పాక్ కొంప కొల్లేరు..!! అమెరికా - ఇరాన్ యుద్ధం తెచ్చిన తంటా
ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సవాళ్లు, ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ దేశాన్ని తాజాగా మరో భారీ సంక్షోభం చుట్టుముట్టింది.
By: Tupaki Political Desk | 17 Sept 2026 4:00 AM ISTఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సవాళ్లు, ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ దేశాన్ని తాజాగా మరో భారీ సంక్షోభం చుట్టుముట్టింది. పశ్చిమాసియాలో రోజురోజుకు పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, ప్రపంచ విపణిలో ముడిచమురు సరఫరాకు ఏర్పడుతున్న తీవ్ర విఘాతాల కారణంగా ఆ దేశంలో ఇంధన నిల్వలు అడుగంటుతున్నాయి. ఈ ఇంధన కొరతను అధిగమించేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం వినూత్నమైన, అత్యంత కఠినమైన ప్రణాళికలకు రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలో 'స్మార్ట్ లాక్‌డౌన్' విధించి, వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే కార్యాలయాలు నిర్వహించే యోచనలో ఉందని మీడియా కథనాలు వస్తున్నాయి.
రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం పాకిస్థాన్‌పై తీవ్రంగా పడిందని చెబుతున్నారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మండిపోతుండగా, ఆ ప్రభావంతో పాక్‌లోనూ ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజాగా ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు రూ. 4.10, హైస్పీడ్ డీజిల్ ధరను రూ. 6.41 మేర పెంచింది. దీంతో పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ. 384.34కు చేరగా, డీజిల్ ధర ఏకంగా రూ. 415.83కు ఎగబాకింది. ఈ భారీ ధరల భారాన్ని, చమురు వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
వారానికి 4 రోజులే పని
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఇంధనం, విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం కొన్ని కఠినమైన ప్రతిపాదనలను పరిశీలిస్తోందని చెబుతున్నారు. ఉద్యోగులకు వారానికి కేవలం 4 రోజులు మాత్రమే ఆఫీసు పనిదినాలుగా మార్చడం, మిగతా రోజుల్లో రొటేషన్ పద్ధతి లేదా 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానాన్ని అమలు చేయడంపై చర్చిస్తున్నారు. అదేవిధంగా విద్యుత్, ఇంధన ఆదా కోసం షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలు, మార్కెట్లను సాయంత్రం వేళల్లో త్వరగా మూసివేయాలని భావిస్తున్నారు.
ప్రభుత్వ వాహనాలకూ కోత
కేవలం సాధారణ ప్రజలపైనే కాకుండా, ప్రభుత్వ యంత్రాంగంపై కూడా ఈ ఆంక్షల ప్రభావం ఉండనుందని చెబుతున్నారు. అనవసరమైన అధికారిక ప్రయాణాలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు, ప్రభుత్వ వాహనాలకు కేటాయించే ఉచిత ఇంధన కోటాను భారీగా కుదించాలని నిర్ణయించినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే, ఈ 'స్మార్ట్ లాక్‌డౌన్' అమలుపై ప్రభుత్వ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఇంధన ఆదా చర్యలు తప్పవని సమాచార శాఖ మంత్రి స్పష్టం చేస్తుండగా, లాక్‌డౌన్ విధింపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మరికొందరు మంత్రులు పేర్కొంటున్నారు.
మరోవైపు, విపరీతంగా పెరిగిన ధరల నుంచి సామాన్యులకు కొంత ఉపశమనం కలిగించేందుకు 'పీఎం ఫ్యూయల్ రిలీఫ్ స్కీమ్' కింద సబ్సిడీ ఇంధనాన్ని అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా బైక్ యజమానులకు వారానికి 5 లీటర్లు, కార్ల యజమానులకు 10 రోజులకు 10 లీటర్ల చొప్పున సబ్సిడీ ఇంధనం ఇస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లోని తీవ్ర అస్థిరతలను తట్టుకునేందుకు, గతంలో ఉన్న వారపు ధరల సమీక్షా విధానానికి స్వస్తి పలికిన పాక్ ప్రభుత్వం.. ఇకపై ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించే నూతన విధానాన్ని అమలులోకి తెచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం ముప్పేట దాడి చేస్తుండటంతో, ఆర్థికంగా కుదేలైన పాకిస్థాన్ తీసుకుంటున్న ఈ అత్యవసర చర్యలు ఏ మేరకు ఫలితాలను ఇస్తాయో వేచి చూడాల్సివుంది.
