Begin typing your search above and press return to search.

అసిమ్ మునీర్‌ ‘నిశ్శబ్ద తిరుగుబాటు’.. తుపాకీ లేకుండా పాకిస్తాన్‌పై సైనిక ఆధిపత్యం

పాకిస్తాన్ సైనిక చరిత్రలో తొలిసారిగా తుపాకీ లేకుండా ఒక నిశ్శబ్ద తిరుగుబాటు జరుగుతోంది.

By:  A.N.Kumar   |   12 Nov 2025 12:00 AM IST
అసిమ్ మునీర్‌ ‘నిశ్శబ్ద తిరుగుబాటు’.. తుపాకీ లేకుండా పాకిస్తాన్‌పై సైనిక ఆధిపత్యం
X

పాకిస్తాన్ సైనిక చరిత్రలో తొలిసారిగా తుపాకీ లేకుండా ఒక నిశ్శబ్ద తిరుగుబాటు జరుగుతోంది. ప్రస్తుత సైన్యాధ్యక్షుడు , ఫీల్డ్ మార్షల్ జనరల్ అసిమ్ మునీర్ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ నియమాలను సమూలంగా మార్చేస్తూ సైన్యానికి అపరిమిత అధికారాన్ని కట్టబెడుతున్నారు. పార్లమెంట్ ఆమోదించిన 27వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 'రాజ్యాంగ సవరణ' వ్యవస్థీకృతంగా జరుగుతున్నట్లు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

*మునీర్ కోసం కొత్త 'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF)’ పదవి

జనరల్ ఆయూబ్ ఖాన్, జియా ఉల్ హక్, పర్వేజ్ ముషారఫ్ వంటి గత సైనిక పాలకుల తిరుగుబాట్లు సాయుధంగా జరిగితే మునీర్ 'కూప్' మాత్రం చట్టపరమైన మార్పుల ద్వారా జరుగుతోంది. 27వ సవరణ ద్వారా "చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌ (CDF)" అనే కొత్త ఉన్నత హోదాను రాజ్యాంగబద్ధం చేశారు. పాకిస్తాన్ మాజీ రక్షణ కార్యదర్శి, లెఫ్టినెంట్ జనరల్ ఆసిఫ్ యాసిన్ మాలిక్ ప్రకారం.. ఈ పదవి మునీర్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రస్తుత ఆర్టికల్ 243 ప్రకారం సైన్యంపై అధ్యక్షుడికి ఉన్న తుది అధికారం.. ఈ సవరణతో పూర్తిగా సీడీఎప్ (మునీర్) ఆధీనంలోకి వెళ్లనుంది. దీంతో సైన్యం, నౌకాదళం, వాయుసేన ఈ మూడు సేవలు ఇకపై ఒకే వ్యక్తి చేతిలోకి వస్తాయి. ఈ మార్పు వాయుసేన, నేవీ అధికారుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది.

* అణ్వస్త్రాల నియంత్రణ కూడా సైన్యం చేతుల్లోకి

ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తూ అత్యంత కీలకమైన అణు ఆయుధాల నియంత్రణ అధికారాన్ని కూడా సీడీఎఫ్ (మునీర్) ఆధ్వర్యంలోని జాతీయ వ్యూహాత్మక కమాండ్‌కు అప్పగించారు. ఇప్పటి వరకు, అణ్వస్త్రాల నియంత్రణ బాధ్యత అధ్యక్షుడు, ప్రధానమంత్రికి ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై మునీర్ సిఫారసుతో మాత్రమే ప్రధానమంత్రి కీలక నియామకాలు చేయగలరు. ఫలితంగా దేశంలోని అణు బాంబులు, క్షిపణులు, ద్వితీయ దాడి వ్యవస్థలన్నీ ప్రత్యక్షంగా సైన్యం ఆధీనంలోకి వెళ్తున్నాయి.

* జీవితకాల రక్షణ - న్యాయవ్యవస్థపై నియంత్రణ

ఈ సవరణలలో అత్యంత వివాదాస్పద అంశం, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు కల్పించిన జీవితకాల రక్షణ. ఈ హక్కు అధ్యక్షుడికి ఉన్న రక్షణ హక్కుల మాదిరిగానే ఉంటుంది. అంటే మునీర్ పదవిలో ఉన్నా, పదవి నుంచి వైదొలిగినా కూడా ఆయనపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేరు. పాకిస్తాన్ జర్నలిస్టు ఇమ్రాన్ రియాజ్ ఖాన్ వ్యాఖ్యానించినట్లు "మునీర్ చేసిన తప్పులకు కూడా చట్టం చేరదు." డాన్ పత్రికలో న్యాయవాది మఖ్దూమ్ అలీ ఖాన్ అభిప్రాయం ప్రకారం.. ఈ సవరణలు "సుప్రీంకోర్టు - హైకోర్టుల మరణ ప్రకటన" వంటివి అని విమర్శించాడు. జడ్జీల బదిలీలు, కేసుల కేటాయింపులు ఇకపై ప్రభుత్వ నియంత్రణలోకి వస్తాయి. సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించి కొత్తగా “ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ (FCC)” అనే సంస్థ ఏర్పాటుకు సవరణ మార్గం సుగమం చేసింది.

* భారతదేశానికి ఎందుకు ఆందోళనకరం?

పాకిస్తాన్‌లో జరుగుతున్న ఈ పరిణామం భారతదేశానికి వ్యూహాత్మకంగా తీవ్ర ప్రమాదకరం. భారతదేశంలో సైన్యం ఎల్లప్పుడూ పౌర ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. కానీ పాకిస్తాన్‌లో ఇప్పుడు సైన్యం, అణు ఆయుధాలు, న్యాయ వ్యవస్థ..ఈ మూడు కీలక శక్తులు ఒకే వ్యక్తి జనరల్ అసిమ్ మునీర్ ఆధీనంలోకి వస్తున్నాయి.

ఈ ఏకఛత్రాధిపత్యం సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. మునీర్ నాయకత్వంలోని సైనిక ఆధిపత్యం, ప్రాంతీయ భద్రతకు కొత్త ముప్పుగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

పాకిస్తాన్ గతంలో సాయుధ తిరుగుబాట్లను చూసినప్పటికీ, ఈ 'రాజ్యాంగ సవరణ' చట్టబద్ధంగా దేశ ప్రజాస్వామ్యాన్ని కూల్చేందుకు జరుగుతున్న అత్యంత వ్యవస్థీకృత ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇది పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం చివరి ఊపిరిగా భావించబడుతోంది.