Begin typing your search above and press return to search.

బలూచ్ దెబ్బ.. ఇరాన్ సాయం కోరిన పాకిస్తాన్

బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వరుస దాడులతో పాకిస్థాన్‌లో భద్రతా పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి.

By:  A.N.Kumar   |   27 Aug 2026 6:39 PM IST
బలూచ్ దెబ్బ.. ఇరాన్ సాయం కోరిన పాకిస్తాన్
X

బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వరుస దాడులతో పాకిస్థాన్‌లో భద్రతా పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. ముఖ్యంగా వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన బలూచిస్థాన్ ప్రాంతంలో వేర్పాటువాద గ్రూపుల కార్యకలాపాలు ఊపందుకోవడం పాకిస్థాన్ సైన్యానికి గుండెనొప్పిగా పరిణమించింది. పాక్-ఇరాన్ సరిహద్దులనే కేంద్రంగా చేసుకుని బీఎల్ఏ ఫైటర్లు తమ ఆపరేషన్లను నిర్వహిస్తున్నారన్న అనుమానాలు ఇస్లామాబాద్ వర్గాలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. స్వాతంత్ర్యం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న బలూచ్ ఉద్యమం.. ఇటీవల తమ స్వతంత్రతను చాటుతూ ప్రత్యేక రోజులను ప్రకటించుకోవడంతో మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. బీఎల్ఏ తో పాటు ఇతర వేర్పాటువాద గ్రూపులు కూడా పాక్ భద్రతా బలగాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతుండటంతో పాక్ ఆర్మీ తీవ్ర ఒత్తిడిలోకి నెట్టబడింది.

ఈ ఆకస్మిక భద్రతా సంక్షోభం నుంచి బయటపడేందుకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఇరాన్ సహకారాన్ని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సరిహద్దు ప్రాంతాల నుండి బలూచ్ మిలిటెంట్లు పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడకుండా అడ్డుకోవడం.. అలాగే వేర్పాటువాదులకు అందుతున్న ఆర్థిక, ఆయుధ మద్దతును పూర్తిగా నిలిపివేయడంలో ఇరాన్ సహాయాన్ని పాకిస్థాన్ ఆశిస్తోంది. సరిహద్దుల్లో ఉమ్మడి నిఘాను పెంచడం ద్వారా మాత్రమే మిలిటెంట్ల కదలికలను అరికట్టవచ్చని ఇస్లామాబాద్ భావిస్తోంది.

అయితే ఈ వ్యవహారంలో ఇరాన్ తీసుకునే నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో కూడా బలూచ్ జనాభా విస్తరించి ఉండటం, గతంలో అక్కడ కూడా మిలిటెంట్ కార్యకలాపాలు ఇరాన్ భద్రతా బలగాలకు సవాలుగా మారడంతో పాకిస్థాన్ అభ్యర్థనను ఇరాన్ పూర్తిగా విస్మరించే పరిస్థితి లేదు. అయినప్పటికీ ప్రస్తుతం అంతర్జాతీయంగా అమెరికాతో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలోని భౌగోళిక-రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ప్రతి అడుగూ అత్యంత వ్యూహాత్మకంగా వేస్తోంది.

పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాలు కాపాడుకుంటూనే తన సొంత ప్రాంతీయ భద్రతా ప్రయోజనాలను రక్షించుకోవడం ఇరాన్‌కు కత్తిమీద సాములా మారింది. మొత్తం మీద బలూచ్ వేర్పాటువాదం పాకిస్థాన్‌కు కేవలం ఒక అంతర్గత భద్రతా సమస్యగానే కాకుండా పొరుగు దేశాలతో ఉండే సరిహద్దు, దౌత్య సంబంధాలను ప్రభావితం చేసే ప్రధాన సవాలుగా పరిణమించింది. రాబోయే రోజుల్లో బీఎల్ఏ తీవ్రవాదాన్ని పాక్ సైన్యం ఎలా కట్టడి చేస్తుంది.. ఈ విషయంలో ఇరాన్ పాకిస్థాన్‌కు ఎంతవరకు ప్రత్యక్షంగా సహకరిస్తుంది అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.