Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ ను నమ్ముకొని నిండా మునిగిన ‘సౌదీ’ వ్య(క)థ!

ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఇచ్చే బిల్డప్‌లకు.. నిజంగా రంగంలోకి దిగాల్సినప్పుడు ఇచ్చే ఎస్కేప్‌లకు పాకిస్థాన్‌ను మించిన మాస్టర్ మరొకరు ఉండరు.

By:  A.N.Kumar   |   12 Sept 2026 7:50 AM IST
పాకిస్తాన్ ను నమ్ముకొని నిండా మునిగిన ‘సౌదీ’ వ్య(క)థ!
X

ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఇచ్చే బిల్డప్‌లకు.. నిజంగా రంగంలోకి దిగాల్సినప్పుడు ఇచ్చే ఎస్కేప్‌లకు పాకిస్థాన్‌ను మించిన మాస్టర్ మరొకరు ఉండరు. ఇటీవల సౌదీ అరేబియా, తుర్కియేలతో కలిసి ‘మక్కా రక్షణ ఒప్పందం’పై పాక్ నేతలు సంతకాలు చేస్తుంటే.. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమా విజువల్స్ కనిపిస్తాయనుకున్నారంతా.. "మా మిత్రుడి జోలికి వస్తే శత్రువుల పేగులు తెంచుతాం" అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ తీరా యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ సరిహద్దులపై డ్రోన్లతో విరుచుకుపడే సరికి.. పాక్ సైన్యం బాణాలు పట్టుకుని వస్తుందనుకుంటే.. వెనక నుంచి మెల్లగా బిచాణా ఎత్తేసింది.

ఒప్పందం ప్రకారం.. సౌదీపై దాడి జరిగితే అది తమపై జరిగిన దాడిగానే భావించి హౌతీలపై విరుచుకుపడాలి. కానీ ఇస్లామాబాద్‌లోని పెద్ద మనుషులు మాత్రం "ఒక్క నిమిషం బాస్.. ముందు టెహ్రాన్ ఫోన్ కాల్ రానివ్వండి" అంటూ ప్లేటు ఫిరాయించారు. రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గారి డైలాగులు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. హౌతీలను అదుపు చేసే బాధ్యత ఇరాన్‌దేనట.. ఇరాన్ ఒక ఇస్లామిక్ సోదర దేశమని.. తమకు దానిపై బోలెడంత సానుభూతి ఉందంటూ కొత్త సెంటిమెంట్ రసవత్తరంగా పండించారు. అంటే సౌదీ రక్షణ కోసం పాక్ సైన్యం రావడం దేవుడెరుగు.. ముందు ఇరాన్ పర్మిషన్ లెటర్ తెచ్చుకోవాలన్నమాట!

ఇక విదేశాంగ శాఖ ప్రతినిధి సజ్జాద్ హైదర్ ఖాన్ గారైతే మరో అడుగు ముందుకేసి.. "ప్రస్తుతానికి సైనిక చర్యపై ఎలాంటి చర్చా లేదు.. టైమ్ వచ్చినప్పుడు చూసుకుందాం" అంటూ దండం పెట్టేశారు. ఒప్పందం సమయంలో కనిపించిన ఆవేశం.. ఈ ఆపద సమయంలో ‘కూల్’ అయిపోవడం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇరాన్‌కు హౌతీల మద్దతు ఉందనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు నేరుగా హౌతీలపై దాడి చేస్తే టెహ్రాన్ కోపగిస్తుందని.. అక్కడ దెబ్బతింటే ఆర్థికంగా మళ్లీ భిక్షాటన కష్టమవుతుందని పాకిస్థాన్ పక్కా లెక్కలు వేసుకుంది. మొత్తానికి పాక్ నయా దౌత్యనీతి ఏంటంటే "సౌదీతో ఫ్రెండ్‌షిప్.. ఇరాన్‌తో బ్రదర్‌షిప్.. హౌతీలతో మాత్రం సైలెంట్‌షిప్!"

అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు "శత్రువు తలుపు తడితే బద్దలు కొడతాం" అని రొమ్ము విరిచిన పాక్.. ఇప్పుడు తలుపు సందులోంచి తొంగిచూస్తూ "ఎవరొచ్చారో ముందు ఇరాన్‌ను అడిగి చెబుతాం" అనడం చూసి సౌదీకి పెద్ద సందేహమే వచ్చింది. అసలు ఆ మక్కా ఒప్పందం మీద పాకిస్థాన్ నిజంగా సంతకం చేసిందా? లేక కేవలం ఫొటోషూట్ కోసం పెన్ను పట్టుకుని ఫోజు ఇచ్చిందా? ఏది ఏమైనా మాటలు కోటలు దాటించడం లోను.. చేతలు సరిహద్దు దాటకుండా చూడటంలోనూ పాక్‌ను మించిన తోపు లేరని మరోసారి రుజువైంది.