Begin typing your search above and press return to search.

ప్రపంచానికి అర్థమైంది.. పాక్ ను నమ్మితే నట్టేట మునిగినట్లేనని!

మనం పాక్ ను చూసే తీరును పక్కన పెడితే.. మరి ప్రపంచం పాకిస్తాన్ ను ఎలా చూస్తుందన్నది ఆసక్తికరం.

By:  Garuda Media   |   16 Sept 2026 12:04 PM IST
ప్రపంచానికి అర్థమైంది.. పాక్ ను నమ్మితే నట్టేట మునిగినట్లేనని!
X

మనకు నచ్చని వారు ఎప్పుడూ నచ్చనట్లే కనిపిస్తారు. అది మనిషి లక్షణం. దాన్ని తప్పు పట్టటానికి లేదు. అయితే.. విషయాన్ని 360డిగ్రీల్లో చూడటం అలవాటు చేసుకుంటే.. నచ్చని వ్యక్తి ఎందుకు నచ్చట్లేదన్న అంశంపై మరింత అవగాహన పెరుగుతుంది. ఒకవేళ.. చూసే చూపులో తేడా ఉన్నా విషయం అర్థమై.. మనల్ని మనం మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగత అంశాల్ని పక్కన పెడితే.. పాకిస్తాన్ అన్నంతనే శత్రుదేశమన్న మాట మెజార్టీ భారతీయుల నోటి నుంచి వస్తుంది. కుట్రపూరితంగా వ్యవహరించటం.. కుతంత్రాలు రచించటం.. భారత్ ను దెబ్బ తీయాలన్న విపరీతమైన అత్యాశ.. ద్వేషభావం.. ఇలాంటివెన్నో దాయాదిలో కనిపిస్తాయి. దీనికి కారణం దశాబ్దాల తరబడి ఆ దేశం భారత్ కు చేసిన మోసాలే. మనం పాక్ ను చూసే తీరును పక్కన పెడితే.. మరి ప్రపంచం పాకిస్తాన్ ను ఎలా చూస్తుందన్నది ఆసక్తికరం.

మనకు చెడ్డోడు కానీ చాలామందికి పాక్ స్నేహితుడు.. సన్నిహితుడు. అలాంటి స్నేహితుల్లో ఒకరు సౌదీ అరేబియా. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మిత్రుడికి హ్యాండ్ ఇవ్వటం మోసానికి మించింది. ఇప్పుడు అలాంటి పనే చేసింది పాకిస్తాన్. ఆ దేశాన్ని నమ్మకూడదన్న విషయం సౌదీకి తాజాగా అర్థమైంది. తమతో పోలిస్తే సంపదలో పాక్ తక్కువైనా.. ఆయుధ సంపత్తిలో తమకంటే మిన్నగా ఉండే పాకిస్తాన్ తో జత కలిస్తే.. తమకు రక్షణ ఉంటుందన్న ఆలోచనతో ఆ దేశంతో సౌదీ, టర్కీ దేశాలు ఆ మధ్యన ఒక ఒప్పందం చేసుకోవటం తెలిసిందే. దీనికి మక్కా డిఫెన్స్ అలయన్స్ పేరుతో చేసుకున్నారు. ఇందులోని ఏ దేశం మీద ఎవరు దాడి చేసినా.. ఒప్పందంలో భాగంగా మిగిలిన రెండు దేశాలు రక్షగా నిలవాలి. ఇదే ఈ ఒప్పంద సంక్షిప్త సారాంశం.

మక్కా అలయెన్స్ తో భారత్ ను పాక్ తెలివిగా దెబ్బ తీసిందన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. అయితే.. ఇలాంటి హైప్ లు ఎక్కువ కాలం ఉండవన్న విషయాన్ని తాజా పరిణామం చెప్పేసింది. మక్కా డిఫెన్స్ అలయన్స్ ప్రకారం పాకిస్తాన్ మీద ఎవరైనా దాడి చేస్తే అందుకు సౌదీ అరేబియా, టర్కీ సాయంగా నిలవాలి. అదే సమయంలో సౌదీ మీద ఎవరైనా దాడికి పాల్పడితే.. మిత్రులుగా ఉన్న పాకిస్తాన్, టర్కీలు ముందుకు వచ్చి.. వారి సంగతి చూడాలి.

ఇలాంటి ఒప్పందాలు కాగితాల మీద ఎంత బలంగా కనిపిస్తాయో.. సమయం వచ్చినప్పుడు వాటి అసలు రంగు బయటపడుతుంది. తాజాగా సౌదీ ఇంధన మౌలిక వసతులపై డ్రోన్లు.. క్షిపణులతో హౌతీలు దాడులు చేస్తున్నారు. మొదట్లో కాస్త తక్కువగానే ఉన్నా.. గత వారంలో ఈ దాడుల తీవ్రత పెరిగింది. అంతేకాదు.. సౌదీ మద్దతున్న నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ను వెనక్కి నెట్టి.. ఎర్రసముద్ర తీరంలో విస్తారమైన ప్రాంతాలే కాదు.. కొన్ని ద్వీపాల మీదా హౌతీలు నియంత్రణ సాధించినట్లుగా తెలుస్తోంది.

