Begin typing your search above and press return to search.

భారత్ తో యుద్ధానికి సిద్ధం.. పాకిస్తాన్ సంచలన ప్రకటన వెనుక కథ ఇదీ

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దోషులను వదిలిపెట్టబోమని స్పష్టంగా హెచ్చరించారు.

By:  A.N.Kumar   |   13 Nov 2025 10:00 PM IST
భారత్ తో యుద్ధానికి సిద్ధం.. పాకిస్తాన్ సంచలన ప్రకటన వెనుక కథ ఇదీ
X

ఇస్లామాబాద్‌లో వరుస పేలుళ్లు, తాలిబన్ బెదిరింపులు, అంతర్గత భద్రతా అస్థిరతల నడుమ పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంది. భారత్‌తోపాటు అఫ్ఘానిస్తాన్‌తో కూడిన రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. దేశీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ ప్రకటనలు చేస్తున్నారనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇస్లామాబాద్‌ను కుదిపిన పేలుళ్లు & టీటీపీ బెదిరింపులు

మంగళవారం ఇస్లామాబాద్‌లో జరిగిన సూసైడ్ బాంబ్ దాడుల్లో 12 మంది మృతి చెందగా 36 మంది గాయపడ్డారు. ఈ దాడికి తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) స్వయంగా బాధ్యత వహించుకుంది. అయితే ఈ అంతర్గత భద్రతా వైఫల్యాన్ని వదిలిపెట్టి, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం భారత్‌పై ఆరోపణలు మోపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

రెండు వైపులా పోరాటానికి సిద్ధం

భారత్‌ను ఉద్దేశిస్తూ ఖవాజా ఆసిఫ్ విమర్శలు గుప్పించారు. “ఇది మొదట గ్యాస్ సిలిండర్ పేలుడు అని చెప్పారు. ఇప్పుడు దీనిని విదేశీ కుట్రగా చూపిస్తున్నారు అని మండిపడ్డారు. యుద్ధ సన్నద్ధతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “పాకిస్తాన్ రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉంది. తూర్పు–పశ్చిమ సరిహద్దులలో పోరాడటానికి మా సైన్యం సమర్థంగా ఉంది. మొదటి రౌండ్‌లో అల్లాహ్ మాకు సహాయం చేశాడు, రెండో రౌండ్‌లో కూడా అలాగే జరుగుతుంది.” అని పేర్కొన్నాడు.

* భారత్ భయం & ఖాళీ హెచ్చరికలు

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దోషులను వదిలిపెట్టబోమని స్పష్టంగా హెచ్చరించారు. దీనికి కొనసాగింపుగా భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌కు తీవ్రమైన దెబ్బతీసింది. ఈ ఆపరేషన్ ప్రభావం ఇప్పటికీ ఇస్లామాబాద్ నాయకుల్లో భీతిని కలిగిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధాని మోదీ సందేశాల నేపథ్యంలో మరోసారి భారత్ ఏదైనా కఠిన చర్య తీసుకుంటుందేమో అన్న భయంతో పాకిస్తాన్ రాజకీయ నాయకులు కేవలం ఖాళీ హెచ్చరికలను జారీ చేస్తున్నారనే విశ్లేషణలు ఉన్నాయి.

*అఫ్ఘానిస్తాన్‌పై కూడా బెదిరింపులు

ఖవాజా ఆసిఫ్ కేవలం భారత్‌నే కాకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో అఫ్ఘాన్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించారు. “కాబూల్ ప్రభుత్వం పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని ఆపగలదు… కానీ వారు ఈ యుద్ధాన్ని ఇస్లామాబాద్‌కు తీసుకువచ్చారు. ప్రతిస్పందించడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము” అని పేర్కొన్నారు.

* టీటీపీ సవాలు: ప్రభుత్వం బలహీనమైందనే సందేశం

మరోవైపు TTP విడుదల చేసిన వీడియోలో పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ఆ వీడియోలో పాకిస్తాన్ ఆర్మీ ముజాహిదీన్‌లను ఎదుర్కొనే సామర్థ్యం లేదని, ప్రభుత్వం పతనం దశలో ఉందని, తామంతా పంజాబ్ ప్రాంతంలోనే ఉన్నామని స్పష్టంగా పేర్కొంది. ఇది పాకిస్తాన్ నిఘా వ్యవస్థలను నేరుగా సవాలు చేస్తూ చేసిన వ్యాఖ్యలుగా భావిస్తున్నారు.

*అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం

ఇస్లామాబాద్‌ అంతర్గత భద్రత బలహీనంగా ఉన్న సమయంలో పాకిస్తాన్‌ ప్రభుత్వం భారత్, అఫ్ఘానిస్తాన్‌లపై యుద్ధ బెదిరింపులను వినిపించడం కేవలం ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉంది. టీటీపీ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ నాయకులు దేశీయ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు భారత్‌పై ఆరోపణలు మోపుతున్నారన్న విశ్లేషణలు బలం పుంజుకుంటున్నాయి.