ఒకే బైక్‌పై 10 మంది.. ప్రాణాలను పణంగా పెట్టి పాకిస్థానీయుల వింత ప్రయాణం.. వీడియో
అక్కడ జరిగే కొన్ని వింతలు చూస్తే ప్రపంచానికి స్ట్రెస్ బస్టర్‌లా అనిపించక మానదు. తాజాగా అలాంటి ఒక విస్తుపోయే ఘటనే నెటిజన్లను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
By: A.N.Kumar | 6 July 2026 4:27 PM ISTసోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విచిత్రాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మన పొరుగు దేశమైన పాకిస్థాన్ గురించి వచ్చే వార్తలు.. అక్కడ జరిగే సంఘటనలు నెటిజన్లకు ఒక రేంజ్‌లో వినోదాన్ని, ఆశ్చర్యానికీ గురిచేస్తుంటాయి. అంతర్జాతీయ వేదికలపై ఆ దేశ పరిస్థితి ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం పాకిస్థాన్ కంటెంట్ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. అక్కడ జరిగే కొన్ని వింతలు చూస్తే ప్రపంచానికి స్ట్రెస్ బస్టర్‌లా అనిపించక మానదు. తాజాగా అలాంటి ఒక విస్తుపోయే ఘటనే నెటిజన్లను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
ట్యాంకుపై డ్రైవర్.. బైక్‌పై ఏకంగా పది మంది!
సాధారణంగా బైక్ పై ఇద్దరు ప్రయాణించడం చట్టబద్ధం. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ముగ్గురు వెళ్లడం చూస్తుంటాం. కానీ పాకిస్థాన్‌లోని ఓ వీధిలో ఏకంగా పది మంది ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రయాణం సాగిన తీరు చూస్తే ఎవరికైనా గుండె గుభేల్మనడం ఖాయం. ఆ బైక్‌పై ముగ్గురు మహిళలు కూర్చోగా.. వారి చేతుల్లో ఒడిలో కలిపి మొత్తం ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఇక వీరందరినీ ఎక్కించుకున్న ఆ బైక్ డ్రైవర్.. కూర్చోవడానికి సీటుపై స్థలం లేకపోవడంతో ఏకంగా ఫ్యూయల్ ట్యాంక్ పెట్రోల్ ట్యాంక్ పై కూర్చొని వాహనాన్ని నడపడం ఇక్కడ విశేషం. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాగిస్తున్న ఈ ప్రమాదకర ప్రయాణం చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.
అక్కడి వ్యవస్థకు నిదర్శనం..
పాకిస్థాన్‌లో ఇలాంటి దృశ్యాలు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. అక్కడ ట్రాఫిక్ నిబంధనలు, రోడ్ల భద్రత ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. కరాచీ, ఇస్లామాబాద్, పెషావర్ వంటి కొన్ని ప్రధాన నగరాలను మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో మౌలిక వసతులు శూన్యం. రోడ్లు గుంతలమయంగా మారినా పట్టించుకునే నాథుడే ఉండడు. అక్కడి పాలకులు ప్రజలపై ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో భారీగా పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ అభివృద్ధి మాత్రం అంజనం వేసి వెతికినా కనిపించదు. ఒకే బైక్‌పై నలుగురు ఐదుగురు వెళ్లడం అక్కడ సర్వసాధారణం అయిపోయింది.
నెటిజన్ల ఆగ్రహం
"ఇది ప్రయాణమా.. లేక మృత్యువుతో ఆటలా?" అంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. చిన్న పిల్లలను పెట్టుకుని అంతమంది ఒకే బైక్‌పై వెళ్లడం వల్ల ఏ చిన్న ప్రమాదం జరిగినా ఎంత నష్టం జరుగుతుందో ఊహించడానికే భయంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం ఈ "పది మంది ప్రయాణం" వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా షేర్ అవుతూ పాకిస్థాన్ పాలనా వ్యవస్థపై మరోసారి చర్చకు దారితీస్తోంది.