అంటే.. సౌదీకి హౌతీలు పెద్ద తలనొప్పిగా మారటమే కాదు.. వారి భూభాగాన్ని కబ్జా చేసేశారన్నట్లే. దీని కారణంగా జరిగే నష్టం ఏమంటే.. సౌదీ నియంత్రణలో ఉన్న బాబ్ ఎల్ మండేట్ జలసంధిలోని కొన్ని ద్వీపాలపై హౌతీలు పాగా వేస్తే.. ఇరాన్ అధిపత్యంలో ఉన్న హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించుకునే వీలుంది.హౌతీల దెబ్బకు సౌదీ చమురు ఎగుమతులకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ పరిణామం సౌదీకి ఆందోళనకు గురి చేసేదే.

ఇలాంటప్పుడు ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ రంగంలోకి దిగాలి. హౌతీల సంగతి చూడాలి. ఇలానే జరుగుతుందని సౌదీ కూడా భావించింది. కానీ..నమ్మినోళ్లను అడ్డంగా దెబ్బేసి హ్యాండ్ ఇవ్వటంలో పాకిస్తాన్ ఎంత నేర్పరి అన్న విషయం సౌదీకి అర్థమైంది. ఎందుకు పాక్ వెనక్కి తగ్గిందంటే.. దానికి లెక్కలు లేకపోలేవు. యెమెన్ లో హౌతీలపౌ పోరాడేందుకు తమ బలగాల్ని పంపేందుకు పాక్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. సౌదీ భూభాగాన్ని రక్షించే విషయంలో మాత్రం తమ బలగాల్ని మొహరిస్తామని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే విదేశీ గడ్డ మీద జరిగే ప్రత్యక్ష యుద్ధ కార్యకలాపాల్లో తాము పాల్గొనేది లేదని తెగేసి చెప్పినట్లుగా చెబుతున్నారు. ఈ తరహా వాదనను పాక్ నుంచి అంచనా వేయని సౌదీ ఇప్పుడు అవాక్కైనట్లుగా చెబుతున్నారు. నిజానికి హౌతీల పీచమణచాలంటే యెమెన్ కు సైన్యాన్ని పంపి వారి సంగతి చూడాలి. కానీ.. అందుకు పాక్ ఏ మాత్రం సిద్దంగా లేదు.

ఇప్పటికే ఇరాన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న సౌదీకి.. హౌతీలతో మరింత తలనొప్పి పెరిగింది. ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితి ఆ దేశానికి ఏర్పడలేదని చెబుతున్నారు. ఇజ్రాయెల్ - ఇరాన్ కు మధ్య జరుగుతున్న యుద్ధంతో.. అమెరికా సాంకేతిక సాయాన్ని అందిస్తుండటం.. దానికి మిత్రదేశంగా ఉన్న సౌదీకి కొత్త తిప్పలు తెచ్చి పెట్టిన పరిస్థితి. దీంతో ఎటూ పాలుపోని పరిస్థితుల్లో సౌదీ ఉందని చెబుతున్నారు.

మరోవైపు హౌతీలపై అమెరికా.. బ్రిటన్ లు సైతం ప్రత్యక్షంగా సైనిక చర్యలు తీసుకునే విషయంలో సానుకూలంగా స్పందించటం లేదని తెలుస్తోంది. అమెరికా నిఘా విభాగం సాయం చేస్తుంది కానీ.. యెమెన్ లో హౌతీలపై నేరుగా దాడులు చేయటానికి తాము సిద్ధంగా లేమని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో మిత్రుడు ఇజ్రాయెల్ సైతం సౌదీకి సాయం అంతంతగానే ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే.. ఇజ్రాయెల్ కానీ దాడులకు దిగితే.. హౌతీలు తమ వద్ద ఉన్న రాకెట్లతో ఇజ్రాయెల్ నగరాలపై దాడులకు పాల్పడే ప్రమాదం ఉంది. అందుకే.. ఇజ్రాయెల్ సైతం ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తోంది. ఇలా సౌదీకి ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాయంగా నిలవాల్సిన స్నేహితుడు చేయిచ్చేయటం.. మిగిలిన వారి నుంచి ఆశించినంత సహకారం లేకపోవటంతో సౌదీ విలవిలలాడుతోంది. ఇదంతా చూస్తున్న ప్రపంచ దేశాలు.. పాకిస్తాన్ వక్ర బుద్ధిపై కావాల్సినంత అవగాహన వచ్చినట్లుగా చెబుతున్నారు.