పాక్ కి కొత్త తలనొప్పి... భారత్ సత్తా ఇప్పటికైనా తెలిసిందా..!
అవును... ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్ సిఫార్స్ చేసిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 7 Feb 2026 4:16 PM ISTబ్రతిమాలితేనో.. గారం పడితోనో.. అడగని సహాయాలు చేసే పనికి పూనుకుంటేనో అన్ని తమకు అనుకూలంగా జరిగిపోతాయని.. హోదా మరిచి, దేశ పౌరుల ఆత్మాభిమానాన్ని తాకాట్టు పెడుతూ చిల్లర పనులు, సేల్స్ మ్యాన్ కార్యక్రమాలు చేస్తేనో పనులు అయిపోతాయని భావిస్తే.. అవతలి వారు అంత అమాయకులు కాదు అని గ్రహించలేకపోతే.. ఎదురు దెబ్బలు ఎలా తగులుతాయో తాజాగా ట్రంప్ విషయంలో పాకిస్థాన్ కు తెలిసొచ్చిందనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అవును... ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్ సిఫార్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో యూఎస్ తో చమురు ఒప్పందాలు, విలువైన ఖనిజాల అగ్రిమెంట్లు, సరిహద్దు ఒప్పందాలు.. పైగా భారత్ తో జరిగిన ఆపరేషన్ సింధూర్ ఆగడానికి కారణం అంతా ఆయన చలవే అంటూ పాకిస్థాన్ ట్రంప్ ని కొనియాడినప్పటికీ.. నేడు భారత్ కంటే ఎక్కువ సుంకాలు దెబ్బ తగలిన పరిస్థితి. దీంతో.. సొంత ప్రజలే పాక్ ప్రభుత్వాన్ని ఓ ఆటాడుకుంటున్నారు.
భారత్ - అమెరికా మధ్య చాలామంది ఊహించని రీతిలో వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారం పాకిస్థాన్ లో సరికొత్త రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత ఎగుమతులపై అమెరికా 18% సుంకాలను విధిస్తుండగా... పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ వాషింగ్టన్ లో నిరంతరం లాబీయింగ్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ దేశం 19% సుంకాలను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఇదే వారికి పెద్ద తలనొప్పిగా మారింది.
ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ప్రధానిని, ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ ని ఆ దేశ ప్రజలు ఓ ఆటాడేసుకుంటున్నారు. దేశాల మధ్య సంబంధాలు, ఆర్థిక పరమైన విషయాలు, వాణిజ్య ఒప్పందాల విషయాలో హుందాతనం ఉండాలని.. చిల్లరగా, దిగజారి ప్రవర్తించడంవల్ల అవతలివారికి లోకువైపోతామని.. హుందాతనం భారతదేశాని చూసి నేర్చుకోవాలని.. తొలుత 50% విధించిన సుంకాలను 18 శాతానికి తగ్గించడంలో వారి చాణిక్యం అద్భుతమని అంటున్నారు.
ఈ తరహా చాణిక్యం, హుందాతనం, పరస్పర ప్రయోజన చర్చలూ లేకుండా.. వాషింగ్టన్ లో తిరుగుతూ, విలువైన ఖనిజాలను బాక్సులో పట్టుకెళ్లి, సేల్స్ మ్యాన్ పనులు చేస్తూ.. దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడుతూ.. ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతిని సిఫార్సు చేసినంత మాత్రాన్న పనులు జరగవని ఇప్పటికైనా తెలుసుకోవాలని.. భారత సమర్థత, చాణిక్యాన్ని చూసి నేర్చుకోవాలని.. ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్ ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
