సందర్భంగా AICWA ప్రధానంగా నాలుగు డిమాండ్లను ముందుంచింది.

డిసెంబర్ 4న లేదా ఆ తర్వాత ఏ తేదీలోనైనా ఈ సిరీస్‌ను భారత్‌లో స్ట్రీమ్ చేయకూడదని 2025 మే 8 నాటి అడ్వైజరీని అన్ని ఓటీటీ వేదికలు కచ్చితంగా పాటించాలని.. పాకిస్తానీ కంటెంట్.. కళాకారులు.. ప్రొడక్షన్లపై టీవీ, ఓటీటీ, థియేటర్లలో ఆంక్షలు విధించే శాశ్వత చట్టం తేవాలని.. అలాగే పాకిస్తానీ కంటెంట్ ప్రదర్శనపై నెట్‌ఫ్లిక్స్ ఇండియా సహా ఇతర సంస్థలు తమ వైఖరిని బహిరంగంగా స్పష్టం చేయాలని కోరింది.

ఫర్హత్ ఇష్తియాక్ రాసిన ప్రముఖ ఉర్దూ నవల ఆధారంగా రూపొందిన `జో బచాయే హైన్ సంగ్ సమైత్ లో` నెట్‌ఫ్లిక్స్‌కు తొలి పాకిస్తాన్-నేపథ్య ఒరిజినల్ సిరీస్. ఇటీవలే ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదలై నెట్‌ఫ్లిక్స్ ఇండియా అప్‌కమింగ్ లిస్టింగ్స్‌లోనూ ఈ టైటిల్ కనిపించినా.. భారత్‌లో ఈ సిరీస్ అందుబాటులో ఉంటుందా లేదా అనేదానిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్ర‌స్తుత ఒత్తిళ్ల నేప‌థ్యంలో ఈ సిరీస్ ప్ర‌సారంపై సందిగ్ధ‌త‌లు నెల‌కొన్నాయి. భార‌త‌దేశంలో క‌ఠిన చ‌ట్టాలు అమ‌లైతే పాకిస్తానీ న‌టీన‌టుల, సాంకేతిక నిపుణుల‌ జీవితం పూర్తిగా డైల‌మాలో ప‌డిన‌ట్టే. అంతేకాదు పాకిస్తాన్ కు ప‌రోక్షంగా మ‌ద్ధ‌తు ప‌లికే చాలా మంది పెద్ద స్టార్ల‌కు కూడా ఇది ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారే ఛాన్సుంది.